Collagen Rich Fruits: శరీర ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి అత్యంత ముఖ్యమైన ప్రోటీన్‌లలో కోల్లాజెన్ ఒకటి. ఇది మన చర్మం, ఎముకలు, కండరాలు, కీళ్లు, జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది. ఇదిలా ఉంటే.. వయసు పెరిగే కొద్దీ, శరీరంలో కోల్లాజెన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీని వల్ల చర్మం ముడతలు పడడం, కీళ్ల నొప్పులు, జుట్టు పలచబడడం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలను అధిగమించడానికి కోల్లాజెన్ అధికంగా ఉండే పండ్లను ఆహారంలో చేర్చుకోవడం ఒక సులభమైన మార్గం.
కోల్లాజెన్ ఉత్పత్తికి విటమిన్ సి అత్యంత అవసరం. విటమిన్ సి కోల్లాజెన్ ఫైబర్ల నిర్మాణానికి సహాయపడుతుంది. కాబట్టి.. విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తీసుకోవడం చాలా ముఖ్యం. అటువంటి కొన్ని పండ్లు, వాటి ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సిట్రస్ పండ్లు (నారింజ, నిమ్మ, బత్తాయి):
సిట్రస్ పండ్లు విటమిన్ సి ని అత్యధికంగా కలిగి ఉంటాయి. ఒక నారింజ పండులో రోజువారీ అవసరానికి మించిన విటమిన్ సి ఉంటుంది. ఇది కోల్లాజెన్ ఉత్పత్తిని పెంచడమే కాకుండా.. చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది. ఈ పండ్ల రసాన్ని రోజూ తాగడం లేదా నేరుగా తినడం వల్ల చర్మానికి మంచి మెరుపు వస్తుంది.
స్ట్రాబెర్రీలు:
బ్లూబెర్రీస్, రాస్ప్‌బెర్రీస్, స్ట్రాబెర్రీస్ వంటి బెర్రీలు కూడా విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని వృద్ధాప్య లక్షణాల నుంచి రక్షిస్తాయి. బెర్రీలు తినడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది.
కివీ ఫ్రూట్స్:
కివీ ప్రూట్ విటమిన్ సి, విటమిన్ ఇ రెండింటినీ అధికంగా కలిగి ఉంటుంది. ఈ రెండు విటమిన్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కివీలో ఉండే విటమిన్ ఇ చర్మానికి తేమను అందించి, చర్మం పొడిబారకుండా చేస్తుంది.
పైనాపిల్:
పైనాపిల్‌లో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ కోల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. దీంతో పాటు.. పైనాపిల్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మంపై ఏర్పడే మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది.
అవకాడో:
అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ, విటమిన్ సి ఉంటాయి. ఈ పోషకాలు చర్మం ఆరోగ్యంగా, హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహాయపడతాయి. అవకాడో తీసుకోవడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.
మామిడి పండు:
మామిడిలో విటమిన్ సి , విటమిన్ ఎ అధికంగా ఉంటాయి. విటమిన్ ఎ చర్మ కణాలను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. దీని వల్ల చర్మం తాజాగా కనిపిస్తుంది.
Also Read: జుట్టు పెరగాలంటే.. ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి ?
బొప్పాయి:
బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది చర్మం డెడ్ సెల్స్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా బొప్పాయిలో విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. ఇది కోల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది.
ఈ పండ్లను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి సహజంగా పెరుగుతుంది. దీంతో పాటు..తగినంత నీరు తాగడం, సరైన నిద్ర, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం కూడా అవసరం. పండ్లతో పాటు, గుడ్లు, చేపలు, ఆకుపచ్చ కూరగాయలు వంటి ఇతర కోల్లాజెన్-రిచ్ ఆహారాలను కూడా తీసుకోవడం మంచిది. ఈ ఆహార పద్ధతులను పాటించడం వల్ల మీరు లోపలి నుంచి ఆరోగ్యంగా, అందంగా ఉంటారు.