హలీం పేరు చెబితేనే ఎంతోమందికి నోరూరిపోతుంది. రంజాన్ లో స్పెషల్ గా దీన్ని తింటారు. చికెన్ తో హలీం ఎలా చేయాలో ఇక్కడ చెప్పాము. ఇలా వండితే మీరు కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు వండేసుకోవచ్చు. రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
చికెన్ హలీం చేసేందుకు కావలసిన పదార్థాలు
చికెన్ ముక్కలు – అరకిలో
దాల్చిన చెక్క – మూడు ముక్కలు
బిర్యానీ ఆకులు – మూడు
యాలకులు – 10
మిరియాలు – 10
లవంగాలు – 10
తెల్ల నువ్వులు – ఒక స్పూను
తోక మిరియాలు – 10
జీలకర్ర – ఒక స్పూను
షాజీరా – ఒక స్పూను
పెసరపప్పు – రెండు స్పూన్లు
కందిపప్పు – రెండు స్పూన్లు
మినప్పప్పు – రెండు స్పూన్లు
ఎర్ర కందిపప్పు – రెండు స్పూన్లు
పచ్చిశనగపప్పు – రెండు స్పూన్లు
బాదంపప్పులు – ఆరు
ఉల్లిపాయలు – మూడు
గోధుమ రవ్వ – 50 గ్రాములు
నెయ్యి – అరకప్పు
పెరుగు – ఒక కప్పు
జీడిపప్పులు – అర కప్పు
అల్లం వెల్లుల్లి పేస్టు – రెండు స్పూన్లు
ధనియాలపొడి – ఒక స్పూను
గరం మసాలా – ఒక స్పూను
పుదీనా – ఒక కట్ట
కొత్తిమీర – ఒక కట్ట
పచ్చిమిర్చి – నాలుగు
ఉప్పు – రుచికి సరిపడా
చికెన్ హలీం రెసిపీ
⦿ చికెన్ హలీమ్ చేసేందుకు ఎముకలతో కూడిన చికెన్ లేదా ఎముకలు లేని చికెన్ ఏది తీసుకున్నా మంచిదే.
⦿ వాటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
⦿ ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఉల్లిపాయలను నిలువుగా సన్నగా తరిగి నూనెలో వేసి నల్లగా మారేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలి.
⦿ గోధుమ రవ్వను నీళ్లలో వేసి నానబెట్టుకోవాలి.
⦿ ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి మూడు స్పూన్ల నూనె వేయాలి.
⦿ అందులో బిర్యానీ ఆకులు, షాజీరా, జీలకర్ర, యాలకులు, మిరియాలు, నువ్వులు, లవంగాలు, తోక మిరియాలు, దాల్చిన చెక్క వేసి వేయించుకోవాలి.
⦿ అవి వేగాక శుభ్రంగా కడిగి పెట్టిన చికెన్ ని కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి.
⦿ ఒక స్పూను ఉప్పు రెండు స్పూన్ల కారం వేసి బాగా కలుపుకోవాలి.
⦿ ఒక స్పూన్ పసుపును కూడా వేసి బాగా కలపాలి.
⦿ చికెన్ మునిగే వరకు నీళ్లను వేసి కుక్కర్లో పెట్టి బాగా మెత్తగా ఉడికించాలి. ఐదు ఆరు విజిల్స్ వచ్చేవరకు అలా ఉడికించుకోవాలి.
⦿ ఆవిరి పోయాక కుక్కర్ మూత తీసి చికెన్ ను వడకట్టుకోవాలి.
⦿ చికెన్ నీటిని వేరేగా, చికెన్ ముక్కలను వేరేగా పెట్టుకోవాలి.
⦿ చికెన్ ముక్కల్లో ఉన్న బిర్యాని ఆకుని తీసి పడేయొచ్చు.
⦿ ఇప్పుడు ఆ చికెన్ ముక్కలను మెత్తగా నలుపు కోవాలి. చికెన్ బాగా ఉడికించాం కాబట్టి త్వరగానే చికెన్ మెత్తగా నలిగిపోతుంది.
⦿ ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అన్ని రకాల పప్పులు, బాదం పప్పులు కూడా వేసి వేయించాలి.
⦿ ఇందులో నూనె వేయాల్సిన అవసరం లేదు. వాటిని దోరగా వేయించి అందులో అవి మునిగే వరకు నీళ్లను వేసి బాగా ఉడికించాలి. అవి బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేయాలి.
⦿ ఇప్పుడు ఆ పప్పులను పప్పు గుత్తితోనే బాగా నొక్కి మెత్తగా రుబ్బుకోవాలి.
⦿ ఇప్పుడు మరొక కళాయిని స్టవ్ మీద పెట్టి నెయ్యి వేయాలి.
⦿ ఆ నెయ్యిలో జీడిపప్పులను వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.20. ఇప్పుడు మిగిలిన నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.
⦿ పచ్చివాసన పోయేదాకా వేయించి ముందుగా నానబెట్టుకున్న గోధుమ రవ్వను వడకట్టి ఆ రవ్వను మాత్రమే పిండి ఇందులో వేయాలి.
⦿ దీనిని నూనెలో వేయించాక రెండు కప్పులు నీళ్లు వేసి కాసేపు ఉడికించాలి.
⦿ ఇది మెత్తగా ఉడికిన తర్వాత ముందుగా మనము రుబ్బి పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి.
⦿ తర్వాత మెత్తగా నలుపుకున్న చికెన్ కూడా వేసి బాగా కలపాలి.25. తర్వాత పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగును వేసి బాగా కలపాలి.
⦿ అలాగే వేయించి పెట్టుకున్నా ఉల్లిపాయలను కూడా వేసి బాగా కలపాలి.
⦿ ఇందులోనే ధనియాల పొడి, కారం, గరం మసాలా, పెరుగు, రెండు స్పూన్ల నెయ్యి వేసి బాగా కలపాలి.
⦿ ఆ తర్వాత ముందుగా చికెన్ ఉడకబెట్టుకున్న నీటిని పక్కన పెట్టుకున్నాము.
⦿ ఆ నీళ్లను కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. అలా అని మరీ ఎక్కువ నీటిని వేయకూడదు. ఎంత అవసరమో అంతే వేసుకోవాలి.
⦿ ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా ఉడికించాలి. పైన మూత పెడితే బాగా ఉడుకుతుంది.
⦿ మధ్యలో మూత తీసి పప్పు గుత్తితో నలుపుతూ రెండు స్పూన్ల నెయ్యి వేస్తూ ఉండాలి.
⦿ ఇలా పది నుంచి 15 సార్లు కలుపుతూ నెయ్యి వేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల హలీం మరీ మెత్తగా ఉడుకుతుంది.
⦿ ఇది బాగా ఉడికి నెయ్యి పైకి తేలే వరకు అలా పప్పు గుత్తితో రుబ్బుతూ ఉండండి.
⦿ నెయ్యి పైకి తేలినట్టు అనిపిస్తే అప్పుడు వేయించిన జీడిపప్పులను వేయించిన ఉల్లిపాయ ముక్కలను పైన చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి.
⦿ అంతే టేస్టీ చికెన్ హలీం రెడీ అయినట్టే. ఇది కష్టంగా అనిపిస్తుంది. కానీ చేస్తే చాలా సులువుగా అయిపోతుంది. ఒకసారి మేము చెప్పిన పద్ధతిలో మీరు ప్రయత్నించి చూడండి.
Also Read: సోలో పాలిమరీ ట్రెండ్.. ఇదొక విచ్చలవిడి ప్రేమ పద్ధతి, ఎంతమందితోనైనా..