థాయిలాండ్, మయన్మార్ లో సంభవించిన భూకంపం మునుపెన్నడూ ఆయా ప్రాంతాలు చూడని విధ్వంసానికి సాక్షిగా నిలిచింది. ముఖ్యంగా థాయిలాండ్ ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. వెంట వెంటనే వచ్చిన భూకంపాలు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశాయి. వందల సంఖ్యలో ప్రజలు మరణించారు, ఈ లెక్కలు ఇంకా పూర్తి స్థాయిలో నిర్థారణ కాలేదు. రోజులు గడిచేకొద్దీ శవాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ విపత్తులో చైనాకు చెందిన ఓ నిర్మాణ సంస్థ పేరు ప్రముఖంగా వినపడుతోంది. థాయిలాండ్ విలయానికి చైనాకు కారణం ఏంటి..? చైనా నిర్మాణ సంస్థ పాపం ఎంతమందిని బలితీసుకుంది..?
పేకమేడలా కూలిన భవనం
థాయిలాండ్ లో వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.7 గా నమోదైంది. ఈ భూకంప తీవ్రతకు ఆకాశ హర్మ్యాలు కూడా ఊగిసలాడాయి. పెద్ద పెద్ద భవనాల్లో చివరి అంతస్తుల్లో ఉన్న స్విమ్మింగ్ పూల్స్ లో నీరు అలలు కొడుతూ బయటకు వచ్చింది. జలపాతంలా ఆ నీరు పడే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వందలాది భవనాలు భూకంపానికి అటు ఇటు ఊగాయి కానీ కుప్పకూలిపోలేదు. కానీ నిర్మాణంలో ఉన్న ఒకే ఒక భవనం పేకమేడలా కూలిపోయింది. ఆ భవనమే ఇప్పుడు వార్తల్లో నిలిచింది.
శిథిలాలకింద వెదుకులాట
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో 33 అంతస్తుల ఎత్తైన భవనం భూకంపానికి కుప్పకూలింది. అంతకంటే ఎత్తైన భవనాలు, పాత భవనాలు కేవలం అటు ఇటు ఊగాయి అంతే, కానీ నిర్మాణంలో ఉన్న ఈ భవనం మాత్రం పేకమేడలా అక్కడికక్కడే కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 17మంది మరణించినట్టు అధికారులు ధృవీకరించారు. మరో 32మంది గాయాలతో బయటపడ్డారు. 83 మంది ఆచూకీ ఇంకా తెలియలేదు. వీరిలో ఎక్కువ మంది ఆ భవన నిర్మాణంలో పనిచేస్తున్న కార్మికులు. థర్మల్ ఇమేజింగ్ డ్రోన్స్ సాయంతో వారిని వెదికే పనిలో ఉన్నారు అధికారులు. ఈ డ్రోన్స్ ద్వారా 15మందిని రక్షించారు. మిగతా వారు కూడా శిథిలాల కింద ప్రాణాలతో ఉంటారని, వారికోసం గాలిస్తున్నారు.
చైనా నిర్మాణ సంస్థ
బ్యాంకాక్ లోని ఈ స్కైలైన్ బిల్డింగ్ ని థాయిలాండ్ స్టేట్ ఆడిట్ ఆఫీస్ కోసం నిర్మిస్తున్నారు. నిర్మాణ సంస్థ పేరు చైనా రైల్వే నెంబర్-10. ఇటాలియన్-థాయ్ డెవలప్ మెంట్ సంస్థతో కలసి ఇక్కడ నిర్మాణం మొదలు పెట్టారు. థాయిలాండ్ చట్టాల ప్రకారం ఈ సంస్థకు గ్రూప్ కంపెనీలో 49శాతం వాటా ఉంది. ఆఫీస్ బిల్డింగ్స్, రైల్వే లైన్లు, పబ్లిక్ రోడ్స్ వంటి పెద్ద పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ లను ఈ సంస్థ చేపడుతోంది. అలాంటి ఈసంస్థ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది.
దర్యాప్తుకి ఆదేశం
చైనా సంస్థ నిర్మిస్తున్న 33 అంతస్తుల భవనం కుప్పకూలిపోవడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు స్థానికులు. అక్కడే ఉన్న మిగతా బిల్డింగ్ లు కూడా భూకంప ప్రభావానికి గురైనా, ఈ భవనం మాత్రం పూర్తిగా కూలిపోయింది. దీన్ని బట్టి అది ఎంత నాసిరకం నిర్మాణమో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. 45 మిలియన్ పౌండ్ల అంచనా వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఆ డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరులా మిగిలింది. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేయాలంటూ థాయిలాండ్ ఉప ప్రధాన మంత్రి అనుతిన్ చార్న్‌విరాకుల్ ఆదేశించారు.
అన్ని భవనాలు చెక్కుచెదరకుండా ఉన్నా, ఆ భవనం ఒక్కటి కూలిపోవడం సంచలనంగా మారింది. దీంతో చైనా సంస్థ ఇప్పుడు ప్రపంచం ముందు దోషిగా నిలబడింది. అసలే నష్టాల్లో ఉన్న ఆ సంస్థకు ఈ ఆరోపణ మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టబోతోంది. నాసిరకం నిర్మాణం కావడంవల్లే కూలిపోయిందనే ఆరోపణలు బలంగా వినపడుతున్నాయి.