వేసవిలో శరీరం ఎక్కువగా చెమట పడుతుంది. దీంతో శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. అందుకే ఈ కాలంలో హైడ్రేషన్ చాలా ముఖ్యం. అయితే చాలామంది కేవలం నీళ్లు తాగితే సరిపోతుందని భావిస్తారు. కానీ కొన్ని తప్పు అలవాట్ల వల్ల నీళ్లు తాగినా దాహం తగ్గదు. శరీర వేడి కూడా తగ్గదు. ఆయుర్వేద నిపుణులు వేసవిలో పాటించాల్సిన సరైన పద్ధతులను సూచిస్తున్నారు.
చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఫ్రిజ్ నీళ్లు తాగడం. ఈ నీళ్లు తాత్కాలికంగా గొంతును చల్లబరుస్తాయి. కానీ నిజంగా దాహాన్ని తగ్గించవు. మరీ చల్లని నీళ్లు జీర్ణశక్తిని బలహీనపరుస్తాయి. శరీరం ఆ నీటిని మళ్లీ వేడి చేయడానికి అదనపు శక్తిని ఉపయోగిస్తుంది. సాధారణ ఉష్ణోగ్రతలో ఉన్న నీళ్లు శరీరానికి ఎక్కువ ఉపయోగపడతాయి. అవి కణాల్లోకి సులభంగా చేరి మంచి హైడ్రేషన్ ఇస్తాయి.
చెమట ద్వారా శరీరం సోడియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలను కోల్పోతుంది. కేవలం నీళ్లు మాత్రమే తాగితే ఈ ఖనిజాలు తిరిగి లభించవు. ఆయుర్వేదం ప్రకారం.. సహజ ఎలక్ట్రోలైట్ పానీయాలు మంచివి. కొబ్బరి నీరు, మజ్జిగ, గుల్కంద్ శర్బత్ వంటి పానీయాలు శరీరాన్ని చల్లబరుస్తాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలు కూడా అందిస్తాయి.
చాలామంది ఒక్కసారిగా ఎక్కువ నీళ్లు తాగుతారు. ఈ అలవాటు కూడా మంచిది కాదు. ఇలా తాగిన నీరు శరీర కణాలకు సరిగా చేరదు.
రక్తంలో సోడియం స్థాయిలు తగ్గిపోవచ్చు. దీంతో అలసట, బలహీనత వస్తాయి. ఆయుర్వేదం ప్రకారం కొద్దికొద్దిగా నీళ్లు తాగడం మంచిది. తరచూ చిన్న మోతాదులో నీరు తాగితే శరీరం బాగా హైడ్రేట్ అవుతుంది.
వేసవిలో చాలామంది కోల్డ్ డ్రింక్స్ తాగుతారు. కానీ ఇవి దాహాన్ని తగ్గించవు. పైగా శరీరంలో వేడి, మలినాలు పెంచుతాయి.
చక్కెర ఉన్న పానీయాలను జీర్ణం చేయడానికి శరీరానికి మరింత నీరు అవసరం అవుతుంది. దీంతో మరింత దాహం వేస్తుంది.
కాబట్టి సోడాలు, ప్యాకేజ్డ్ డ్రింక్స్‌ను తగ్గించడం మంచిది.
Also Read: అదృష్టవంతులకు మాత్రమే కలలో ఈ వస్తువులు కనిపిస్తాయి.. మీకూ కనిపిస్తున్నాయా?
వేసవిలో కొన్ని సహజ పానీయాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
కొబ్బరి నీరు
సత్తు డ్రింక్
గుల్కంద్ శర్బత్
మజ్జిగ
నిమ్మరసం
ఖస్ షరబత్ డ్రింక్
మట్టి కుండలో నిల్వ చేసిన నీరు
ఈ పానీయాలు శరీరాన్ని సహజంగా చల్లబరుస్తాయి. శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ కూడా అందిస్తాయి. వేసవిలో కేవలం నీళ్లు తాగడం సరిపోదు. సరైన పద్ధతిలో నీరు, ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవాలి. మంచి అలవాట్లు పాటిస్తే దాహం తగ్గి శరీరం ఫ్రెష్‌గా ఉంటుంది.