Eating Bread Unhealthy| ఇప్పుడు ప్రజలంతా పరుగుల జీవనానికి అలవాటు పడ్డారు. కుదురుగా కూర్చొని నచ్చిన వంటకం వండుకుని తినే సమయం చాలా మందికి లేకుండా పోయింది. ఇంట్లో భార్య భర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తుండడంపాటు పిల్లల బాధ్యతలు కూడా వారిపై ఉండడంతో అన్నీ త్వరత్వరగానే చేయాలిని భావిస్తుంటారు. దీంతో త్వరగా తయారయ్యే అల్పాహారం, తక్కువ సమయాన్ని తీసుకునే వంటకాలకు ప్రజలు ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా బ్రెడ్ ప్యాకెట్ ఉంటే చాలు.. సులభంగా బ్రేక్‌ఫాస్ట్ తయారు చేయవచ్చని నమ్ముతున్నారు. అయితే ఎంతో మంది వినియోగించే ఈ వైట్ బ్రెడ్ ఆరోగ్యానికి ముప్పుగా మారుతుందని, దాన్ని రోజూ తీసుకుంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
బ్రెడ్‌కి సంబంధించి పోషకాహార నిపుణులు చెబుతున్నది ఏమిటంటే — దాన్ని ప్రతి రోజు తినడం వల్ల కడుపులోని ప్రేగుల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. బ్రెడ్ వినియోగం ఇప్పుడు ప్రతి ఇంట్లో సాధారణంగా మారిపోయింది. పాశ్చాత్య దేశాలను అనుసరించడం వల్ల భారతీయుల అల్పాహారపు ఎంపికల్లోనూ బ్రెడ్‌కు చోటు దక్కించుకుంది. ఉదాహరణకు ఉదయం సాయంత్రం టీతో పాటు బ్రెడ్, జామ్‌తో బ్రెడ్, పోహాతో బ్రెడ్, ఆమ్లెట్‌తో బ్రెడ్ లాంటి వంటకాలు అందరూ తింటున్నారు. కానీ ఈ తెల్లబ్రెడ్ శరీరానికి చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బ్రెడ్ రోజూ తినడం వల్ల ఆటో బ్రూవరీ సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధి తలెత్తే అవకాశం ఉంది. ఇది వచ్చినప్పుడు మద్యం తాగినట్టే మత్తు అనుభవం కలుగుతుంది. నీరసం, తల తిరుగుడు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఎక్కువ మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకున్నప్పుడు ఈ సమస్య రాగలదని అంటున్నారు. బ్రెడ్ శరీరంలో పూర్తిగా జీర్ణం కాకపోవడం వల్ల అది ఇథనాల్ లేదా ఆల్కహాల్గా మారుతుంది. ఇది శరీరంపై మద్యం తాగినపుడు కలిగే దాని కంటే ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. అలాగే ప్రేగుల్లో తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. దీని వల్ల బ్రూవరీ సిండ్రోమ్‌కు దారితీస్తుంది.
Also Read: ప్రోటీన్ ఫుడ్స్ తినడం హానికరం.. ఆ వ్యాధులు ఉన్నవారు అసలు తినకూడదు
ఈ వ్యాధిని గట్ ఫెర్మెంటేషన్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తారు. ఇది శరీరంలో నిజంగా మద్యం తీసుకోకపోయినా మత్తుగా అనిపించే ఒక అరుదైన వైద్య పరిస్థితి. బ్రెడ్ పూర్తిగా జీర్ణం కాక, శరీరంలో గట్లో (పేగుల్లో) కిణ్వ ప్రక్రియ జరగడం వల్ల ఆల్కహాల్ ఉత్పత్తి అవుతుంది. ఈ స్థితి వల్ల శరీరంలో మత్తుగా అనిపించటం సహజం.
అలాంటప్పుడు దానికి నివారణ కోసం — పోషకాహార నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. బ్రెడ్ తినకుండా ఉండాలి. బాగా ఆకలేసినపుడు, చేతిలో వేరే ఆహారం లేనపుడు మాత్రమే బ్రెడ్ తినాలని సూచిస్తున్నారు. అలాగే అధిక ఫైబర్ ఉన్న ఫుడ్స్‌ని నిత్యజీవితంలో ఆహారంగా చేర్చితే, బ్రెడ్ వల్ల వచ్చిన వ్యర్థాలు శరీరం నుంచి సులభంగా బయటికి వెళ్లిపోతాయని చెబుతున్నారు.
అంతిమంగా, బ్రెడ్ రోజూ తినే వారు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.