చాక్లెట్‌తో ముడిపడి ఉన్న ఆహారాలన్నీ పిల్లలకు ఇష్టమైనవే. చాక్లెట్ అనేది పిల్లలకే కాదు, పెద్దలకు కూడా ఎంతో నచ్చుతుంది. ఇక్కడ మేము చాక్లెట్ దోశ రెసిపీ ఇచ్చాము. ఉదయాన్నే అల్పాహారం తినడానికి ఏడిపించే పిల్లలకు ఈ చాక్లెట్ దోశ పెట్టి చూడండి. ఈజీగా తినేస్తారు. పైగా దీన్ని చేయడం కూడా చాలా సులువు. సాంప్రదాయ దోశకు ఈ చాక్లెట్ వెర్షన్ అప్లై చేస్తే ఎంత రుచిగా ఉంటుందో.. ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఇక చాక్లెట్ దోశ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
చాకొలెట్ దోశ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
దోశ పిండి – ఒక కప్పు
కోకో పౌడర్ – రెండు స్పూన్లు
బ్రౌన్ షుగర్ – రెండు స్పూన్లు
బటర్ – అర స్పూను
దాల్చిన చెక్క పొడి – చిటికెడు
వెనిల్లా ఎసెన్స్ – చిటికెడు
చాక్లెట్ దోశ రెసిపీ
1. చాక్లెట్ దోశ చేసేందుకు చిన్న గిన్నెలో బ్రౌన్ షుగర్, కోకో పౌడర్ వేసి బాగా కలపండి.
2. అందులోనే దాల్చిన చెక్క పొడి లేదా వెనిల్లా ఎసెన్సు వేసి బాగా కలపండి.
3. ఈ మొత్తం మిశ్రమాన్ని దోశ పిండిలో వేసి బాగా కలపండి.
4. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేయండి.
5. పెనం వేడెక్కాక పైన బటర్ వేయండి. ఇప్పుడు పిండిని వేసి దోశలాగా రుద్దండి.
6. దోశలను రెండు వైపులా కాల్చి తీసి ఒక ప్లేట్ పై వేయండి.7. పైన చాక్లెట్ సిరప్ ను చల్లండి. అంతే టేస్టీ చాక్లెట్ దోశ రెడీ అయిపోతుంది.
మీ పిల్లలు దీన్ని చాలా ఇష్టంగా తింటారు. ఈ దోశను తినడానికి పక్కన ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదు. ఇది తియ్యగా ఉంటుంది. కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. పైగా ఇందులో మనం వేసింది కోకో పౌడర్, బటర్ ఆరోగ్యానికి మేలే చేస్తుంది. బ్రౌన్ షుగర్ కూడా సాధారణ పంచదారతో పోలిస్తే మంచిదే. ఇక వెనిల్లా ఎసెన్స్, యాలకుల పొడి… ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే. కాబట్టి చాక్లెట్ దోశను అప్పుడప్పుడు పిల్లలకు చేసి పెట్టండి. వారు చాలా ఇష్టంగా తింటారు.
పిల్లలకు అల్పాహారాల్లో కొత్త కొత్తగా ప్రయత్నిస్తే వారు త్వరగా ఇష్టంగా తినే అవకాశం ఉంది. దోశలను పిల్లలు ఇష్టపడతారు. కాబట్టి మీరు పాలకూర వంటివి పిల్లలకు పెట్టాలనుకుంటే పాలకూర దోశ ప్రయత్నించండి. అలాగే బీట్రూట్ దోశ, క్యారెట్ దోశ ఇలా ప్రతిదీ ప్రయత్నించవచ్చు. దోశ క్రంచీగా, క్రిస్పీగా వస్తుంది. కాబట్టి పిల్లలు సులువుగా తినేస్తారు. అయితే ఏదైనా కూడా ఒకసారి వేయించి పచ్చివాసన పోయిన తర్వాతే రుబ్బి దోశ పిండిలో కలపాలి. లేకపోతే పచ్చివాసన వచ్చేస్తుంది. పిల్లలు తినేందుకు అసలు ఇష్టపడరు. ఒకసారి మేము చెప్పిన పద్ధతిలో చాక్లెట్ దోశ చేసి పెట్టండి. వారికి కచ్చితంగా నచ్చుతుంది.