Pomegranate Vs Beetroot Juice: వేసవిలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. మండే ఎండలు, వేడిగాలులు, చెమట కారణంగా శరీరం త్వరగా అలసిపోతుంది. ఫలితంగా డీహైడ్రేషన్ ప్రమాదం పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో.. జ్యూస్ తాగడం వల్ల శరీరం చల్లబడటమే కాకుండా శరీరానికి లోపలి నుండి పోషణ లభిస్తుంది. కానీ బీట్‌రూట్ జ్యూస్ లేదా దానిమ్మ జ్యూస్ వీటిలో ఏది తాగితే ఆరోగ్యానికి మంచిదనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ రెండు జ్యూస్‌లు ఆరోగ్యకరమైనవే.. కానీ మీ ఆరోగ్యం, కాలానుగుణ అవసరాలకు అనుగుణంగా ఏది ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
బీట్‌రూట్ vs దానిమ్మ ఏ జ్యూస్ మంచిది ?
బీట్‌రూట్ , దానిమ్మ రెండింటిలోనూ ఐరన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో పాటు అనేక ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. బీట్‌రూట్ రసం రక్తాన్నిపెంచడంలో, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. దానిమ్మ రసం గుండెను బలపరుస్తుంది. అంతే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వేసవిలో శరీరం డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నప్పుడు ఈ రెండు జ్యూస్‌లు మీకు ఉపశమనం కలిగిస్తాయి. కానీ వీటి ప్రభావం శరీర అవసరాలు, ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటుంది.
వేసవిలో బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1.రక్తపోటును నియంత్రిస్తుంది: బీట్‌రూట్‌లో నైట్రేట్లు ఉంటాయి. ఇవి శరీరంలోకి ప్రవేశించి నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇవి రక్త నాళాలను సడలించి, రక్తపోటును అదుపులో ఉంచుతాయి.
2. రక్తాన్ని పెంచుతుంది: అధిక ఐరన్ కారణంగా.. బీట్‌రూట్ జ్యూస్ రక్తహీనతతో బాధపడేవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
3. డీటాక్స్ లో సహాయపడుతుంది: బీట్ రూట్ కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా వేసవిలో.. శరీరానికి డీటాక్స్ అవసరమైనప్పుడు, బీట్‌రూట్ రసం మంచి ఎంపిక.
4. చర్మాన్ని కాంతివంతం చేస్తుంది: ఈ జ్యూస్ చెమట, ఎండ వల్ల దెబ్బతిన్న చర్మాన్ని లోపలి నుండి ఆరోగ్యంగా ఉంచుతుంది.
5. శక్తిని పెంచుతుంది: వేసవిలో తరచుగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. కానీ బీట్‌రూట్ జ్యూస్ శరీరాన్ని తాజాగా ,శక్తివంతంగా చేస్తుంది. చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేయడంలో కూడా బీట్ రూట్ జ్యూస్ చాలా బాగా ఉపయోగపడుతుంది.
దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల ప్రయోజనాలు:
1. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది: దానిమ్మలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా వ్యాధుల బారిన పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
2. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది: దానిమ్మ జ్యూస్‌లో కొలెస్ట్రాల్‌ను సమతుల్యం చేసే, గుండె జబ్బుల నుండి రక్షించే అంశాలు ఉంటాయి.
Also Read: మహిళల శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు.. కనిపించే లక్షణాలివే !
3.వేడి నుండి ఉపశమనం: దానిమ్మపండు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉన్న పండు. దీని జ్యూస్ శరీర వేడిని తగ్గించి చల్లదనాన్ని అందిస్తుంది.
4. చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది: దానిమ్మ జ్యూస్‌లో ఉండే పాలీఫెనాల్స్ చర్మాన్ని ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.
5. జీర్ణక్రియకు సహాయపడుతుంది: దానిమ్మ జ్యూస్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాకుండా గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది.