relationship habits for busy couples| కొందరు తమ జీవితంలో చాలా బిజీగా ఉంటారు. ఉదయం మొదలైన పనులు రాత్రి వరకు కొనసాగుతుంటే, జీవిత భాగస్వామికి సమయం కేటాయించడం కష్టంగా మారుతుంది. ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత పనులతో రోజంతా బిజీగా గడిచిపోతుంది. చివరికి జీవిత భాగస్వామితో మాట్లాడేది కూడా “డిన్నర్ ఆర్డర్ చేశావా?” లేదా “ఎప్పుడు ఇంటికి వస్తావు?” అనే ప్రశ్నలకే బంధం పరిమితమవుతుంది.
అయితే బిజీగా ఉండటం వల్ల బంధంలో దూరం పెరగాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ గంటల కొద్దీ సమయం కేటాయించాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని చిన్న అలవాట్లను పాటిస్తే, తక్కువ సమయంలోనే భాగస్వామితో మంచి అనుబంధాన్ని కొనసాగించవచ్చు.
ప్రతిరోజూ కనీసం 10 నిమిషాలు భాగస్వామితో మాట్లాడేందుకు కేటాయించండి. ఆ రోజు ఎలా గడిచిందో తెలుసుకోవడంతో పాటు, వారికి ముఖ్యమైన విషయాలను అడగండి. వారు చెప్పే విషయాలను శ్రద్ధగా వినండి. ఫోన్ చూస్తూ లేదా ఇతర పనులు చేస్తూ మాట్లాడకుండా, ఆ సమయంలో పూర్తిగా వారి మాటలపై దృష్టి పెట్టండి. ఇంటిపనులు, బిల్లులు, పిల్లలు లేదా భోజనం గురించి మాత్రమే మాట్లాడకుండా భావాలు, ఆందోళనలు, సంతోషాలను కూడా పంచుకోండి.
బిజీ జీవితంలో ఖాళీ సమయం దొరికినప్పుడు కలిసి ఉండాలని ఎదురుచూస్తే, ఆ సమయం తరచుగా రాకపోవచ్చు. అందుకే ముందుగానే కలిసి గడిపే సమయాన్ని నిర్ణయించుకోండి. వారానికి ఒకరోజు కలిసి భోజనం చేయవచ్చు. ఇంట్లో సినిమా చూడవచ్చు లేదా సాయంత్రం కలిసి వాకింగ్‌కు వెళ్లవచ్చు. ఆ సమయాన్ని ముఖ్యమైన అపాయింట్‌మెంట్‌లా భావించండి. అవసరం లేకుండా ఆ ప్లాన్‌ను తరచుగా వాయిదా వేయకండి.
భాగస్వాముల షెడ్యూల్స్ వేర్వేరుగా ఉన్నప్పుడు చిన్న రొటీన్‌లు అనుబంధాన్ని పెంచుతాయి. ఉదయం కలిసి కాఫీ తాగడం ఒక మంచి అలవాటుగా మారవచ్చు. నిద్రపోయే ముందు మాట్లాడటం లేదా బిజీ రోజులో సరదా వీడియో పంపడం కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి చిన్న విషయాలకు ఎక్కువ సమయం అవసరం లేదు. వాటిని క్రమం తప్పకుండా పాటించడం వల్ల ఇద్దరి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతుంది.
Also Read: చిన్న విషయాలకే మీ లవర్ కోపం తెచ్చుకుంటున్నారా? ఈ 5 టిప్స్ మీ కోసమే
భాగస్వామి మనసులో ఏముందో ఎప్పుడూ అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. వారు మీ అవసరాలను ఊహించాలని ఆశించడం అపార్థాలకు దారితీయవచ్చు. మీకు మాట్లాడాలని అనిపిస్తే, ఆ విషయాన్ని నేరుగా చెప్పండి. “ఈ రోజు కొంత సమయం నాతో మాట్లాడగలవా?” అని అడగడం మంచిది. ఇలా స్పష్టంగా మాట్లాడితే ఇద్దరికీ ఒకరి అవసరాలు మరొకరికి బాగా అర్థమవుతాయి.
కలిసి గడిపే సమయం తక్కువగా ఉన్నప్పుడు దాని విలువ మరింత పెరుగుతుంది. ఆ సమయంలో పని మెసేజ్‌లు, సోషల్ మీడియా వంటి వాటికి దూరంగా ఉండండి. ఇద్దరూ ఫోన్‌లలో మునిగిపోతే, పక్కపక్కనే ఉన్నా భావోద్వేగంగా దూరంగా ఉన్నట్లే అనిపిస్తుంది. చిన్న సమయమైనా పూర్తి శ్రద్ధతో గడిపితే మంచి అనుభూతి కలుగుతుంది.
Also Read: మీరు నమ్మిన వ్యక్తి మోసం చేస్తే నిశ్శబ్దంగా సహించాల్సిన అవసరం లేదు.. చాణక్యుడు ఏం చెప్పాడంటే
బిజీ షెడ్యూల్ కారణంగా బంధం బలహీనపడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ చేసే చిన్న ప్రయత్నాలు ఇద్దరి మధ్య అనుబంధాన్ని కాపాడగలవు. బంధానికి అదనంగా గంటలు వెతకడం కంటే, ఇప్పటికే ఉన్న సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం ముఖ్యం. మాట్లాడటం, కలిసి సమయం గడపడం, చిన్న రొటీన్‌లు పాటించడం, అవసరాలను చెప్పడం వంటి అలవాట్లు బంధాన్ని మరింత బలపరుస్తాయి.