వృద్ధ జంటల్లో విడాకుల రేట్లు పెరిగిపోతున్నాయి. వయసులో ఉన్నప్పుడు విడాకులు తీసుకోవడం సర్వసాధారణం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. యాభై ఏళ్లు దాటిన వాళ్ళు 30 ఏళ్లు కలిసి జీవించిన వాళ్ళు విడాకుల తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఇలా 50 ఏళ్లు దాటాక విడాకులు తీసుకునే పద్ధతిని గ్రే విడాకులు అంటారు. ముఖ్యంగా మహిళలు స్వేచ్ఛ కోసం ఇలా గ్రే విడాకులు బారిన దారిలో నడుస్తున్నట్టు తెలుస్తోంది. నివేదికల ప్రకారం 65 ఏళ్లు పైబడిన వారిలో విడాకుల సంఖ్య పెరిగిపోయినట్టు గుర్తించారు.
గ్రే విడాకులు అంటే..
యాభై ఏళ్ల వయసు దాటిన తర్వాత విడాకులు తీసుకునే పద్ధతినే గ్రే విడాకులు అంటారు. అలా విడిపోయిన వృద్ధ జంటలను సిల్వర్ స్ప్లిటర్ అని కూడా పిలుస్తారు. 20 నుంచి 40 ఏళ్ల వరకు కలిసి జీవించిన జంటలు హఠాత్తుగా విడిపోవడం అనేది ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ ప్రపంచంలో ప్రస్తుతం గ్రే విడాకులు ట్రెండ్ పెరిగిపోతోంది. పిల్లలు ఉద్యోగాలు చేసుకుని పెళ్లిళ్లు చేసుకొని బయటికి వెళ్లిన తర్వాత ఈ ముసలి జంటలు విడాకుల బారిన పడుతున్నట్టు తెలుస్తోంది. తమ అవసరాలు, కోరికలు వంటివి తీర్చుకోవడం కోసం స్వేచ్ఛగా బతకడం కోసం జీవిత భాగస్వాములను వదిలించుకుంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.
గ్రే విడాకులకు కారణాలు
గ్రే విడాకులకు ముఖ్యమైన కారణం వివాహంలో దీర్ఘకాలికంగా పేరుకుపోయిన అసంతృప్తి. కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలని ఆశ. కొంతమంది పిల్లలకు భయపడి లేదా కొత్త జీవితాన్ని ఎలా ఆరంభించాలో తెలియక అదే జీవిత భాగస్వామితో బలవంతంగా కలిసి ఉంటారు. మనసులో అసంతృప్తి ఉన్నా కూడా వారు బయటకు వెళ్లేందుకు ఇష్టపడరు. వయసు పెరిగాక ఆ స్వేచ్ఛా, ధైర్యం వంటివి వస్తుంటాయి. పిల్లలు కూడా తమ పెళ్లిళ్లు పిల్లలతో బిజీగా ఉన్నప్పుడు వీరు విడాకులు తీసుకోవడానికి ధైర్యం చూపిస్తున్నారు.
అమెరికాలో విడాకులు తీసుకుంటున్న జంటల్లో 36 శాతం సీనియర్ జంటలే. అందుకే దీన్ని గ్రే విడాకులు అని పిలవడం ప్రారంభించారు. ఆధునిక కాలంలో పుట్టుకొచ్చిన పదమే గ్రే డైవర్స్. గ్రే విడాకులు తీసుకోవడానికి ఇష్టత చూపిస్తున్న వారిలో మహిళలే అధికంగా ఉన్నారు. వారు తమ స్వేచ్ఛ కోసం ఆ దీర్ఘకాలిక సంబంధాన్ని తెంపుకోవడానికి ఇష్టపడుతున్నారు.
గ్రే డైవర్స్ కి ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. పిల్లలు పెళ్లి చేసుకొని ఇంటిని విడిచిపెట్టి వెళ్లడం వల్ల ఆ ఇంట్లో చాలా పెద్ద మార్పులు కనిపిస్తాయి. తల్లిదండ్రులుగా తమ పాత్రల బాధ్యత పూర్తయ్యాక వారు మధ్య సాన్నిహిత్యం కూడా తగ్గిపోతుంది. అందుకే ఇద్దరూ వేర్వేరు దారులు వెతుక్కుంటూ ఉంటారు.
Also Read: ఇలా ఆలోచించే మహిళలు.. తమ బంధంలో ఇలాంటి తప్పులు చేయరట, వీరి నుంచి ఏం నేర్చుకోవాలంటే?
వృద్ధ జంటల మధ్య కూడా అపనమ్మకం అనే బీజం పడితే వారు గ్రే డైవర్స్ కు వెళ్తున్నట్టు తెలుస్తోంది. అలాగే కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కూడా వారు విడిపోతున్నట్టు చెబుతున్నారు. ఆర్థిక సమస్యలు కూడా వారు విడిపోవడానికి కారణాలుగా మారుతున్నాయి.
వయసు పెరిగే కొద్దీ కొంతమంది ప్రశాంతంగా ఒంటరిగా జీవించాలనుకుంటారు. తమకు నచ్చిన విధంగా నచ్చిన చోట ఉండాలనుకుంటారు. అలా వారి ప్రాధాన్యతలు, ఆసక్తులు అవసరాలకు తగ్గట్టు జీవించేందుకు జీవిత భాగస్వామిని విడిచిపెట్టి ఉంటారు. ఇవన్నీ కూడా గ్రే డైవర్స్ కు కారణాలే.