Curd Benefits: ఎండాకాలంలో పెరుగు తినే వారి సంఖ్య చాలా పెరుగుతుంది. సమ్మర్ లో పెరుగుతో పాటు మజ్జిగ తీసుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతుంటారు. పెరుగు తినడం వల్ల మన శరీరానికి అవసరం అయిన పోషకాలు లభిస్తాయి. ఫలితంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అంతే కాకుండా పెరుగు శరీరం చల్లగా, తాజాగా ఉండేలా చేస్తుంది. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వారు పెరుగు తినడం అంత మంచిది కాదు. ఇంతకీ పెరుగు తినడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి. ఎవరు పెరుగు తినకూడదనే విషయాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
శరీరాన్ని చల్లగా ఉంచుతుంది:
వేసవిలో హీట్ స్ట్రోక్, శరీరం వేడెక్కడం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు సర్వసాధారణం. పెరుగు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో, శరీరం యొక్క తాజాదనాన్ని కాపాడుకోవడంలో సహాయపడే లక్షణాలను కలిగి ఉంటుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే సమ్మర్‌లో ఎక్కువగా పెరుగు తినడం మంచిది.
జీర్ణక్రియలో మెరుగుదల:
వేసవి కాలంలో అజీర్ణం సమస్య చాలా పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో పెరుగు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మలబద్ధకం , ఇతర జీర్ణ సంబంధిత సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
రోగనిరోధక వ్యవస్థ:
పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్, విటమిన్ బి12, కాల్షియం, ప్రోటీన్లు శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇది జలుబు, ఇతర సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ కలిగి ఉన్న వారు పెరుగు తినడం మంచిది.
చర్మం, జుట్టుకు మేలు:
వేసవిలో చర్మం పొడిబారడం, జుట్టు నిర్జీవంగా మారడం సాధారణ సమస్యలు అనే చెప్పాలి. పెరుగు చర్మంలో తేమను కాపాడే పోషకాలను కలిగి ఉంటుంది. పెరుగు తినడం వల్ల జుట్టు బలంగా మారుతుంది. ఇది చర్మ ఇన్ఫెక్షన్ల నుండి కూడా రక్షిస్తుంది.
బరువు నియంత్రణ:
బరువు తగ్గాలని ఆలోచిస్తున్న వారికి పెరుగు ఒక అద్భుతమైన ఆహారం. ఇందులో ఎక్కువ ప్రోటీన్ , తక్కువ మోతాదులో అనవసరమైన కొవ్వు ఉంటుంది. ఇది ఆకలిని అదుపులో ఉంచుతుంది. అంతే కాకుండా జీవక్రియను వేగవంతం చేస్తుంది.
పెరుగు ఎవరు తినకూడదు ?
పెరుగులోని చల్లని స్వభావం కారణంగా ఉబ్బసం, అలెర్జీలతో బాధపడేవారు దీనిని తినకుండా ఉంటేనే మంచిది. శరీరంలో కఫం పెరగే ప్రమాదం ఉంటుంది. ఇది ఆస్తమా లేదా అలెర్జీ రోగులకు మరిన్ని సమస్యలను కలిగిస్తుంది. అందుకే ఈ సమస్యలు ఉన్న వారు పెరుగును పరిమిత పరిమాణంలో తినాలి.
జలుబు, దగ్గుతో బాధపడేవారు:
ఎవరికైనా ఇప్పటికే జలుబు, దగ్గు ఉంటే, వారు పెరుగు తినకూడదు. దీని వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రిపూట పెరుగు తినడం మానుకోవాలి.
Also Read: ఉప్పు ఎక్కువగా తింటే.. హైబీపీ వస్తుందా ?
కీళ్ల నొప్పులతో బాధపడేవారు:
ఆర్థరైటిస్ లేదా కీళ్ల నొప్పులతో బాధపడేవారు పెరుగును ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఇది కాళ్ల వాపును పెంచుతుంది.
అసిడిటీ, అల్సర్లతో బాధపడే వారు:
పుల్లని పెరుగు అసిడిటీని కలిగిస్తుంది. అందుకే తాజా, తీపి పెరుగు తినడం మంచిది. అసిడిటీతో ఇబ్బంది పడే వారు పుల్లటి పెరుగు తినడం మానుకోవాలి.