Foods For Muscle Growth| రోజూ జిమ్‌కు వెళ్లేవారు, ఇంట్లోనే వ్యాయామాలు చేసేవారు, శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి వ్యాయామంతో పాటు సరైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా కండరాలు సరిగ్గా పనిచేయడానికి, శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడటానికి పొటాషియం అనే ఖనిజం అవసరం. ఇది లోపిస్తే కండరాల బలహీనత, అలసట వంటి సమస్యలు రావచ్చు. మరి శరీరానికి అవసరమైన పొటాషియం ఏ ఫుడ్స్‌లో లభిస్తుంది? రోజువారీ డైట్‌లో చేర్చుకోవాల్సిన 7 ఆహారాల గురించి తెలుసుకుందాం.
పొటాషియం మన కండరాలు, నరాలు సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. కండరాలు సంకోచించడానికి, తిరిగి విశ్రాంతి పొందడానికి అవసరమైన సంకేతాలను నరాలు పంపడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే శరీరంలో నీరు, ఇతర ద్రవాల సమతుల్యత కాపాడుతుంది. పొటాషియం లెవెల్స్ తగ్గితే కండరాల బలహీనత, అలసట, తిమ్మిరి వంటి లక్షణాలు కనిపించవచ్చు.
అరటిపండ్లలో పొటాషియంతో పాటు కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి వ్యాయామానికి అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడతాయి. వర్కౌట్‌కు ముందు లేదా తర్వాత అరటిపండు తినవచ్చు.
బంగాళాదుంపల్లో పొటాషియం, కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. ఉడికించిన లేదా కాల్చిన బంగాళాదుంపలను ఆహారంలో తీసుకోండి.
పాలకూరలో పొటాషియంతో పాటు ఫోలేట్, విటమిన్ కె ఉంటాయి. పప్పు, కూరలు, సూప్‌ల రూపంలో తీసుకోవచ్చు.
కొబ్బరి నీటిలో పొటాషియం ఉంటుంది. వ్యాయామం తర్వాత ద్రవాలను భర్తీ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఎక్కువసేపు వ్యాయామం చేసేవారికి అదనపు ఎలక్ట్రోలైట్లు అవసరమవవచ్చు.
కందిపప్పు, రాజ్మా, శనగల్లో పొటాషియంతో పాటు ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి సమతుల ఆహారంలో ముఖ్యమైన భాగం.
Also Read: భర్త కౌగిలించుకోగానే విరిగిన భార్య పక్కటెముకలు.. అతని తప్పులేదన్న డాక్టర్లు
పెరుగులో పొటాషియం, ప్రోటీన్, కాల్షియం ఉంటాయి. పండ్లు లేదా ఓట్స్‌తో కలిపి తీసుకోండి.
అవకాడోలో పొటాషియం, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. సలాడ్లు, శాండ్‌విచ్‌లలో చేర్చుకోండి.
Also Read: గంజాయి, డ్రగ్స్ వ్యసనంతో బాధపడుతున్నారా? ఈ దురలవాటు మానేయడానికి మార్గాలివే
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. పెద్దలు రోజుకు కనీసం 3,510 మిల్లీగ్రాముల పొటాషియం తీసుకోవాలి. అయితే మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు లేదా కొన్ని మందులు వాడేవారు వైద్యుల సలహా తీసుకోవాలి. అవసరం లేకుండా పొటాషియం సప్లిమెంట్లు వాడకూడదు.
కండరాల ఆరోగ్యానికి పొటాషియం అవసరమే అయినా, ఇది ఒక్కటే కండరాల బలాన్ని పెంచదు. సమతుల ఆహారం, తగినంత ప్రోటీన్, నీరు, క్రమమైన వ్యాయామం, సరైన విశ్రాంతి కలిపి పాటిస్తే మెరుగైన ఫలితాలు పొందవచ్చు.