Cannabis: గంజాయి మొక్కను శాస్త్రీయంగా ‘కానబిస్ సటైవా’ అని పిలుస్తారు. గంజాయి అనగానే అది ఒక మత్తు పదార్థం, డ్రగ్ అని చాలా మంది భయపడి పోతారు. గంజాయిలో కూడా ఔషధ గుణాలు ఉంటాయనే విషయం తెలిసిన వారు చాలా అరుదుగా ఉంటారు. వేల సంవత్సరాల కంటే ముందు నుంచే ఔషధ ఉపయోగాల గంజాయిని వాడుతున్నారట. ఈ మొక్కలోని కెమికల్స్, ముఖ్యంగా కానబినాయిడ్స్ అనే పదార్థాలు, ఆరోగ్య సమస్యల చికిత్సలో సహాయపడతాయి. అసలు గంజాయి మొక్కలో ఉండే ఔషధ గుణాలు ఏంటి, వాటి ఉపయోగాలు ఏమున్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం..
కానబినాయిడ్స్
గంజాయిలో టెట్రాహైడ్రోకానబినాల్ (THC), కానబిడియోల్ (CBD) అని రెండు ప్రధాన కానబినాయిడ్స్ ఉన్నాయి. THC అనేది మానసిక ప్రభావాలను కలిగించే పదార్థం. అయితే CBD మాత్రం ఔషధ గుణాలను అందించడంలో హెల్ప్ చేస్తుంది. ఇది మత్తు కలిగించదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు పదార్థాలు శరీరంలోని ఎండోకానబినాయిడ్ వ్యవస్థతో కలిసి పనిచేసి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని అంటున్నారు.
ఔషధ గుణాలు
గంజాయి మొక్కలోని CBD నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుందట. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, దీర్ఘకాలిక నొప్పుల చికిత్సకు దీన్ని ఉపయోగిస్తారు. చాలా మంది రోగులు నొప్పులను తగ్గించుకోవడానికి టాబ్లేట్స్‌కు బదులుగా CBD ఆధారిత ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు.
ఒత్తిడి
మానసిక ఆందోళన, ఒత్తిడిని తగ్గించడంలో కూడా CBD సహాయపడుతుందని మానసిక వైద్యులు చెబుతున్నారు. ఇది మెదడులోని సెరోటోనిన్ గ్రాహకాలతో కలవడం వల్ల ఒత్తిడి తగ్గిపోతుందట. దీని వల్ల నిద్రలేమి సమస్యలు కూడా తగ్గుతాయని డాక్టర్లు చెబుతున్నారు.
మూర్ఛ
మూర్ఛ వ్యాధి చికిత్సలో కూడా దీన్ని వాడతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించకున్నా మూర్ఛ తీవ్రతను తగ్గించడంలో CBD ఉత్పత్తులు సహాయపడతాయని అంటున్నారు. చిన్న పిల్లలలో కొన్ని అరుదైన మూర్ఛ వ్యాధుల చికిత్సకు ఈ ఔషధాలు వాడేందుకు అనుమతి ఉందట.
క్యాన్సర్
క్యాన్సర్ చికిత్సలో కూడా CBD సహాయం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గంజాయి ఆధారిత ఔషధాలు క్యాన్సర్ రోగులకు కీమోథెరపీ వల్ల వచ్చే వికారం, వాంతులను తగ్గిస్తాయట. అలాగే, ఆకలిని పెంచడంలో కూడా సహాయపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
చర్మ సమస్యలు
చర్మ సమస్యలను తగ్గించేందుకు కూడా CBD ప్రభావవంతంగా పని చేస్తుందట. దీంతో తయారు చేసిన క్రీములు, ఆయిల్స్ సోరియాసిస్, ఎగ్జిమా వంటి చర్మ సమస్యలకు చికిత్సలో ఉపయోగపడతాయని డెర్మటాలజిస్ట్‌లు చెబుతున్నారు. అంతేకాకుండా ఇవి వాపును తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయట.
మెడిసినల్ వ్యాల్యూస్ ఉన్నాయి కానీ..
గంజాయి ఔషధ గుణాలు ఉన్నప్పటికీ, దాని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. THC అధిక మోతాదులో తీసుకుంటే మత్తు, ఆందోళన, గుండె దడ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే గంజాయి ఆధారిత ఔషధాలను వైద్యుల సలహాతో మాత్రమే ఉపయోగించాలి. అనేక దేశాల్లో గంజాయి ఔషధ ఉపయోగం చట్టబద్ధం అయినప్పటికీ, దాన్ని కంట్రోల్‌లో వాడాలని చెబుతారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.