Kidney Disease: కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి సరైన ఆహారం తీసుకోవడం చాలా కీలకం. కిడ్నీలు సరిగా పనిచేయనప్పుడు.. శరీరంలో సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి.. ఆహారం ద్వారా వీటిని నియంత్రించడం చాలా ముఖ్యం. మన దేశీ వంటకాల్లో, కిడ్నీ రోగులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు చాలా ఉన్నాయి. వీటిలో తక్కువ ఉప్పు, తక్కువ పొటాషియం, తక్కువ ఫాస్ఫరస్ ఉండేలా చూసుకోవాలి.
1. అన్నం: కిడ్నీ రోగులకు గోధుమలతో పోలిస్తే తెల్ల అన్నం సురక్షితమైన ఎంపిక. ఎందుకంటే తెల్ల అన్నంలో పొటాషియం, ఫాస్ఫరస్ వంటివి చాలా తక్కువగా ఉంటాయి.
ఇడ్లీ, దోస: పులియబెట్టిన ఈ పదార్థాలు జీర్ణక్రియకు మంచివి. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్‌లో ఇడ్లీ లేదా ప్లెయిన్ దోస తినొచ్చు. మినపప్పును మాత్రం పరిమితంగా వాడాలి.
అన్నం: ఉప్పు లేకుండా వండిన తెల్ల అన్నం రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు.
2. తక్కువ పొటాషియం ఉన్న కూరగాయలు :
కిడ్నీ రోగులు కొన్ని కూరగాయలను పరిమితంగా తీసుకోవాల్సి ఉంటుంది. తక్కువ పొటాషియం ఉన్న దేశీ కూరగాయలను ఎంచుకోవడం చాలా మంచిది.
సొరకాయ: ఇది కిడ్నీలకు చాలా మంచిది. దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉండి.. పొటాషియం తక్కువగా ఉంటుంది.
వంకాయ: తక్కువ పొటాషియం ఉండే మరొక కూరగాయ. మసాలాలు లేకుండా సాధారణంగా వండిన వంకాయ కూర సురక్షితం.
క్యాబేజీ: ఇది కిడ్నీలకు మేలు చేసే విటమిన్లు, ఫైబర్ కలిగి ఉంటుంది.
ముల్లంగి : తక్కువ పొటాషియం ఉన్న కూరగాయలలో ఇది కూడా ఒకటి. దీని ఆకులను కాకుండా దుంపను వాడుకోవడం మంచిది.
‘లీచింగ్’ పద్ధతి: పొటాషియం ఎక్కువగా ఉండే బంగాళదుంపలు, క్యారెట్లు వంటి కూరగాయలను నీటిలో చిన్న ముక్కలుగా కట్ చేసి, ఎక్కువ సేపు నానబెట్టి, ఆ నీటిని మార్చి మళ్లీ ఉడికించడం ద్వారా పొటాషియం స్థాయిని తగ్గించవచ్చు.
3. ఆరోగ్యకరమైన పప్పు ధాన్యాలు:
పప్పు ధాన్యాలలో ప్రోటీన్, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. కిడ్నీ రోగులు ప్రోటీన్‌ను పరిమితంగా తీసుకోవాలి. డాక్టర్ సలహా మేరకు, పెసర పప్పు లేదా కంది పప్పు వంటి పప్పులను తక్కువ మోతాదులో.. పలుచగా (డైల్యూటెడ్) చేసుకుని తీసుకోవచ్చు.
4. స్నాక్స్:
పోహా : పోహాలో ఉప్పు, నూనె తక్కువగా వాడి.. తక్కువ పొటాషియం కూరగాయలతో తయారుచేస్తే ఆరోగ్యకరమైన ఆహారం.
పాప్‌కార్న్: ఉప్పు లేకుండా ఇంట్లో తయారు చేసిన పాప్‌కార్న్‌ను కొద్ది మొత్తంలో తీసుకోవచ్చు.
5. డ్రింక్స్:
నీరు: ద్రవ పదార్థాల పరిమాణం గురించి డాక్టర్ సలహా తప్పనిసరి. సాధారణంగా.. నిమ్మరసం సురక్షితమైనవి.
తక్కువ పొటాషియం ఉన్న పండ్లు: యాపిల్స్, బేరి పండ్లు, పైనాపిల్, బెర్రీలు, ద్రాక్ష, పుచ్చకాయల వంటి వాటిని తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: పానీ పూరి తింటున్నారా ? అయితే ఇది మీ కోసమే !
ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన చిట్కాలు:
ఉప్పు తగ్గించడం: ఆహారంలో అదనపు ఉప్పు వాడకాన్ని పూర్తిగా మానేయండి. ఉప్పు స్థానంలో అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, నిమ్మరసం (పరిమితంగా) వంటి సహజ సుగంధ ద్రవ్యాలతో రుచిని పెంచండి.
ప్యాకేజ్డ్ ఫుడ్ వద్దు: నిల్వ ఉంచిన పదార్థాలు, ఊరగాయలు, రెడీమేడ్ ఆహారాలలో సోడియం, సంరక్షక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.
డాక్టర్ సలహా: కిడ్నీ రోగుల ఆహారం వారి వ్యాధి దశ, రక్త పరీక్షల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి.. ఈ ఆహార నియమాలను పాటించే ముందు నెఫ్రాలజిస్ట్ లేదా కిడ్నీ డైటీషియన్ సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.