కళ్ళు తరచూ దురద పెడుతుంటే దానిని తేలిగ్గా తీసుకోకండి. దురద పెట్టినప్పుడల్లా కళ్ళు నులిమేసి లేదా కళ్ళను శుభ్రం చేసుకుని ఆ తర్వాత పట్టించుకోవడమే మానేస్తారు. పదేపదే కళ్ళు దురద పెడుతున్నాయంటే కనురెప్పల్లో ఉండే సూక్ష్మజీవులు కారణమని అర్థం చేసుకోవాలి. ఈ జీవులను డెమోడెక్స్ అని పిలుస్తారు. వీటిని కనురెప్ప పురుగులు అని కూడా అంటారు. సూక్ష్మ దర్శినితో చూస్తే కనురెప్పల ఫోలికల్స్ లో ఇవి కనిపిస్తాయి. అక్కడే ఇవి నివసిస్తాయి. కళ్ళు ఎక్కువ దురదగా, ఎర్రగా కరకరలాడుతూ ఉంటే మీ కనురెప్పల చుట్టూ ఈ సూక్ష్మజీవులు ఉన్నాయేమో పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.
కనురెప్పల పురుగులు అంటే
డెమోడెక్స్ అని పిలిచే ఈ కనురెప్పల పురుగులు సాలెపురుగుల మాదిరిగా ఉంటాయి. వెంట్రుకల కుదుళ్లలో ముఖ్యంగా కళ్ళు, కనుబొమ్మల చుట్టూ నివసిస్తాయి. వీటిలో రెండు రకాలు ఉంటాయి. కొన్ని వెంట్రుకలపై నివసిస్తే, మరికొన్ని వెంట్రుకల మూలాల దగ్గర నివసిస్తాయి. వెంట్రుకల తైల గ్రంథులలో ఇవి ఉంటాయి. సాధారణంగా 60 ఏళ్లు దాటిన వారికి ఈ డెమోడెక్స్ సూక్ష్మజీవులు అధికంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇప్పుడు మారుతున్న కాలంలో ప్రతి ఒక్కరిని ఈ సూక్ష్మజీవులు ఇబ్బంది పెట్టే స్థాయికి చేరుకున్నాయి.
సాధారణంగా ఈ పురుగులు కళ్లకు పెద్దగా హాని చేయవు. అయితే వర్షాకాలంలో వీటి ఎదుగుదల అధికంగా ఉంటుంది. అప్పుడు మాత్రం తీవ్రంగా బాధించే లక్షణాలను కలిగిస్తాయి. కనురెప్పల పురుగులు అధికంగా పెరిగితే సమస్య పెద్దగా మారుతుంది. కళ్ళు ఎర్రబడి పోతాయి. తీవ్రంగా మంట పడతాయి.
మీ కనురెప్పల్లో ఈ సూక్ష్మ పురుగులు ఉంటే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. అవి నిరంతరం కళ్ళు దురద పెట్టడం, చిరాకుగా కళ్ళను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే కనురెప్పల దగ్గర ఉబ్బినట్టు అనిపిస్తాయి. ఎర్రగా మారుతాయి. అక్కడ ఉన్న చర్మం ఎర్రగా మారుతుంది.
కనురెప్పల మీద పొడిలాంటి పదార్థాలు కనిపించవచ్చు. ఇవి సూక్ష్మజీవుల వ్యర్ధాలు చనిపోయిన చర్మ కణాలు కలిసి ఇలా కనురెప్పలపై పొడి లాగా చేరుతాయి.
కనురెప్పలు మీద ఉన్న వెంట్రుకలు రాలిపోతుంటే దానికి కారణం ఈ పురుగులే కావచ్చు. ఎందుకంటే పురుగులు వెంట్రుకల పోలికల్స్ ను ఆక్రమించినప్పుడు వెంట్రుకలకు బలం ఉండదు. దీని వల్ల అవి రాలిపోతూ ఉంటాయి.
కంట్లోంచి నీరు కారుతూ ఉంటే
కంటి నుండి నిరంతరం నీరు కారణం లేదా కళ్ళు మసకబారినట్టు కనిపిస్తుండడం కూడా ఈ పురుగుల వల్లేనని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే వెంట్రుకలపై ఉన్న నూనె గ్రందులను ఈ పురుగులు ఆక్రమించుకోవడం వల్ల ఇలాంటి లక్షణాలు కలుగుతాయి. కంటిలో ఏదో నిరంతరం తిరుగుతున్నట్టు అనిపించినా, ఇసుక రేణువులాగా కరకరలాడుతూ ఉన్న ఈ సూక్ష్మజీవులు ఉన్నాయేమో ఒకసారి వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షించుకోవాలి.
ఈ కంటి సూక్ష్మపురుగులు బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్నవారిని ఎక్కువగా టార్గెట్ చేసుకుంటాయి. అలాగే మేకప్ బ్రష్‌లు మురికిగా ఉన్నవి వాడినా, కంటి ఉత్పత్తులను అధికంగా వాడినా, మేకప్ సరిగా తొలగించకపోయినా, తీవ్రమైన జిడ్డు చర్మం ఉన్నా సూక్ష్మజీవులు కనురెప్పల్లో చేరే అవకాశం ఉంది.
మీకు ఇక్కడ చెప్పిన కంటి సమస్యలు కనిపిస్తే వైద్యులను కలిసి తగిన చికిత్స తీసుకోవచ్చు. క్లెన్సర్ ను ఇవ్వడం ద్వారా వైద్యులు దీనికి చికిత్స చేస్తారు. ముఖాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొని మేకప్ ను తొలగించుకుంటే ఈ కనురెప్పల పురుగులు రాకుండా ఉంటాయి.
ఈ కనురెప్పలపై ఉన్న పురుగులు అంటువ్యాధిగానే చెప్పుకోవాలి. ఈ పురుగులతో ఇబ్బంది పడుతున్న వారి తువ్వాలు వాడడం లేదా మేకప్ సామాగ్రిని వాడడం ద్వారా ఇది ఇతరులకు కూడా సోకుతుంది.