మధ్యాహ్నం భోజనం చేశాక నిద్ర రావడం, ఆవలింతలు రావడం సహజం. కానీ కొంతమందికి పదేపదే ఆవలింతలు వస్తూనే ఉంటాయి. అలసట లేకపోయినా కూడా ఆవలింతలు వస్తున్నాయంటే అది తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతంగా భావించాలని అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ చెబుతోంది. ఈ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం తరచుగా ఆవలించడం అనేది నిద్రలేమికి సంకేతం కావచ్చని… అది ఏదైనా తీవ్రమైన నిద్ర సమస్యను నిద్ర రుగ్మతను సూచిస్తుందని చెబుతున్నారు.
కొత్త అధ్యయనం ప్రకారం పగటిపూట అధికంగా నిద్రపోవడం వల్ల సోమరితనం పెరుగుతుంది. అలాగే డ్రైవింగ్ లో ప్రమాదాలు, పనిలో పొరపాట్లు కూడా జరుగుతాయి. మానసిక సమస్యలు కూడా ఏర్పడతాయి. దీర్ఘకాలిక అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశం ఉంది. పగటిపూట మీకు పదేపదే ఆవలింతలు వస్తున్నాయంటే అర్థం… మీరు ఏదో ఒక నిద్ర రుగ్మతతో బాధపడుతున్నారని. మంచి నిద్ర పొందని వ్యక్తులు కూడా పగటిపూట ఆవలింతలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ఆవలింతలు వస్తున్నప్పుడు మీరు ఉద్యోగం పైనే కాదు… ఏ పని పైనా దృష్టి పెట్టలేరు. దీనివల్ల ప్రొడక్టివిటీ కూడా తగ్గిపోతుంది.
ఆవలింతలకు కారణం
తరచూ ఆవలించడానికి కొన్ని కారణాలను వివరిస్తున్నారు పరిశోధకులు. నిద్ర లేకపోవడం వల్ల ఆవలింతలు ఎక్కువగా వస్తాయి. శరీరానికి తగినంత నిద్ర లేకపోయినా కూడా ఇలా ఆవలిస్తూనే ఉంటారు. అలాగే అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా వంటి నిద్ర రుగ్మతతో బాధపడుతున్నా కూడా మీకు తరచు ఆవలింతలు వస్తాయి. అలాగే నార్కోలెప్సీ అని పిలిచే నిద్రా సమస్య ఉన్నా కూడా ఆవలింతలు వచ్చే అవకాశం ఉంది. ఒత్తిడి నిరాశ వంటి వాటితో బాధపడుతున్న వారికి కూడా ఆవలింతలు వస్తాయి. అలాగే కొన్ని రకాల మందుల సైడ్ ఎఫెక్టుల వల్ల కూడా ఆవలింతలు అధికంగా వస్తాయి. రాత్రిపూట ఎక్కువ సేపు ఫోను, టీవీ వంటివి చూసేవారిలో చెడు జీవన శైలిని ఫాలో అయ్యే వారిలో కూడా ఆవలింతలు వచ్చే సమయం అవకాశం ఎక్కువగా ఉంటుంది.
దీనివల్ల వచ్చే ప్రమాదాలు
తరచూ ఆవలింతలు రావడం వల్ల మానసికంగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఏ పనికైనా దృష్టి కేంద్రీకరించలేరు. వాహనం నడుపుతున్నప్పుడు ప్రమాదాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే చేసే పనిలో తప్పులు కూడా అధికంగా చేస్తారు. ఆత్మహత్య ఆలోచనలు కూడా వీరిలో అధికంగా వస్తాయి. వీరిలో చిరాకు, మానసిక ఆందోళన పెరిగిపోతాయి. సామాజిక ప్రవర్తనలు కూడా మార్పులు వస్తాయి.
ఎలా అడ్డుకోవాలి?
రాత్రిపూట స్క్రీన్ టైంను తగ్గించండి. ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోయి ఒకే సమయానికి లేచేలా ప్లాన్ చేసుకోండి. రాత్రినిద్ర ఏడు నుంచి ఎనిమిది గంటలు ఉండేలా చూసుకోండి. నిద్రా సమయాల్లో క్రమం తప్పకుండా పాటించడం ఎంతో ముఖ్యం. అలాగే కెఫీన్ అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. టీ, కాఫీలను తగ్గించాలి. అలాగే ఆల్కహాల్ వినియోగాన్ని కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇన్ని పనులు చేసినా కూడా మీకు ఎలాంటి ఫలితం కనిపించకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఉంది.
వైద్యులు చెబుతున్న ప్రకారం తరచూ ఆవలించడం అనేది అలసటకు మాత్రమే సంకేతం కాదు. అది శరీరం ఇబ్బందుల్లో పడుతుంది అని చెప్పడానికి ఒక హెచ్చరిక లాంటిది. ఆవలింతలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో పెద్ద అనారోగ్యాలు రావచ్చు. కాబట్టి నిద్రకు ప్రాధాన్యత ఇచ్చి ఆవలింతలను అదుపులో ఉంచుకోండి.