Side Effects of Raw Onion: ఉల్లి చేసే మేలు తల్లి చేయదు అనే నానుడి ఉంది. ఉల్లిపాయల వల్ల అనేక అన్ని రకాల లాభాలు ఉన్నాయని దాని అర్థం. దీన్ని ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో వీటిని చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బులు రాకుండా చేయడంలో కూడా ఉల్లిపాయలు సహాయపడతాయని అంటున్నారు. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా ఇవి సహకరిస్తాయట.
ఉల్లిపాయల్లో ఉండే క్వెర్సెటిన్ అనే సమ్మేళనం రక్తపోటును నియంత్రించేందుకు హెల్ప్ చేస్తుందట. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ని తొలగించేందుకు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఉల్లిపాయల్లో ఉండే ప్రీబయోటిక్‌లు యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయట. ఇమ్యూన్ పవర్ పెంచడంలో ఇవి సహాయపడతాయి.
ఉల్లిపాయల వల్ల సైడ్ ఎఫెక్ట్స్..
ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కదా అని పచ్చి ఉల్లిపాయలను మోతాదుకు మించి తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని మితిమీరి తినడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఉదర సమస్యలు:
ఎక్కువ మొత్తంలో పచ్చి ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయలోని సల్ఫర్ సమ్మేళనాలు జీర్ణవ్యవస్థపై చడు ప్రభావం చూపుతాయట. ఇందులో ఉండే కెమికల్స్ కారణంగా కడుపులో అసౌకర్యంగా ఉంటుందని అంటున్నారు. మరికొందరికి పచ్చి ఉల్లిపాయల వల్ల కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉందట.
నోటి దుర్వాసన:
పచ్చి ఉల్లిపాయలను ఎక్కువగా తినడం వల్ల నోటి దుర్వాసన వచ్చే ఛాన్స్ ఉంది. కొన్ని సార్లు అయితే దంతాలు శుభ్రం చేసుకున్న తరువాత కూడా శ్వాస చెడు వాసన వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వీటిని మితంగా తీసుకోవడమే ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
ALSO READ: శరీరానికి విటమిన్-ఇ ఎంత అవసరమో తెలుసా..?
రక్తస్రావం:
విటమిన్-కె లోపంతో ఇబ్బంది పడుతున్న వారికి గాయలు అయినప్పుడు అధిక రక్తస్రావం అవుతుంది. వీళ్లు పచ్చి ఉల్లిపాయలకు చాలా దూరంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఉల్లిపాయలకు రక్తాన్ని పల్చగా చేసే స్వభావం ఉంటుంది. అందుకే విటమిన్-కె డెఫిషియెన్సీ ఉన్న వారు గాయపడ్డప్పుడు వీటిని తింటే ఎక్కువ రక్తాన్ని కోల్పోయే ఛాన్స్ ఉంది.
చర్మ సమస్యలు:
పచ్చి ఉల్లిపాయలు అతిగా తినడం వల్ల కొందరికి చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని డెర్మటాలజిస్ట్‌లు చెబుతున్నారు. వీటిరి మితిమీరి తీసుకున్నవారిలో కాంటాక్ట్ డెర్మటైటిస్ వంటి స్కిన్ ఇన్‌ఫెక్షన్లు వచ్చాయని అంటున్నారు. అందుకే పచ్చి ఉల్లిపాయలను మోతాదుకు మించి తీసుకోవద్దని సూచిస్తున్నారు.
ఎన్ని ఉల్లిపాయలు తింటే మంచిది..?
రోజుకు ఒక్క పచ్చి ఉల్లిపాయ తినడం మాత్రమే ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ మోతాదులో పచ్చి ఉల్లిపాయలు తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయట.