Hair Growth: విపరీతంగా జుట్టు రాలుతుందని(Hair fall) చాలా మంది మొత్తానికే గుండు గీసేసుకుంటారు. అలా చేస్తే రాలిపోయిన జుట్టు తిరిగి మొలుస్తుందని నమ్ముతారు. గుండు గీసుకోవడం వల్ల నిజంగానే కొత్త జుట్టు వస్తుందా..? దీని వల్ల కోల్పోయిన జుట్టు మళ్లీ వత్తుగా పెరగడం సాధ్యమేనా..? అసలు డాక్టర్లు ఏం చెప్తున్నారంటే..?
జుట్టు రాలడం అనేక కారణాల వల్ల జరుగుతుందట. కొందరిలో పోషకాహార లోపం వల్ల జుట్టు ఊడిపోతుంది. మరికొందరిలో జీన్స్ వల్ల బట్టతల వస్తుంది. ఇలా రకరకాల కారణాల వల్ల జుట్టు ఊడిపోతే గుండు గీసుకోవడం దానికి పరిష్కారం కాదని డాక్టర్లు చెబుతున్నారు.
హార్మోనల్ ఇంబాలన్స్:
హార్మోన్లలో వచ్చే మార్పులు జుట్టు రాలడానికి దారితీస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో, మనోపాజ్ సమయంలో, థైరాయిడ్ సమస్యలు ఉంటే మీ జుట్టు పల్చబడే ఛాన్స్ ఉందట. కొందరిలో జుట్టు ఎక్కువగా రాలిపోవచ్చు.
పోషకాహార లోపం:
జుట్టు ఆరోగ్యంలో తీసుకునే ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. తగినంత విటమిన్లు తీసుకోకుంటే జుట్టు పల్చబడుతుందట. మరికొందరిలో ఐరన్, విటమిన్-డి లేదా జింక్ వంటి ఖనిజాలు లోపిస్తే జుట్టు బలహీనంగా మారి రాలిపోవచ్చట.
ఒత్తిడి:
మరికొందరిలో ఒత్తిడి వల్ల జుట్టు రాలిపోతుందట. సోరియాసిస్ వంటి కొన్ని ఆరోగ్య పరిస్థితులు కూడా జుట్టు రాలడానికి కారణమవుతాయని వైద్యులు చెబుతున్నారు. మరికొందరిలో క్యాన్సర్, డిప్రెషన్ లేదా అధిక రక్తపోటుకు ఉపయోగించే కొన్ని మెడిసిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ జుట్టు రాలిపోయేలా చేస్తాయట.
ALSO READ: అబ్బాయిలకే బట్టతల ఎందుకు?
గుండు చేసుకుంటే..?
అయితే జుట్టు రాలిపోతోంది కదా అని గుండు చేయించుకుంటే కొత్త జుట్టు రాదని వైద్యులు చెబుతున్నారు. గుండు చేసిన తర్వాత మాడు వరకు మాత్రమే జుట్టు కట్ అవుతుంది. దీని వల్ల కుదుళ్ల నుంచి జుట్టు కొత్తగా వస్తుందని అనుకుంటే భ్రమ పడ్డట్లే అని నిపుణులు చెబుతున్నారు. కాకపోతే వెంట్రుకలు అన్నీ ఒకే లెవెల్‌లో పెరగడం వల్ల జుట్టు మందంగా కనిపిస్తుందట. దీన్ని చూసి కొత్త జుట్టు వస్తుంది అనుకుంటే పప్పులో కాలేసినట్టే అని డాక్టర్లు చెబుతున్నారు.
మీరు జుట్టు రాలడం వల్ల ఆందోళనగా అనిపిస్తే, డాక్టర్ లేదా డెర్మటాలజిస్ట్‌ని సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మీ జుట్టు రాలడానికి కారణమేమిటో గుర్తించి, చికిత్స చేయించుకోవడానికి అవి సహాయపడతాయట. హెయిర్ ఫాల్ సమస్య మరీ ఎక్కువగా ఉంటే విటమిన్లు, ఖనిజాలతో కూడిన ఆహారం తీసుకోవడం మంచిది. దీని వల్ల జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.