Avakai Pulihorara: ఆంధ్ర వంటకాలలో ఆవకాయకు ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పప్పు, ఆవకాయ కాంబినేషన్ అంటే.. ఆహా అనాల్సిందే! అయితే.. చింతపండు, నిమ్మకాయతో కాకుండా, ఘాటైన ఆవకాయ పచ్చడితో చేసే పులిహోర రుచి మాత్రం మరచిపోలేనిది. ఆవకాయ పులిహోర అనేది అప్పటికప్పుడు వంట చేసుకోవాలనుకునే వారికి, ముఖ్యంగా లంచ్ బాక్సుల్లోకి పెట్టుకోవడానికి ఒక అద్భుతమైన ఎంపిక.
పులిహోర అనగానే సాధారణంగా చింతపండు లేదా నిమ్మ పులుపు వంటివి గుర్తొస్తాయి. కానీ ఆవకాయ పులిహోరలో…పులుపు, కారం, ఉప్పు అన్నీ ఆవకాయ పచ్చడి నుంచే సమకూరుతాయి. ఆవపిండి, ఆవనూనె కలగలిసిన ఆవకాయ ఘాటు ఘుమఘుమలు అన్నానికి పట్టి ఒక ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి. ఇది చాలా వేగంగా తయారవుతుంది. అన్నం సిద్ధంగా ఉంటే చాలు, ఐదు నిమిషాల్లో పులిహోర రెడీ చేసుకోవచ్చు. అదెలాగటే..
కావలసిన పదార్థాలు:
వండిన అన్నం- 2 కప్పులు
ఆవకాయ పచ్చడి (నూనెతో సహా)- 1/4 నుంచి 1/2 కప్పు
నూనె (తాలింపు కోసం)- 2 టేబుల్ స్పూన్లు
నెయ్యి- 1 టేబుల్ స్పూన్
శనగపప్పు, మినపపప్పు- 1 టీస్పూన్
ఆవాలు, జీలకర్ర- 1/2 టీస్పూన్
పల్లీలు – 1/4 కప్పు
ఎండుమిర్చి2-3
పచ్చిమిర్చి (నిలువుగా చీల్చినవి)1-2
కరివేపాకు- 2 రెబ్బలు
ఇంగువ – చిటికెడు
పసుపు- 1/4 టీస్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
తయారీ విధానం:
1. అన్నం సిద్ధం చేయడం: ముందుగా అన్నాన్ని వండుకుని, మెత్తగా కాకుండా కొద్దిగా పలుకుగా ఉండేలా చూసుకోవాలి. పులిహోర కోసం అన్నాన్ని ఒక వెడల్పాటి ప్లేట్‌లో వేసి పూర్తిగా చల్లార్చాలి. అన్నం చల్లారిన తర్వాత, అందులో ఆవకాయ పచ్చడి (ముక్కలు, నూనెతో సహా) వేసి, అన్నం మెతుకులు విరగకుండా నెమ్మదిగా కలపాలి.
2. తాలింపు : ఒక చిన్న కడాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి.నూనె కాగిన తర్వాత పల్లీలు వేసి ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో శనగపప్పు, మినపపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. తరువాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. చివరగా, ఇంగువ, పసుపు వేసి ఒక్కసారి కలిపి వెంటనే స్టవ్ ఆపివేయాలి.
Also Read: క్రిస్పీ ఆమ్లెట్.. వెరైటీగా ఇలా ట్రై చేసి చూడండి
3. పులిహోర మిక్సింగ్ : తయారు చేసుకున్న ఈ వేడి తాలింపును, వేయించి పెట్టుకున్న పల్లీలతో సహా.. ఆవకాయ కలిపిన అన్నంలో వేయాలి. అన్నం విరగకుండా.. తాలింపు మొత్తం బాగా కలిసేలా నెమ్మదిగా కలపాలి. రుచి చూసి, అవసరమైతే కొద్దిగా ఉప్పు లేదా మరికొంత ఆవకాయ నూనె/పచ్చడిని కలుపుకోవచ్చు. అంతే! నోరూరించే ఆంధ్రా స్పెషల్ ఆవకాయ పులిహోర సిద్ధం. ఈ పులిహోరను అప్పటికప్పుడు వేడి వేడిగా తిన్నా, కాస్త చల్లారిన తర్వాత తిన్నా దీని రుచి అద్భుతంగా ఉంటుంది. పక్కన చిప్స్ లేదా వేయించిన అప్పడాలు ఉంటే ఈ భోజనం అదిరిపోతుంది.