Memories: మనం పెద్దయ్యాక చిన్నప్పటి విషయాలు గుర్తుకు రాకపోవడం సహజం. మూడు నాలుగు సంవత్సరాల ముందు జరిగిన సంఘటనలు కూడా ఒక్కోసారి గుర్తుకు రావు. అప్పుడప్పుడు ఒకటి రెండు జ్ఞాపకాలు-ఇష్టమైన బొమ్మ, కుటుంబంతో ఎక్కడికో వెళ్లడం వంటివి స్పష్టంగా కాకపోయినా మసకగా గుర్తుకు వస్తాయి. దీన్ని ‘న్ననాటి గుర్తులు మరచిపోవడం’ (చైల్డ్ హుడ్ అమ్నీషియా) అంటారు. ఇది మెమరీకి సంబంధించిన సమస్యనా లేదా మెదడు పెరిగే క్రమంలో సహజంగా జరిగే విషయమేనా అనే విషయంపై పరిశోధనలు జరుపుతున్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఎందుకు జరుగుతుంది?
చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుండకపోవడానికి కొన్ని కారణాలు:
మెదడు పూర్తిగా పెరగలేదు, మెమరీని నిల్వ చేసే హిప్పోకాంపస్ అనే మెదడు భాగం చిన్నపిల్లల్లో పూర్తిగా రూపొంది ఉండదు. అందుకే, ఆ వయసులో జరిగిన విషయాలు ఎక్కువ కాలం మెదడులో నిల్వ ఉండవు.
చిన్నతనంలోనే భాషానైపుణ్యం లేకపోవడం వల్ల చిన్నపిల్లలకు మాటలు రావు. జరిగిన విషయాలను మాటల్లో చెప్పడం లేదా వాటిని కథలా గుర్తుంచుకోవడం కష్టం. భాష నైపుణ్యం వచ్చాకే జ్ఞాపకాలు స్పష్టంగా నిల్వ ఉంటాయి.
చిన్న వయసులో మెదడులో కొత్త న్యూరాన్లు వేగంగా తయారవుతాయి. ఇది మంచిదే అయినా, పాత జ్ఞాపకాలు అస్పష్టం కావడానికి దారితీస్తుంది.
స్వీయ గుర్తింపు లేకపోవడం మన గురించి మనకు తెలిసే ఆలోచన (సెన్స్ అఫ్ సెల్ఫ్) చిన్నప్పుడు ఇంకా రూపొంది ఉండకపోవడం వల్ల చిన్ననాటి గుర్తులు వ్యక్తిగత జ్ఞాపకాలుగా నిల్వ ఉండవు.
మెమరీ సమస్యనా?
చిన్ననాటి గుర్తులను మరచిపోవడం వంటిది అందరికీ సాధారణమే. ఇది మెదడు సమస్య కాదు. కొందరు కొన్ని జ్ఞాపకాలు గుర్తుంచుకుంటారు, ఇది వారి మెదడు పెరిగిన తీరు, భావోద్వేగ అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది. చిన్నతనంలో కాకుండా పెద్దయ్యాక కూడా జరిగిన విషయాలు గుర్తులేక కొత్త జ్ఞాపకాలు ఏర్పడకపోతే అది అల్జీమర్స్ కు సంకేతం కావచ్చు. ఇలాంటి సమయాల్లో డాక్టర్ని సంప్రదించడం మంచిది.
జ్ఞాపకాలను నిల్వ ఉంచొచ్చా?
చిన్ననాటి జ్ఞాపకాలను పూర్తిగా నిల్వ ఉంచడం కష్టమే అయినా కొన్ని పద్ధతులు సాయం చేయొచ్చు.
కథలు చెప్పడం: తల్లిదండ్రులు పిల్లలతో సమయం దొరికిన ప్రతిసారి గత సంఘటనల గురించి మాట్లాడితే ఆ జ్ఞాపకాలు బలంగా ఉండొచ్చు.
భావోద్వేగ సంఘటనలు:
భావోద్వేగ అనుభవాలు: పిల్లలకు సంతోషకరమైన లేదా బాధాకరమైన సంఘటనలు ఎక్కువగా గుర్తుండే అవకాశం ఉంది, ఎందుకంటే ఇవి అమిగ్డాలా అనబడే జ్ఞాపకశక్తికి సంబంధించిన మెదడు భాగాన్ని సక్రియం చేస్తాయి.
ఫోటోలు లేదా వీడియోలు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేయడానికి సహాయపడతాయి. మన అందరి అనుభవం: చిన్ననాటి జ్ఞాపకాలు మరచిపోవడం అందరికి సాధారణమైన విషయం. ఇది మెదడు కొత్త విషయాలను నేర్చుకునేందుకు, పెరిగేందుకు జరిగే సహజమైన ప్రక్రియ. ఆ జ్ఞాపకాలను మర్చిపోయినా, చిన్ననాటి అనుభవాలు మన వ్యక్తిత్వాన్ని, ఇష్టాలను, మరింతగా చేస్తాయి. భవిష్యత్తులో మర్చిపోయిన జ్ఞాపకాలను తిరిగి గుర్తు చేసే మార్గాలు కనుగొనడానికి శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు.