Bird Flu: రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకటి కాదు రెండు కాదు వేలల్లో కోళ్లు చనిపోతున్నాయి. కారణం ఏమిటంటే అందరి నోట వచ్చే ఒకే ఒక్క మాట బర్డ్ ఫ్లూ (Bird Flu). అసలు ఇదేమి వ్యాధి అనుకుంటున్నారా.. ఇదొక వైరస్. అంతేకాదు వైరల్ ఇన్ఫెక్షన్ తో మొదలై చివరకు కోళ్ల ప్రాణాలు తీస్తోంది. అయితే బర్డ్ ఫ్లూ (Bird Flu) తో మనుషులకు ప్రమాదం పొంచి ఉందా అనే ప్రశ్న ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. గంట క్రితం వరకు ఆరోగ్యంగా ఉన్న కోళ్లు ఒక్కసారిగా మృత్యువాత చెందుతుండగా, ఈ వ్యాధి ప్రభావం మనుషులపై ఉంటుందా అన్నదే ఇప్పుడు అందరినీ భయపెడుతున్న ప్రశ్న.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో గత వారం రోజులుగా బర్డ్ ఫ్లూ (Bird Flu) ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. బర్డ్ ఫ్లూ అనే వైరస్ ఎక్కువగా కోళ్లపై ప్రభావం చూపుతుంది, అందుకే కాబోలు కోళ్లఫారాలలో ఉన్న ఎన్నో కోళ్లు ఒక్కసారిగా మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాలలో బర్డ్ ఫ్లూ ప్రబలుతోంది తస్మాత్ జాగ్రత్త అంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరికొందరైతే చికెన్ తినవద్దు అంటూ ప్రకటనలు కూడ ఇచ్చేస్తున్నారు. బర్డ్ ఫ్లూ పుణ్యమా అని ఎందరో కోళ్లఫారాల యజమానులకు నష్టం లక్షల్లోనే ఉందట.
అయితే ఆరోగ్యంగా ఉన్న కోళ్లన్నీ (Hens) చనిపోతుండగా, ఏమి చేయలేని స్థితిలో యజమానులు ఉంటున్న పరిస్థితి. ఈ సమయంలో మాంసాహారులు జర జాగ్రత్తగా ఉండాలని వైద్యులు కోరుతున్నారు. కొద్దిరోజులు చికెన్ తినకుండ ఉండడమే మంచిదని సూచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి మనుషులకు వ్యాపిస్తుందా అనే కోణంలో కూడ ప్రచారం సాగుతోంది. కాగా ఈ వ్యాధి మనుషులపై సామాన్యంగా ప్రభావం చూపదని, అరుదుగా వ్యాధి వ్యాప్తి చెందే పరిస్థితులు ఉన్నాయని వైద్యులు తెలుపుతున్నారు.
అలాగే కోళ్లఫారాల వద్ద గల వ్యక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలట. చనిపోయిన కోళ్లను ఎప్పటికప్పుడు తీసివేయాలని, ఖచ్చితంగా చేతుల పరిశుభ్రత పాటించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా కోళ్లఫారాల వద్ద గల వ్యర్థాలను ఎప్పటికప్పుడు తీసివేయాలని, లేనియెడల వైరస్ అక్కడే నివాసం ఏర్పరచుకునే అవకాశం ఉందట. బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్లను ఎట్టి పరిస్థితుల్లో వండుకొని తినరాదని, అలా తింటే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు.
Also Read: Maha Kumbh Mela: కుంభమేళాలో డబ్బులే డబ్బులు.. టెక్నిక్ అదిరింది కదూ..
ఒకవేళ ఈ వ్యాధి మనుషులకు సోకితే.. ముందుగా జ్వరంతో ప్రారంభమై దగ్గు, కళ్లలో వైరస్ ప్రభావం, విపరీతమైన తలనొప్పి వస్తుందట. అంతేకాదు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తే సమస్య పొంచి ఉంటుందని, ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ బర్డ్ ఫ్లూ.. మనుషులకు అరుదుగా సోకే వ్యాధి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని, ఏదైనా జ్వరం, విపరీతమైన దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు ఉంటే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి సంధర్భంలో కొద్దిరోజులు చికెన్ కు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పవచ్చు. అంతేకాకుండ మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు. చేతుల పరిశుభ్రత పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.