High protein diet risks: శరీర దారుఢ్యానికి, కండరాల పటిష్టతకు ప్రోటీన్ ఎంతో అవసరమని అందరికీ తెలుసు.. అయితే ఇటీవల వస్తున్న కొన్ని కొత్త అధ్యయనాలు, నివేదికలు ప్రొటీన్ వాడకంపై కొత్త చర్చకు తెరలేపాయి. మరీ ముఖ్యంగా ఎక్కువ మోతాదులో ప్రోటీన్ తీసుకోవడం వల్ల వృద్ధాప్యం త్వరగా వస్తుందా, ఆయుష్షు తగ్గుతుందా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ కొత్త రీసెర్చ్ రిపోర్ట్ వెనక ఉన్న అసలు నిజాలు ఏంటి, నిపుణులు దీని గురించి ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ జర్నల్ ప్రకారం ఆహారంలో ప్రోటీన్ పరిమాణాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల సెల్యులార్ నష్టాన్ని తగ్గించవచ్చని , వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేయవచ్చని తేలింది. ముఖ్యంగా.. ఎలాంటి సిడెంటరీ లైఫ్‌స్టైల్ ఉన్నవారికి ఇది మరింత వర్తిస్తుంది. పరిశోధకులు సుమారు 350కి పైగా శాస్త్రీయ అధ్యయనాలను విశ్లేషించి.. అవసరానికి మించి ప్రోటీన్ తీసుకోవడం వల్ల జీవ క్రియపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని గుర్తించారు. అయితే .దీని అర్థం ప్రోటీన్ పూర్తిగా మానేయాలని కాదు.. సమతుల్యత పాటించడమే ముఖ్యం.
అవసరానికి మించి అతిగా.. ప్రోటీన్ తీసుకోవడం వల్ల శరీరంలో కొన్ని జీవక్రియల మార్పులు జరుగుతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కండరాల మరమ్మత్తు, ఎదుగుదలకు ప్రోటీన్ ఎంత అవసరమో.. అదే సమయంలో ఈ మార్గాలు నిరంతరం చురుగ్గా ఉంటే అది ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి ఎప్పుడూ మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎవరి వయసు, వారి శారీరక శ్రమ స్థాయి,ఆరోగ్య పరిస్థితిని బట్టి మాత్రమే ప్రోటీన్ తీసుకోవాలి తప్ప, ట్రెండ్ చూసి ఎడాపెడా సప్లిమెంట్లు వాడటం ఆరోగ్యానికి హానికరం.
మార్కెట్లో విరివిగా లభించే ప్రోటీన్ షేక్స్, బార్స్ , ప్రొటీన్ పౌడర్లను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల అందరికీ ఒకేలాంటి ఫలితాలు రావాలని లేదు. అథ్లెట్లు , రోజూ కఠినమైన వ్యాయామాలు చేసే వారికి ప్రోటీన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. కానీ సాధారణ లైఫ్ స్టైల్ ఉన్నవారు లేదా శారీరక శ్రమ తక్కువగా ఉన్నవారు అధికంగా ప్రోటీన్ తీసుకుంటే.. అనవసరపు కేలరీలు పెరిగి బరువు పెరగడానికి ,ఇతర మెటబాలిక్ సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి నిపుణుల సలహా లేకుండా.. ఒకే రూల్‌ను అందరూ పాటించడం సరైన పద్ధతి కాదు.
కిడ్నీ సమస్యలు, కాలేయ సంబంధిత సమస్యలు లేదా ఇతర మెటబాలిక్ అనారోగ్యాలు ఉన్న వారు డాక్టర్ పర్యవేక్షణ లేకుండా హై-ప్రొటీన్ డైట్ అసలు తీసుకోకూడదు. అదే సమయంలో వయసు మీరిన.. వృద్ధులకు కండరాలు క్షీణించకుండా ఉండటానికి తగిన మోతాదులో.. ప్రోటీన్ అవసరం అవుతుంది. అందుకే.. ప్రతి ఒక్కరూ తమ వయసును బట్టి ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. నాన్ వెజ్, రెడ్ మీట్ రూపంలో అధికంగా ప్రోటీన్ తీసుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
ప్రోటీన్ అనేది మన శరీరానికి అత్యంత కీలకమైన పోషకమే అయినప్పటికీ.. ‘ఎక్కువగా ఉంటే ఇంకా మంచిది’ అనే అపోహ నుంచి బయట పడాలి. పప్పుధాన్యాలు, చిక్కుళ్ళు, చేపలు, నూనెగింజలు, పాల ఉత్పత్తుల ద్వారా సహజ పద్ధతిలో తగినంత ప్రోటీన్ పొందడం బెస్ట్. కేవలం ఒకే పోషకాలపై అతిగా దృష్టి పెట్టకుండా మంచి నిద్ర, క్రమమైన వ్యాయామం, సమతుల్య ఆహారంతో కూడిన ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ అలవర్చుకోవడం ద్వారా మాత్రమే మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని, దీర్ఘకాలిక ఆయుష్షును సొంతం చేసుకోవచ్చు.