COVID-19: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది.. ప్రజలు మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు. బహిరంగ ప్రదేశాల్లో.. ఎలాంటి భయం లేకుండా మాస్క్‌ను పక్కన పెట్టి తిరుగుతున్నారు. మరో వైపు కోవిడ్ మరణ మృదంగ మోగిస్తోంది. రోజు రోజుకు కరోనా మహమ్మారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయినా కూడా జనాల్లో భయం కనిపించడం లేదు. ఏమి కాదనే నిర్లక్ష్య వైఖరి కనిపిస్తోంది. ఎవరిలోనూ కేసులు పెరుగుతున్నాయని, కరోనాతో ప్రమాదం పొంచి ఉందని భయం జాడ లేదు.
మళ్లీ మహమ్మారి బారిన పడకుండా మాస్క్‌లు ధరించి.. అప్రమత్తంగా ఉండాలనే ఆలోచన రావడం లేదు. సరిగ్గా నాలుగేళ్ల క్రితం.. ప్రతి ఒక్కరి ముఖానికి మాస్క్, చేతిలో శానిటైజర్ బాటిల్ అవసరం ఏదైనా.. అడుగుపెట్టే ప్రదేశం ఏదైనా మాస్క్ ఉంటేనే.. ఇంటినుంచి కాలు బయట పెట్టేవారు. చివరకు ఇంట్లో ఉన్న మాస్క్ ధరించే పరిస్థితి. ఎక్కడ చూసిన, ఎవరిని చూసిన, మాస్క్‌లే దర్శనమిచ్చేవి. కనీవినీ ఎరుగని రీతిలో యావత్ ప్రపంచం మాస్క్ అనే ముసుగు ధరించింది. కాలచక్రం గిర్రున తిరిగి 2020 నుంచి 2025 లోకి రాగానే.. పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. మహమ్మారి సమస్య గతంలో మాదిరిగా వెంటాడుతున్నా.. ప్రజలు మాత్రం మాస్క్‌లు ధరించేందుకు ససేమెరా అంటున్నారు.
కాగా దేశం వ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక, కేరళలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. అత్యధికంగా కేరళలో 273 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. తమిళనాడులో 66, మహారాష్ట్రలో 56, ఢిల్లీలో 23, కర్నాటకలో 36 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెల్పింది కేంద్రం. కరోనా సోకి మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలోని థానేలో 21 ఏళ్ల యువకుడు చనిపోగా, బెంగళూరులో 84 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1000 కేసులు నమోదు కాగా.. ఐదుగురు మృతి చెందారు.
కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో.. ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ అలర్టయ్యింది. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ర్యాపిడ్ టెస్టులతో పాటు ప్రత్యేక వార్డులు సిద్ధం చేయాలని సూచించింది. ఇటు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. జన సంచారం అధికంగా ఉండే ప్రదేశాలకు వెళ్లేప్పుడు మాస్క్ ధరించాలని సూచించింది. లక్షణాలు కన్పిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని తెల్పింది. కోవిడ్ మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి.
1. మాస్క్ ధరించడంలో నిర్లక్ష్యం వద్దు
మాస్క్‌లు ధరించడం వల్ల వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరిగ్గా ధరించాలి. డిస్పోజబుల్ మాస్క్‌లను సరిగా శుభ్రపరచకుండా.. మళ్లీ ఉపయోగించడం వంటివి చాలా ప్రమాదకరం.
2. భౌతిక దూరం పాటించకపోవడం
కనీసం 1-2 మీటర్ల భౌతిక దూరాన్ని పాటించడం వల్ల.. వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చు. బహిరంగ ప్రదేశాలు, సామాజిక సమావేశాలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది.
3. చేతుల పరిశుభ్రతను నిర్లక్ష్యం చేయడం
చేతులు శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే అది అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది. ముఖ్యంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ హ్యాండిల్స్, లేదా షేర్డ్ వస్తువులను తాకిన తర్వాత.. చేతులను సబ్బుతో చేతులు కడుక్కోకపోవడం లేదా శానిటైజర్ ఉపయోగించాలి. ఇలా చేయడం ద్వారా ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
4.పెద్ద పెద్ద సమావేశాల్లో పాల్గొన్నప్పుడు
పార్టీలు, వివాహాలు వంటి శుభకార్యాల్లో పాల్గొన్నప్పడు.. ఖచ్చితంగా మాస్క్‌లు ధరించాలి. లేకుంటే వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది.
5. క్వారంటైన్, ఐసోలేషన్ నియమాలను పాటించకపోవడం
వైరస్ సోకిన వ్యక్తులు ఖచ్చితంగా ఐసోలేషన్ లేదా క్వారంటైన్ ఉండాలి. ఈ లక్షణాలు ఉన్నాయని తెలిసిన కూడా.. నిర్లక్ష్యంగా బయటకు వెళ్లడం, సామాజికంగా బయట వ్యక్తులను కలవడం, ప్రయాణం చేయడం వంటి చేయకూడదు. లేదంటే.. ఎదుటి వ్యక్తికి వేగంగా వ్యాప్తి చెందుతుంది.
6. ఇండోర్ వెంటిలేషన్‌లో లోపం
వెంటిలేషన్ లేని ఇండోర్ ప్రదేశాల్లో.. వైరస్ ఎక్కువ కాలం గాలిలోనే ఉంటుంది. కిటికీలు తెరవడం, ఎయిర్ ప్యూరిఫైయర్‌లను ఉపయోగించడం వంటి జాగ్రత్తలు తీసుకోకపోతే.. గాలి ద్వారా వైరస్ వ్యాప్తి ప్రమాదం వేగంగా పెరుగుతుంది.
7. లక్షణాలను నిర్లక్ష్యం చేయడం
జ్వరం, దగ్గు, రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలను కనిపిస్తే.. వెంటనే డాక్టర్‌ని సంప్రదించండి. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.
8. ప్రజారోగ్య చర్యలను తప్పనిసరిగా పాటించండి
ప్రయాణ ఆంక్షలు, లాక్‌డౌన్‌లు, టీకా కార్యక్రమాల వంటి ప్రజారోగ్య చర్యలను పాటించాలి. నిర్లక్ష్యం చేయడం వల్ల వైరస్ వ్యాప్తి వేగంగా వ్యాప్తి చెందుతుంది.
9. తప్పుడు సమాచారం వ్యాప్తి
ప్రజల ఆరోగ్యం సమాజానికి చాలా అవసరం. ఇది వారి జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది. కాబట్టి కోవిడ్ టీకాలు, వైరస్ వ్యాప్తి వంటి తప్పడు సమాచారం ఇవ్వకండి.
10. వ్యక్తిగత రక్షణ చాలా అవసరం
మాస్క్‌లతో పాటు, గ్లోవ్స్, శానిటైజర్ వంటివి ఉపయోగించండి.
సామూహిక బాధ్యత
కోవిడ్-19 వ్యాప్తి వ్యక్తిగత చర్యల వల్ల మాత్రమే కాదు, సామూహికంగా మార్గదర్శకాలను పాటించకపోవడం వల్ల కూడా జరుగుతుంది. మాస్క్ ధరించడం, దూరం పాటించడం, పరిశుభ్రత, ప్రజారోగ్య చర్యలకు కట్టుబడి ఉండటం ద్వారా వైరస్‌ను అరికట్టవచ్చు.
ఈ నిర్లక్ష్యాలను సరిదిద్దడం ద్వారా, మనం కోవిడ్-19 వ్యాప్తిని తగ్గించి, ఈ వైరస్ వ్యాప్తి నుంచి జనాభాను రక్షించవచ్చు. ఇలా చేస్తే ఎలాంటి మహమ్మారి అయిన దరిచేరదు.