పిల్లలకు బంగాళదుంప అంటే ఎంతో ఇష్టం. కానీ పాలకూరను పెడితే తినరు. కాబట్టి వారిచేత పాలకూర తినిపించాలనుకుంటే ఇక్కడ మేము చెప్పిన విధంగా పాలకూర పొటాటో పులావ్ చేసేందుకు ప్రయత్నించండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా అందులో బంగాళదుంప ముక్కలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి పిల్లలు తినేస్తారు. ఈ పలావ్ చేసినప్పుడు పాలకూర పచ్చివాసన కూడా రాదు. చాలా రుచిగా ఉంటుంది. అన్నాన్ని గ్రీన్ కలర్ లోకి మార్చేస్తుంది. పిల్లలకు గ్రీన్ రైస్ అని చెప్పి మీరు దీన్ని తినిపించేయవచ్చు. దీనివల్ల పాలకూర వారి శరీరంలో చేరుతుంది. ఇక రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
కావలసిన పదార్థాలు
పాలకూర – రెండు కట్టలు
లవంగాలు – నాలుగు
యాలకులు – రెండు
పసుపు – పావు స్పూను
నూనె – రెండు స్పూన్లు
కారం – ఒక స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
అల్లం వెల్లుల్లి పేస్టు – రెండు స్పూన్లు
గరం మసాలా – ఒక స్పూను
పచ్చిమిర్చి – నాలుగు
కొత్తిమీర తరుగు – పావు కప్పు
ఉల్లిపాయలు – రెండు
బంగాళదుంపలు – రెండు
క్యారెట్లు – రెండు
ఉప్పు – రుచికి సరిపడా
బాస్మతి బియ్యం – రెండు కప్పులు
పాలక్ పొటాటో పలావ్ రెసిపీ
1. బాస్మతి బియ్యాన్ని ముందుగానే కడిగే 10 నిమిషాలు నానబెట్టుకోవాలి.
2. ఇప్పుడు బంగాళదుంపలను, క్యారెట్లను ముక్కలుగా చేసి పక్కన పెట్టాలి.
3. కొత్తిమీరను, పాలకూరను కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
4. పాలకూర వీలైనంత సన్నగా తరిగితే మంచిది. అది అన్నంలో బాగా కలిసిపోయేటట్టు చేయాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయండి.
6. అందులో యాలకులు, లవంగాలు వేసి వేయించండి.
7. ఇప్పుడు నిలువుగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి వేయించండి.
8. ఉల్లిపాయలు రంగుమారే వరకు వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపండి.
9. ఇప్పుడు అదే మిశ్రమంలో పాలకూర తరుగు కూడా వేసి బాగా కలపండి.
10. పాలకూర నుంచి కాసేపటికి నీరు దిగుతుంది.
11. ఆ సమయంలోనే బంగాళదుంప ముక్కలను క్యారెట్ ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోండి.
12. రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. పాలకూర నుంచి నీరు దిగి ఇంకిపోయేదాకా ఉడికించండి.
13. ఆ తర్వాత పసుపు, కారం, గరం మసాలా వేసి బాగా కలపండి.14. కొత్తిమీర తరుగును కూడా వేసి బాగా కలపండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని అందులో వేసి కలుపుకోండి.
15. ఆ బియ్యం ఉడకడానికి సరిపడా నీటిని వేయండి.
16. ఒకసారి గరిటెతో కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి.17. సరిపోకపోతే మరి కొంచెం వేయండి. పైన మూత పెట్టి బియ్యం ఉడికే వరకు చిన్న మంట మీద ఉంచండి.
18. ఒక 20 నిమిషాలలో బియ్యం ఉడికిపోతాయి.
19. మూత తీస్తే ఘుమఘుమలాడే పాలకూర బంగాళదుంప పలావు రెడీ అయిపోతుంది.
20. ఈ పాలకూర పొటాటో పలావ్ పిల్లలకు చాలా నచ్చుతుంది.21. ఒక్కసారి తిన్నారంటే వారు మళ్లీ మళ్లీ మిమ్మల్ని అడుగుతారు. ఇంకెందుకు ఆలస్యం ఈరోజే వారికి ఈ రెసిపీ పెట్టి చూడండి.
పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పాలకూరను తినమంటే పిల్లలు తినరు. నిజానికి పాలకూర తినడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పిల్లల బరువు సమతుల్యంగా ఉంటుంది. చదువుకునే పిల్లలకు పాలకూర పెట్టడం చాలా అవసరం. ఇది వారి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే పెద్దలు కూడా పాలకూరను తరచూ తినడం వల్ల వారి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అయితే డయాబెటిస్ రోగులు ఈ పాలకూర పొటాటో పలావ్ తినకపోతేనే ఉత్తమం. ఎందుకంటే ఇందులో మనం బంగాళదుంప ముక్కలను వేసాము. అది కూడా ఉడికించకుండా నేరుగా వేసాం. కాబట్టి వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పిల్లలకి మాత్రం ఈ రెసిపీ ఎంతో నచ్చుతుంది.
పాలకూరను తరచూ తినడం వల్ల పేగు ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. చర్మం, జుట్టు మెరుస్తూ ఎదుగుతాయి. పాలకూరలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కె, ఐరన్, పొటాషియం, క్లోరోఫిల్ వంటి సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. మన శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. కాబట్టి పాలకూరను ఈ పద్ధతిలో ఉండి పిల్లలకు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది మీకు ఇది వారికి కచ్చితంగా నచ్చుతుంది.