బూందీ లడ్డూని మార్కెట్లో కొని తెచ్చుకునే వారే ఎక్కువ. నిజానికి దీన్ని చాలా సింపుల్ గా ఇంట్లోనే చేసేయొచ్చు. ఒకసారి చేసుకుంటే వారం రోజులు పాటు ఈ స్వీట్ చాలా తాజాగా ఉంటుంది. దీన్ని చేయడానికి అధికంగా శనగపిండి, పంచదార ఉంటే సరిపోతుంది. ఈ స్వీట్లను పెళ్లిళ్లలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. అందుకే పెళ్లి సమయంలో దీన్ని ఇష్టంగా తినేవారు ఎక్కువే. వేడుకల్లోనే కాదు ఇంట్లో కూడా తినాలనిపించినా బూందీ లడ్డును ఇలా సులభంగా చేసేయండి.
కావాల్సిన పదార్థాలు
శనగపిండి – ఒక కేజీ
నూనె – వేయించడానికి సరిపడా
నీరు – తగినంత
పంచదార – ఒకటిన్నర కిలో
జీడిపప్పులు – గుప్పెడు
ఎండుద్రాక్షలు – గుప్పెడు
పచ్చ కర్పూరం – పావు స్పూను
యాలకుల పొడి – ఒక స్పూను
బూందీ లడ్డూ రెసిపీ
1. శనగపిండిని ఒకసారి జల్లించి గడ్డలు లేకుండా చూసుకోవాలి.
2. ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేయాలి.
3. అందులో నీరుపేసి చేతితోనే బాగా మెదుపుకోవాలి.
4. ఎలాంటి గడ్డలు లేకుండా అది జారేలా ఉండాలి. మరి ముద్దగా కాకుండా దోసెల పిండి జారుతున్నట్టు కలుపుకోవాలి.
5. ఇప్పుడు ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టి అందులో పంచదార నీరు పోసి తీగపాకం వచ్చేదాకా మరిగించుకోవాలి.
6. తీగ పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేయాలి.
7. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేయాలి.
8. అందులో ఈ శెనగపిండి మిశ్రమాన్ని జల్లెడలో వేసి ముత్యాల్లా కిందకి రాలేటట్టు చూసుకోవాలి.
9. వాటిని వేగాక తీసి తీగపాకంలో వేసుకోవాలి.
10. ఇలా అన్ని వేసుకున్నాక అందులోనే వేయించిన జీడిపప్పు, పిస్తా, పచ్చ కర్పూరం, యాలకుల పొడి కూడా వేసి కలుపుకోవాలి.11. చేతికి కాస్త నెయ్యి రాసుకొని దీన్ని లడ్డూల్లా చుట్టుకోవాలి.
12. గాలి చొరబడని డబ్బాల్లో ఈ లడ్డూలను దాచుకుంటే వారం రోజులు పాటు తాజాగా ఉంటాయి.
Also Read: మరమరాలతో అప్పటికప్పుడు క్రిస్పీ గారెలు ఇలా చేసేయండి, రెసిపీ ఇదిగో
లడ్డూలకు అభిమానులు ఎక్కువే. ప్రతి స్వీట్ షాపులోనే కచ్చితంగా బూందీ లడ్డు ఉంటుంది. ఈ లడ్డూలు ఇప్పటివి కాదు. సింధులోయ నాగరికతలో కూడా లడ్డూలు అప్పట్లో ఉండేవని చెప్పే ఆధారాలు దొరికాయి. సంస్కృత వైద్య గ్రంథం సుశ్రుత సంహితలో కూడా లడ్డూల ప్రస్తావన ఉంది. వేరుశనగలు, నువ్వులు కలిపి చిన్న లడ్డూల్లా చుట్టేవారని చెప్పుకుంటారు. లడ్డూల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. మోతిచూర్ లడ్డు, తొక్కుడు లడ్డు, షాహి లడ్డు, కొబ్బరి లడ్డు, బేసన్ లడ్డూ… ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల లడ్డూలు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయి. కానీ బూందీ లడ్డుకున్న ఆదరణ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.