Banana Health Benefits: మనకు ఏడాది పొడవునా అతి తక్కువ ధరకు, అందుబాటులో ఉండే పండ్లలో అరటిపండు ముందు వరుసలో ఉంటుంది. ఉదయం టిఫిన్‌తో పాటైనా, వర్కవుట్ ముందు ఎనర్జీ కోసమైనా చాలామంది దీన్ని ఇష్టంగా తింటారు. మరి వరుసగా 45 రోజుల పాటు రోజుకు ఒక అరటిపండు తింటే మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
వంద గ్రాముల అరటిపండులో దాదాపు 89 కేలరీలు, 22 గ్రాముల పిండి పదార్థాలు, 2.6 గ్రాముల పీచు పదార్థం ఉంటాయి. దీంతో పాటు పొటాషియం, విటమిన్ బి6, విటమిన్ సి లాంటి ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తూ రోజువారీ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
అరటిపండులో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది రక్తనాళాల్లో ఒత్తిడిని తగ్గించి, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చని పలు అధ్యయనాలు కూడా స్పష్టం చేస్తున్నాయి.
Also Read: 32 కేజీల బరువు తగ్గిన ఇన్‌ఫ్లుయెన్సర్.. ఆ 5 ఆహారాలను దూరం పెట్టడం వల్లే అంటూ సీక్రెట్ రివీల్!
దీనిలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి ఇది మంచి ఉపశమనం కలిగిస్తుంది. కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియాను పెంచి, తిన్న ఆహారం సరిగ్గా అరిగేలా సహాయపడుతుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి.
వ్యాయామం చేసే ముందు లేదా రోజంతా నీరసంగా అనిపించినప్పుడు అరటిపండు తింటే తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్ బి6 మెదడులో సెరోటోనిన్ హార్మోన్ విడుదలకు తోడ్పడుతుంది. ఇది మనసును ప్రశాంతంగా ఉంచి, రోజంతా మంచి మూడ్‌లో ఉండేలా సహాయపడుతుంది.
అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మంచిదే అయినప్పటికీ.. అధిక బరువు తగ్గాలనుకునేవారు కేలరీలను దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే తీవ్రమైన మూత్రపిండాల (కిడ్నీ) సమస్యలతో బాధపడేవారు శరీరంలో పొటాషియం స్థాయిలు పెరగకుండా ఉండటానికి, రోజూ తినే ముందు వైద్యుల సలహా తీసుకోవడం చాలా మంచిది.
Also Read: బిగుతుగా ఉన్న బ్రా వేసుకుంటే రొమ్ము క్యాన్సర్ వస్తుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..