ఈజిప్ట్ సమాధుల గురించి ఎంతోమందికి ఆసక్తి ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత వింతైన పద్ధతులు ఈజిప్ట్ లోనే బయటపడ్డాయి. మమ్మీల రూపంలో శవాలను మార్చి వారి సమాధులను కూడా విచిత్రంగా కట్టడం ఈజిప్టుకే చెల్లింది. అలా 1922లో టుటన్ఖామున్ అనే ఈజిప్టు రాజు సమాధిని తెరిచారు. టుటన్ఖామున్ చాలా చిన్న వయసులోనే మరణించిన ఈజిప్టు ఫారో. ఆ సమాధి తెరిచిన తర్వాత ఎన్నో విచిత్రమైన సంఘటనలో జరగడం ప్రారంభమయ్యాయి.
ఆ రాజు శాపం వల్లేనా?
టుటన్ఖామున్ సమాధి తెరిచిన వారిలో ఎంతోమంది ఇప్పుడు చనిపోయారు. వారి మరణం అంతుచిక్కని రహస్యంగానే ఇప్పటికీ చెప్పుకుంటారు. సమాధిని తెరవడం వల్ల ఆ రాజు శాపం తగిలి వారంతా మరణించారని కొంతమంది అభిప్రాయం. అయితే సైన్స్ ఏ విషయాన్ని త్వరగా ఒప్పుకోదు. ప్రతిదానికి ఒక శాస్త్రీయ నిర్ధారణ కావాలి. శాస్త్రవేత్తలు అదే పనిలో పడి ఆ విషయాన్ని తేల్చి చెప్పారు.
శిలీంధ్రాల వల్లే
టుటన్ఖామున్ సమాధిని తెరిచిన చాలామంది చనిపోవడానికి కారణం రాజు శాపం కాదని, సమాధుల్లో పెరిగిన ప్రమాదకరమైన శిలీంద్రమని చెప్పారు. వందల సంవత్సరాల తర్వాత ఈ సమాధిని తెరవడంతో అక్కడ ఆస్పర్‌గిల్లస్ ఫ్లెవస్ అనే శిలీంధ్రం విపరీతంగా పెరిగిపోయిందని శాస్త్రవేత్తలు వివరించారు. వాటి బీజాంశాలు గాలిలో కలిసిపోయాయని, సమాధిని తెరవగానే అక్కడున్న వారి శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశించాయని వివరించారు.
ఆ శిలీంధ్రం ఇన్ఫెక్షన్ కు గురై రోగనిరోధక శక్తి బలహీనపడి ఎంతోమంది మృతి చెందారని చెప్పారు. టుటన్ఖామున్ సమాధిని కనుగొనడంలో ముఖ్యపాత్ర పోషించింది లాస్ట్ కార్నావన్ అతడు కూడా ఈ ఫంగస్ కారణంగానే నిమోనియా బారినపడి మరణించినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ ఎంతోమంది ఇప్పటికి ఆ రాజు శాపం వల్లే మరణించాడని అంటారు.
శిలీంధ్రాలతో క్యాన్సర్ మందు
అయితే పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం పరిశోధకులు మాత్రం ఎంతోమంది మరణానికి కారణమైన ప్రమాదకరమైన శిలింద్రం ఆస్పెర్‌గిల్లస్ ఫ్లేవస్ క్యాన్సర్ కణాలను తొలగించవచ్చని చెబుతున్నారు. ఆ శిలీంధ్రాలతో వారు ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేశారు. ఆ ఫంగస్ నుండి ఆస్పరిజిమైసిన్లు అనే నాలుగు కొత్త రకాల పెప్టైడ్లను వేరు చేశారు. ఈ పెప్టైడ్ల సాయంతో శరీరంలోని క్యాన్సర్ కణాలను పెరగకుండా అడ్డుకోవచ్చని చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ పరిశోధన ట్రయల్స్ లోనే ఉన్నాయి. ఈ ట్రయల్స్ విజయవంతం అయితే క్యాన్సర్ చికిత్సలో ఇది ఒక మైలురాయిగా మారిపోవడం ఖాయం. ఎంతోమంది క్యాన్సర్ రోగులకు ఈ శిలీంధ్రం సాయంతో చికిత్సను అందించవచ్చు.
వందేళ్ళ క్రితం తెరిచిన సమాధిలోని శిలీంద్రం ఇప్పుడు క్యాన్సర్ అధ్యయనంలో కీలకంగా మారడం శాస్త్రవేత్తలనే కాదు ఎంతో మందిని ఆశ్చర్యపరుస్తోంది. శాస్త్రవేత్తల ప్రయోగం పరిశోధన విజయవంతం అయితే ప్రపంచంలో క్యాన్సర్ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్యను చాలా వరకు తగ్గించవచ్చు.