Falaknuma Express detached: సికింద్రాబాద్ నుంచి హౌరాకు వెళ్తున్న ఫలక్ నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలుకు పెను ముప్పు తప్పింది. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలో రైలు రెండుగా విడిపోయింది. మందస, సున్నాదేవి సమీపంలో ఈ ఘటన జరిగింది. లోకో పైలెట్ గమనించకుండానే కొంతదూరం వెళ్లిపోయారు. ఏం జరుగుతుందో అర్థంకాక విడిపోయిన బోగీల్లోని ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కాస్త ముందుకు వెళ్లి అప్రమత్తం అయిన డ్రైవర్, రైలును నిలిపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది. సమాచారం అందుకున్న టెక్నీషియన్లు స్పాట్ కు చేరకుని బోగీలను కలిపే ప్రయత్నం చేశారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
ఇవాళ ఉదయం హౌరాకు వెళ్లే ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్ నుంచి బయల్దేరింది. శ్రీకాకుళం సమాపంలోకి రాగానే రైలు బోగీలు రెండుగా విడిపోయాయి. ఆయా బోగీల్లోని ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కావడంతో ఏం జరుగుతుందో తెలియక వణికిపోయారు. రైలు పట్టాలు తప్పిందని ప్రయాణీకులు మొదట భయపడ్డారు. ఆ తర్వాత కోచ్‌లు రైలు నుంచి వేరు చేయబడ్డాయని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే సిబ్బంది వెంటనే గమనించి రైలును ఆపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో రైల్వే సిబ్బంది రిలాక్స్ అయ్యారు.
రైలు రెండుగా ఎందుకు విడిపోయిందంటే?
ప్రమాదానికి గల కారణాలపై రైల్వే (Indian Railway) అధికారులు ఆరా తీశారు. కోచ్ లను కలిపి ఉంచే కప్లింగ్ విరిగిపోవడం వల్లే రైలు రెండుగా విడిపోయినట్లు గుర్తించారు. విషయం తెలిసి వెంటనే స్పాట్ కు చేరుకున్న రైల్వే టెక్నీషియన్లు బోగీలను జాయింట్ చేసే పని మొదలు పెట్టారు. కొద్ది గంటల తర్వాత బోగీలను కలిపారు. అనంతరం రైలు తిరిగి బయల్దేరింది. ఈ ఘటనతో సుమారు రెండు గంటల పాటు ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు ఇబ్బంది కలిగింది.
Read Also: నిజామాబాద్ వెళ్లే ప్రయాణీకులకు అలర్ట్, 7 రైళ్లు రద్దు, కారణం ఏంటంటే?
ఘటనపై దర్యాప్తు మొదలు పెట్టిన అధికారులు
ప్రతి రోజూ రాకపోకలు కొనసాగించే ఈ రైలుకు కప్లింగ్ విరిగిపోవడంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రమాదవశాత్తు విరిగిపోయిందా? లేదంటే, కావాలనే ఎవరైనా ఇలా చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు బయటపడే అవకాశం ఉంది.
Read Also: రైల్లో మీ ఫోన్ దొంగిలించబడిందా? సింఫుల్ గా ఇలా గుర్తించండి!