పిల్లల జీవితాలు సులభతరం చేయడానికి పెద్దలు చిన్నతనంలోనే వారికి కొన్ని జీవిత పాఠాలు నేర్పడం అత్యవసరం. అప్పుడే వారు బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఎదుగుతారు. నిజానికి పిల్లలకు జీవిత పాఠాలు బోధించడం అంత తేలికైన పని కాదు. పిల్లలు అర్థం చేసుకునే వయసు కూడా ఉండదు. పిల్లల వయసుకు అర్థమయ్యేలాగా వివరించాలి. అందుకోసం మీకు ఎంతో సహనం అవసరం.
సహాయం
ఇది కచ్చితంగా మీ బిడ్డకు నేర్పించాల్సిన మొదటి ప్రధానమైన పాఠం. ఇతరులకు సహాయం చేయడం అనేది ఎంతో ముఖ్యమైనది. ఇది ఏ పాఠాలలో చెప్పరు. మీరే స్వయంగా వారికి నేర్పించాలి. ముందు మీరే వారికి అలవాటు చేయండి. ఇంట్లోనే మీకు పనులు చేసి పెట్టమని అడగండి. ఇతర కుటుంబ సభ్యులకు కూడా ఆహారాన్ని అందించడం, వారికి నీటిని అందించడం, చిన్న చిన్న పనులు ఇంట్లో చక్కబెట్టడం వంటివి నేర్పండి. అలాగే పొరుగువారితో కూడా సహాయం చేసేలా వారిని ఉత్సాహపరచండి. ఇది వారిలో మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందేలా చేస్తుంది.
మంచి మర్యాదలు
పిల్లలకు ఇతరులతో మంచిగా, మర్యాదగా ఎలా ప్రవర్తించాలో నేర్పాల్సిన అవసరం ఉంది. మంచి మర్యాదలు అనేవి పిల్లల సామాజిక నైపుణ్యాలను పెంచుతాయి. సమాజంలో వారి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి. మీ బిడ్డను ప్రేమగల వ్యక్తిగా నిర్మిస్తాయి. వారికి థాంక్యూ చెప్పడం నేర్పండి. ఎవరినైనా ఏదైనా అడుగుతున్నప్పుడు డిమాండ్ చేసినట్టు కాకుండా ‘ప్లీజ్’ అని అడుగుతూ రిక్వెస్ట్ చేయడం నేర్పండి.
పంచుకోవడం
‘షేరింగ్ ఈస్ కేరింగ్’ అని చెబుతూ ఉంటారు. ఇది పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాలి. ఇతరులతో పంచుకోవడం వల్ల రెట్టింపు ఆనందం దొరుకుతుందని చెప్పండి. బొమ్మల నుంచి ఆహారం వరకు చిన్నప్పటి నుంచే వారిని ఇతరులతో పంచుకోవడం అనేది నేర్పండి. దీనివల్ల వారు జీవితంలో భాగస్వాములుగా వ్యాపారంలో ఎదగగలుగుతారు. అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా మంచి భాగస్వామిగా ఉండగలుగుతారు.
రెస్పాన్సిబిలిటీ
పిల్లలకు నేర్పాల్సిన దాంట్లో బాధ్యత కూడా ప్రధానమైన పాఠమే. పిల్లలకు బాధ్యత యుతంగా ఉండడం నేర్పిస్తే వారి జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. డబ్బును ఆదా చేయడం, జాగ్రత్తగా ఖర్చు పెట్టడం, అవసరమైనంత మేరకే ఏ వస్తువునైనా వాడడం వంటివన్నీ బాధ్యతలు జాబితాలోకి వస్తాయి. ఇంట్లో వారిని జాగ్రత్తగా చూసుకోవడం, వారికి కష్టాల్లో తోడు ఉండడం కూడా బాధ్యతేనని చెప్పండి.