Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిపై విచారణ చేపట్టిన ఎన్‌ఐఏ కీలక ఆధారాలు సేకరించింది. దాడి వెనుక ప్రధానంగా ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఉగ్రదాడి వెనుక ఎన్‌ఐఏ రిపోర్ట్ సిద్ధం చేసింది. ఇవాళ కేంద్ర హోంశాఖకు నివేదిక అందించనుంది. ఇప్పటికే 90మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్లపై ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. మూడు వేల మందిని విచారించింది. వందకు పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
పహల్గాం ఘటన వెనుక పాక్ ఆర్మీ, ఐఎస్‌ఐ, లష్కరే తోయిబా హస్తం
పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ఆదేశాల మేరకే లష్కరే తోయిబా సంస్థ దాడి చేసినట్లు ఎన్‌ఐఏ తెలిపింది. దాడికి సంబంధించిన పథక రచనంతా పాక్‌లోనే జరిగిందని.. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు హష్మీ ముసా అలియాస్ సులేమన్, అలీ బాయ్‌లు పాకిస్థాన్ జాతీయులుగా ఎన్‌ఐఏ తేల్చింది. అదుపులోకి తీసుకున్న పలువురిని విచారించగా.. కీలక విషయాలు బయటికొచ్చినట్లు ఎన్‌ఐఏ నివేదికలో తెలిపింది. పహల్గామ్‌లో దాడి చేస్తున్న సమయంలో.. పాక్‌లోని ఉగ్రవాదులలో నిరంతరం మాట్లాడారు. దాడి ఏ ప్రాంతంలో చేయాలి? ఏ సమయంలో చేయాలనే విషయాలు పాక్ ఉగ్రవాదుల నుంచి అందిన ఆదేశాల ప్రకారం చేశారు.
భారత్‌లోకి అక్రమంగా చొరబడ్డ పాక్ రేంజర్
పహల్గామ్ దాడికి వారం రోజుల ముందే ఈ ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించినట్లు ఎన్‌ఐఏ స్పష్టం చేసింది. వారికి ఆశ్రయం కల్పించడం, ఆయుధాలు సమకూర్చడంలో స్థానికులు సహకారం అందించినట్లు స్పష్టం చేసింది. ఫోరెన్సిక్, ఎలక్ట్రానిక్ డేటా ద్వారా పలు విషయాలను సేకరించింది. దాడి జరిగినప్పుడు ఘటనా స్థలంలో ఉన్న టూరిస్ట్‌లు, స్థానికులను కూడా ప్రశ్నిస్తుంది. అక్కడ వారు తీసుకున్న ఫొటోలు, వీడియోల ఆధారంగా దర్యాప్తు చేస్తుంది. ఈ ఉగ్రవాదులకు క్షేత్రస్థాయిలో దాదాపు 20మంది సహకరించినట్లు తేల్చింది. వీరిలో చాలామంది ఇప్పటికే అరెస్ట్ కాగా.. మరికొందరు నిఘా నీడలో ఉన్నారు.
ప్రాథమిక దర్యాప్తులో తేల్చిన ఎన్‌ఐఏ
దాడికి సంబంధించి సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసేందుకు ఎన్‌ఐఏ అత్యాధునిక విధానాలు వినియోగిస్తోంది. శాటిలైట్ ఇమేజ్‌లు, డ్రోన్ దృశ్యాలు, బాధితులు, గుర్రపు స్వారీ ఆపరేటర్ల నుంచి సమాచారం సేకరిస్తోంది. దీంతోపాటు దాడి జరిగిన ప్రదేశాన్ని హైరిజల్యూషన్ 3డీ మోడల్‌ను కూడా తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి ఇప్పటివరకు 40 ఖాళీ తూటాలను దర్యాప్తు బృందాలు స్వాధీనం చేసుకొన్నాయి.
ఇదిలా ఉంటే.. పహల్గామ్‌లో టూరిస్ట్‌లపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు శ్రీలంకకు పారిపోయినట్లు ఎన్‌ఐఏకు సమాచారం అందింది. చెన్నై నుంచి విమానంలో కొలంబో ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయినట్లు తెలుస్తుంది. వెంటనే శ్రీలంక అధికారులను భారత్ అలర్ట్ చేయగా.. అనుమానితుల కోసం భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
కొలంబో ఎయిర్ పోర్టులో సెర్చ్ ఆపరేషన్
నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో శ్రీలంక ఎయిర్‌లైన్స్ విమానం UL 122 బండరానాయకే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. అప్పటికే సమాచారం అందుకున్న శ్రీలంక ఆర్మీ.. ఎయిర్‌పోర్ట్‌ను చుట్టుమట్టి క్షుణ్ణంగా తనిఖీ చేసి ఆరుగురు అనుమానితులను పట్టుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో వారికి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
పెహల్గామ్ దాడి తర్వాత జమ్ముకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు
పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. జమ్ముకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం జవాన్లు గాలిస్తున్నారు. స్థానికులు వారికి సహకరించినట్లు ఎన్‌ఐఏ అనుమానం వ్యక్తం చేస్తుంది. ఉగ్ర స్థావరాల్లో గాలింపు ముమ్మరం చేశారు. అందుకే నక్కిన ఉగ్రవాదుల జాడ ఇంకా తేలడం లేదు. ఈ క్రమంలో 2023లో రాజౌరీ ఉగ్రదాడి కేసులో అరెస్ట్ అయిన ఇద్దరిని ఎన్‌ఐఏ విచారిస్తుంది. ప్రస్తుతం జమ్ములోని కోట్ భల్వాల్ జైల్లో ఉన్న లష్కరే తోయిబా ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ నిస్సార్ అహ్మద్, ముస్తాక్ హుస్సేన్‌ను ప్రశ్నించింది.