Bachali kura tomato curry: రోజూ చేసే కూరలు తిని బోర్ కొడుతుందా? అయితే ఈసారి ఆకుకూరతో ఒక టేస్టీ అండ్ హెల్తీ డిష్ ట్రై చేద్దామా? వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి, పక్కన పుల్ల పుల్లగా, కారంగా ఉండే బచ్చలికూర టమాటో కర్రీ పడితే ఆ రుచికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే బచ్చలి కూరను టమాటోలతో కలిపి వండితే రుచి డబుల్ అవుతుంది. మరి నిమిషాల్లోనే ఘుమఘుమలాడే బచ్చలికూర టమాటో కూర ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బచ్చలికూర కట్టలు – 2 పెద్దవి
టమాటోలు – 3 మీడియం సైజువి
ఉల్లిపాయ – 1
పచ్చిమిర్చి – 3
వెల్లుల్లి రెబ్బలు – 6 నుంచి 7
పోపు గింజలు (ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు)- 1 స్పూన్
కరివేపాకు – రెండు రెబ్బలు
కారం – 1.5 స్పూన్లు
పసుపు – పావు స్పూన్
ధనియాల పొడి – 1 స్పూన్
నూనె – 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
1. ముందుగా బచ్చలి కూర ఆకులను కాడల నుంచి వేరు చేసి, రెండు మూడు సార్లు మంచి నీళ్లతో శుభ్రంగా కడగాలి. ఆకుకూరల్లో మట్టి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కడగడం చాలా ముఖ్యం. కడిగిన ఆకులను జల్లెడలో.. వేసి నీరు పోయాక సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
2. స్టవ్ మీద పాన్ లేదా బాణలి పెట్టి నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక పోపు గింజలు, దంచిన వెల్లుల్లి, కరి వేపాకు, పచ్చి మిర్చి వేసి చిటపటలాడించాలి. వెల్లుల్లి ఫ్లేవర్ ఆయిల్‌లోకి దిగితే కూర చాలా కమ్మగా ఉంటుంది. ఆ తర్వాత తరిగిన ఉల్లి పాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
3. ఉల్లి పాయలు వేగాక పసుపు, తరిగిన టమాటో ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. మూత పెట్టి టమాటోలు మెత్తగా, గుజ్జులా అయ్యే వరకు లో-మీడియం ఫ్లేమ్‌లో 5 నిమిషాలు మగ్గించాలి.
4. టమాటోలు చక్కగా మగ్గాక, తరిగి పెట్టుకున్న బచ్చలి కూరను కొంచెం కొంచెంగా వేస్తూ కలపాలి. బచ్చలికూర చూడటానికి ఎక్కువగా ఉన్నా, వేడి తగలగానే దగ్గర పడిపోతుంది. ఇప్పుడు కారం, ధనియాల పొడి వేసి బాగా కలిపి, మరో 5 నిమిషాలు మూత లేకుండా ఉడికించాలి. కూరలో.. నీరు ఆవిరై, లైట్‌గా గ్రేవీలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే రెసిపీ రెడీ.