Mahabodhi tree health check: ఒక సాధారణ చెట్టుకు శాస్త్రవేత్తలు వైద్య పరీక్షలు నిర్వహించారంటే ఆశ్చర్యంగా అనిపించకమానదు కదా? పైగా చెట్టుకు స్వయంగా శాస్త్రవేత్తలే హెల్త్ టెస్టులు చేసి, ఫలితాలు ప్రకటించారంటే అసలు విషయం ఏంటా అని తెలుసుకోవాలనిపిస్తుంది. ఇలా చెట్టు ఆరోగ్యం చెక్ చేయడానికి ఎందుకు ఈ ప్రయత్నం? ఆ చెట్టు ఇంత ప్రత్యేకమైనదా? ఎక్కడ ఉంది? ఎవరు పరీక్షించారు? అసలు దీనికి అంత ప్రాధాన్యత ఎందుకు? అన్నదే ఇప్పుడు అంతటా చర్చ.
ఇక్కడ మాట్లాడుతున్న చెట్టు ఒక సామాన్య మొక్క కాదు. ఇది చరిత్రలో ఒక ముఖ్య ఘట్టానికి సాక్షిగా నిలిచిన పవిత్ర మహాబోధి చెట్టు. ఇది బీహార్ రాష్ట్రంలోని బుద్ధగయ ప్రాంతంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధ మహాబోధి ఆలయం లో ఉంది. ఈ చెట్టు క్రిందే గౌతమ బుద్ధుడు ధ్యానం చేసి బోధి సాధించాడనే విశ్వాసం ఉన్నందున, ఇది కేవలం ఒక మొక్క కాదు.. ఇది ఒక ధార్మిక చిహ్నం, ఒక ఆధ్యాత్మిక స్థంభంగా భక్తులు భావిస్తారు.
చెట్టుకు హెల్త్ చెకప్..
ఇటీవల ఈ చెట్టు ఆరోగ్యంపై శాస్త్రీయ అధ్యయనం నిర్వహించారు. ఈ పరిశీలనను ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్ లో ఉన్న ప్రముఖ అటవీ పరిశోధన సంస్థ (Forest Research Institute – FRI) నిపుణులు చేశారు. ఈ టీమ్ బుద్ధగయ చేరుకుని చెట్టు మొత్తం స్థితిని పరిశీలించారు. చెట్టు ఎత్తు, కొమ్మలు, ఆకులు, వేళ్ళ పైన ఉండే కీటకాల జాడల్ని మినహాయించకుండా పరిశీలించారు.
వారు చెట్టును పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత ఇచ్చిన నివేదిక ప్రకారం.. చెట్టు అద్భుతమైన ఆరోగ్య స్థితిలో ఉంది. అయితే వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో కొన్ని చిన్న కొమ్మలపై కొద్దిపాటి పిండి పురుగుల ముట్టడి కనిపించిందని తెలిపారు. ఇది ఆందోళన చెందాల్సిన విషయం కాదని వారు స్పష్టం చేశారు. పైగా, వారి పర్యవేక్షణలోనే అవసరమైన రసాయన స్ప్రేలు చల్లారు. ఇది చెట్టు ఆరోగ్యాన్ని మరింతగా మెరుగుపరిచేందుకు సహాయపడుతుందని స్థానికులు తెలిపారు.
ఈ చెట్టు.. ఎందుకింత స్పెషల్!
ఈ చెట్టు ప్రత్యేకత ఏంటంటే.. ఇది సుమారు 2,300 ఏళ్ల పూర్వానికి చెందిన వారసత్వ మొక్క. గౌతమ బుద్ధుడు సాక్షాత్తుగా దీని కింద ధ్యానం చేసిన స్థలంగా గుర్తింపు పొందిన మహాబోధి ఆలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందింది. బౌద్ధమతానికి చెందిన అనేక మంది జ్ఞానులు ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో ఈ చెట్టును దర్శించేందుకు వస్తారు. అంతటా పుణ్య క్షేత్రాలకి ఉన్న ప్రాధాన్యత కన్నా ఎక్కువగా దీనికి ఉండడం వింతేమీ కాదు.
ఏం తేల్చారు?
ఈ చెట్టును సంవత్సరంలో కనీసం 2 సార్లు శాస్త్రీయంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చెట్టుపై మానవ ప్రభావం అధికంగా ఉంటుంది. వేలాది మంది భక్తులు రోజు రోజుకూ దీన్ని తాకడం, ఫోటోలు తీయడం, దీని చుట్టూ ప్రదక్షిణలు చేయడం వంటివి జరుగుతుంటాయి. ఇది చెట్టుకు సహజమైన జీవన వ్యవస్థపై ప్రభావం చూపవచ్చు. అందుకే ప్రభుత్వ మరియు అటవీ శాఖలు దీని పరిరక్షణకు కట్టుబడి ఉండి శాస్త్రవేత్తల సహాయంతో పర్యవేక్షణ చేపడతాయి.
ఇటీవలి వైద్య పరీక్షలో చెట్టు ఆరోగ్యం నిలకడగా ఉండటం, పెద్దగా ప్రమాదం లేదన్న విషయం శాంతియుత సందేశంగా భావించొచ్చు. ఈ చెట్టును చూసేందుకు ప్రపంచం నలుమూలల నుండి భక్తులు వచ్చే స్థితిలో, దీని ఆరోగ్యంపై శాస్త్రీయంగా శ్రద్ధ పెట్టడం తప్పనిసరి. అదృష్టంగా ఈసారి చెట్టు ఆరోగ్యంగా ఉండడం అందరికీ ఊరటనిచ్చే విషయమే.