Relationships After 30: ముప్పైల్లో అడుగుపెట్టాక పెళ్లి నిర్ణయం తీసుకోవడం ఒక ప్రత్యేకమైన అనుభవం. ఈ వయసులో మనకు నచ్చిన జీవితం, ఉద్యోగం, కొన్ని అలవాట్లు, అలాగే స్పష్టమైన అభిప్రాయాలు ఉంటాయి. అందుకే కేవలం ప్రేమ ఒక్కటే ఈ బంధాన్ని నడిపించలేదు. పెళ్లి పీటలు ఎక్కేముందే కొన్ని ముఖ్యమైన విషయాలపై ఒకరికొకరు స్పష్టత ఇచ్చుకోవడం చాలా అవసరం. జీవితాంతం హాయిగా సాగిపోవడానికి సహాయపడే ఆ 5 కీలకమైన సంభాషణలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ప్రేమ మనస్సుకు సంతోషాన్ని ఇస్తుంది. కానీ నెలవారీ ఈఎంఐలు కట్టడానికి డబ్బులే కావాలి. అందుకే మీరిద్దరూ సంపాదన, ఖర్చుల గురించి ముందే ఓపెన్‌గా మాట్లాడుకోవాలి. ఇంట్లో ఖర్చులు ఎవరు భరిస్తారు? కలసి ఎంత దాచాలి? విడిగా ఎంత దాచుకోవాలి.. అనేది తేల్చుకోవాలి. ఒకరి పొదుపు శైలి మరొకరికి నచ్చకపోవచ్చు. అందుకే వ్యక్తిగత ఖర్చుల సరిహద్దులు గీసుకోవడం వల్ల భవిష్యత్తులో డబ్బు గొడవలు రాకుండా ఉంటాయి.
30ల్లో ఇద్దరికీ ఉద్యోగాలు, లక్ష్యాలు ఉంటాయి. కెరీర్‌లో ప్రమోషన్లు వచ్చినప్పుడు లేదా ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినప్పుడు సంసారాన్ని ఎవరు ఎలా బ్యాలెన్స్ చేస్తారో చర్చించాలి. ఒకవేళ ఎవరికైనా లేఆఫ్స్ వచ్చి ఉద్యోగం పోతే.. ఆ సమయాన్ని ఆర్థికంగా, మానసికంగా ఎలా ఎదుర్కొంటారో ముందే అనుకోవడం మంచిది. వర్క్, లైఫ్ రెండింటిలో దేనికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో స్పష్టత ఉంటే అనవసరమైన అపోహలు రావు.
Also Read: 45 రోజుల పాటు రోజుకో అరటిపండు తింటే బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?
చాలామంది ‘తర్వాత చూసుకుందాంలే’ అని వదిలేసే విషయం ఇది. కానీ పిల్లలు కావాలా వద్దా అనే దానిపై ఇద్దరికీ ఒకే అభిప్రాయం ఉండాలి. ఒకరికి పిల్లలు కావాలి, మరొకరికి వద్దంటే అది పెద్ద సమస్యగా మారుతుంది. పిల్లలు కావాలనుకుంటే ఎప్పుడు, ఎంతమంది అనే విషయంతో పాటు, వారి పెంపకంలో ఇద్దరి బాధ్యత ఎలా ఉంటుందో మాట్లాడుకోవాలి.
బంధంలో గొడవలు రావడం సహజం. అయితే గొడవ వచ్చినప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారనేది ముఖ్యం. సమస్య రాగానే ఒకరు మౌనంగా ఉండిపోతారా, లేక అరిచి రచ్చ చేస్తారా అనేది తెలుసుకోవాలి. గొడవ పడటం కంటే.. ఆ తర్వాత దాన్ని ఎలా సర్దుబాటు చేసుకుంటారనేదే బంధం నిలవడానికి కీలకం. మనసు గాయపడకుండా గొడవలను పరిష్కరించుకునే మార్గం వెతకాలి.
పెళ్లి జీవితం ప్రతిరోజూ సంతోషంగా ఉండదు. కొన్నిసార్లు విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. అలాంటి సమయాల్లో భాగస్వామి నుండి ఎలాంటి సపోర్ట్ కోరుకుంటున్నారో చెప్పాలి. మిమ్మల్ని ఏ విషయాలు ఎక్కువగా అలసిపోయేలా చేస్తాయి, మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచడానికి భాగస్వామి ఏం చేయగలరో పంచుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ తోడుగా నిలవడమే ఈ వయసులో చేసుకునే పెళ్లికి నిజమైన అర్థం.
Also Read: 32 కేజీల బరువు తగ్గిన ఇన్‌ఫ్లుయెన్సర్.. ఆ 5 ఆహారాలను దూరం పెట్టడం వల్లే అంటూ సీక్రెట్ రివీల్!