Vitamins For Hair Growth: ప్రస్తుతం చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ లోపం కూడా ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అందుకే ఆరోగ్యకరమైన, ఒత్తైన జుట్టు విటమిన్లు తీసుకోవడం అవసరం. మన శరీరానికి సరిపడా విటమిన్లు లభించినప్పుడు జుట్టు కుదుళ్ళు బలంగా మారి, ఆరోగ్యంగా పెరుగుతాయి. జుట్టు పెరుగుదలకు ముఖ్యంగా సహాయపడే 5 ముఖ్యమైన విటమిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. బయోటిన్ (విటమిన్ B7):
జుట్టు పెరుగుదలలో బయోటిన్ కీలక పాత్ర పోషిస్తుంది. దీనిని “జుట్టు విటమిన్” అని కూడా అంటారు. బయోటిన్ కెరాటిన్ ఉత్పత్తికి సహాయ పడుతుంది. కెరాటిన్ అనేది జుట్టు, చర్మం, గోర్లలో ఉండే ఒక ముఖ్యమైన ప్రొటీన్. బయోటిన్ లోపం వల్ల జుట్టు పలచబడటం, రాలిపోవడం వంటి సమస్యలు వస్తాయి.
వేటిలో లభిస్తుంది: గుడ్లు, బాదం, వాల్నట్స్, చిలగడదుంప, కాలీఫ్లవర్, పాలకూర.
2. విటమిన్ C:
విటమిన్ C ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయ పడుతుంది. కొల్లాజెన్ జుట్టు నిర్మాణానికి చాలా అవసరం. అంతేకాకుండా.. విటమిన్ C ఐరన్ శోషణకు కూడా సహాయ పడుతుంది. ఐరన్ లోపం వల్ల జుట్టు రాలే సమస్య వస్తుంది.
వేటిలో లభిస్తుంది: నారింజ, నిమ్మ, స్ట్రాబెర్రీ, ఉసిరి, క్యాప్సికమ్.
3. విటమిన్ D:
జుట్టు కుదుళ్ళను ఉత్తేజ పరచడంలో విటమిన్ D ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీని లోపం అలోపేసియా (బట్టతల) వంటి సమస్యలకు దారితీయవచ్చు. విటమిన్ D శరీరంలో జుట్టు కుదుళ్ళు కొత్తగా పెరగడానికి తోడ్పడుతుంది.
ఎక్కడ లభిస్తుంది: సూర్యరశ్మి, కొవ్వు చేపలు (సాల్మన్, ట్యూనా), గుడ్డు సొన, పుట్టగొడుగులు.
4. విటమిన్ E:
విటమిన్ E ఒక యాంటీఆక్సిడెంట్, ఇది జుట్టు కుదుళ్ళకు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ ఒత్తిడి జుట్టు రాలడానికి కారణం అవుతుంది. విటమిన్ E తలలో రక్త ప్రసరణను మెరుగుపరిచి.. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయ పడుతుంది.
వేటిలో లభిస్తుంది: సన్ ఫ్లవర్ సీడ్స్, బాదం, పాలకూర, అవోకాడో.
5. విటమిన్ A:
విటమిన్ A ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు అవసరం. ఇది సెబమ్ (సహజ నూనె) ఉత్పత్తిని నియంత్రిస్తుంది. సెబమ్ అనేది తలకు తేమను అందించి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి తోడ్పడుతుంది. కానీ, విటమిన్ A ఎక్కువగా తీసుకుంటే జుట్టు రాలడానికి కారణమవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
వేటిలో లభిస్తుంది: చిలగడదుంప, క్యారెట్, పాలకూర, గుమ్మడికాయ, గుడ్లు, చేపలు.
ఈ విటమిన్లను ఆహారం ద్వారా పొందడం ఉత్తమం. ఒకవేళ ఆహారం ద్వారా సరిపడా పోషకాలు అందకపోతే.. డాక్టర్ సలహా మేరకు సప్లిమెంట్లను తీసుకోవచ్చు. జుట్టు ఆరోగ్యానికి సరైన పోషకాలతో పాటు, మంచి నిద్ర, ఒత్తిడి లేని జీవనం కూడా చాలా ముఖ్యం.