మనిషి సగటు ఆయుర్దాయం ఏడాదికేడాది తగ్గిపోతున్న రోజులివి. నిండు నూరేళ్లు బతకడం అనేది నేడు ఊహలకు కూడా అందని విషయం. గతంలో పల్లెటూళ్లలో వందేళ్ల పైబడిన వృద్ధులు ఇంటికొకరు ఉండేవారు. కానీ నేడు అరవయ్యేళ్లు ఆరోగ్యంగా బతికితే అదే పదివేలు అనుకుంటున్నారు. అరవై తర్వాత ఏప్పుడు ఏ రూపంలో మృత్యువు ముంచుకొస్తుందో చెప్పలేని పరిస్థితి. కార్డియాక్ అరెస్ట్ వంటి సంఘటనలు సడన్ గా ప్రాణాలు తీస్తున్నాయి. ఇక క్యాన్సర్ ముప్పు, హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ ఎన్ లార్జ్ మెంట్ లాంటివి సర్వ సాధారణంగా మారాయి. ఇలాంటి సమయంలో యూరప్ శాస్త్రవేత్తలు చేసిన ఓ ప్రయోగం మానవుల జీవిత కాలంపై సరికొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ ప్రయోగం ఎలుకలపై జరిగింది. ఎలుకల సగటు జీవితకాలం దాదాపు 30శాతం వరకు పెరగడం ఈ ప్రయోగంలో ఆశ్చర్యకరమైన ఫలితం.
యాంటీ ఏజింగ్ కాక్‌టెయిల్
యూరప్‌లోని శాస్త్రవేత్తలు ఎలుకలపై యాంటీ-ఏజింగ్ డ్రగ్ కాక్‌టెయిల్‌ను పరీక్షించారు. అది వాటి జీవితకాలాన్ని దాదాపు 30 శాతం పొడిగించిందని తేలింది. ఇది రెండు మందుల మిశ్రమం. ఇందులో ఒకటి రాపామైసిన్. ఇది క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారు. ఆర్గాన్స్ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగిన తర్వాత కొత్తగా అమర్చిన అవయవాన్ని శరీరం తిరస్కరించకుండా వాడే మందుల్లో ఇది కూడా ఒకటి. దీన్ని యాంటీ ఏజింగ్ డ్రగ్ అని కూడా అంటారు. రెండోది ట్రామెటినిబ్. ఇది కూడా క్యాన్సర్ చికిత్సలో కీలకమైన ఔషధం. క్యాన్సర్ కణాలు పెరగడాన్ని ఇది నిరోధిస్తుంది.
30శాతం పెరిగిన జీవితకాలం
విడివిడిగా ఈ రెండు ఔషధాలను ఎలుకలపై ప్రయోగించారు. రాపామైసిన్ ఉపయోగించినప్పుడు ఎలుకల జీవితకాలం 17నుంచి 18శాతం పెరిగింది. ట్రామెటినిబ్ ఉపయోగించినప్పుడు దాని ఆయుష్షు 7 శాతం నుంచి 16 శాతం వరకు పెరిగింది. తాజా పరిశోధనలో ఆ రెండిటి మిశ్రమాన్ని కాక్ టెయిల్ గా మార్చి ఎలుకలకు ఇచ్చారు. ఆ కాక్ టెయిల్ తీసుకున్న ఎలుకల జీవిత కాలం ఏకంగా 30 శాతం వరకు పెరగడం విశేషం. జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తల పరిశోధన బృందం ఈ ప్రయోగం చేసి విజయం సాధించింది.
ఆరోగ్యవంతమైన జీవితం
ఈ కాక్ టెయిల్ తీసుకున్న తర్వాత ఎలుకల జీవితకాలం పెరిగింది. అయితే పెరిగిన జీవితకాలంలో వాటికి ఎలాంటి ఇతర అనారోగ్య సమస్యలు లేవు. ఆరోగ్యంగానే అవి అదనపు జీవితాన్ని గడిపాయి. గుండె, కాలేయం.. ఇతర అవయవాల పనితీరు కూడా వృద్ధాప్యంలో వలె పూర్తిగా మందగించలేదు. అంటే యాంటీ ఏజింగ్ డ్రగ్స్ గా ఇవి బాగానే పనిచేస్తున్నాయని తేలింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఆడ ఎలుకలలో సగటు జీవితకాలం 34.9 శాతం, మగ ఎలుకలలో 27.4 శాతం పెరిగింది, గరిష్ట జీవితకాలం ఆడ ఎలుకలలో 32.4 శాతం పెరగగా, మగ ఎలుకలలో 26.1 శాతం పెరిగింది.
మనుషులపై ప్రయోగాలు..
అయితే మనుషుల విషయంలో పూర్తిగా వీటిపై ఆధారపడి జీవితకాలం పెరుగుతుందని భావించలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జీవితకాలం పెంచుకోవడం కంటే, ఉన్న జీవితాన్ని మరింత మెరుగ్గా, అనారోగ్యం లేకుండా జీవించడం మంచిదని అంటున్నారు. ఈ రెండు మందులు ఇప్పటికే అమెరికా, యూరోపియన్ యూనియన్‌లో మానవులకు ఉపయోగించడానికి ఆమోదించబడ్డాయి. ఇటీవలి ఒక అధ్యయనంలో రాపామైసిన్ వాడటం వల్ల.. మహిళల సంతానోత్పత్తిని ఐదు సంవత్సరాల వరకు పొడిగించబడినట్టు తేలింది.