పరీక్షల కాలం వచ్చేసింది. పిల్లలందరూ పరీక్షలకు రాయడం మొదలుపెట్టేశారు. ఈ సమయంలో వారికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. పిల్లల మెదడుకు మేలు చేసే ఆహారం ఇస్తే వారిలో ఏకాగ్రత పెరుగుతుంది. చదివినది గుర్తుంటుంది. అలాగే వారిని రోగనిరోధక శక్తి కూడా బలంగా మారుతుంది.
పిల్లల్లో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుంది. సరైన ఆహారాన్ని తినడం ద్వారా జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను, అభ్యాస సామర్ధ్యాన్ని పెంచవచ్చు. ఆధునిక ప్రపంచంలో ఫాస్ట్ ఫుడ్ అధికంగా తింటున్నారు. పిల్లలు తీపి పదార్థాలను కూడా అధికంగా తింటున్నారు. వీటివల్ల వారి మెదడు మందగించే అవకాశం ఎక్కువ. కాబట్టి వీటిని తగ్గించి వారి మెదడుకు మేలు చేసే ఆహారాన్ని తినాల్సిన అవసరం ఉంది.
పిల్లల మెదడు అధిక శక్తితో పనిచేసే ఒక ఇంజన్ లాగా ఉంటుంది. అది పనిచేయాలంటే సరైన ఇంధనం అవసరం. ఆ ఇంధరమే కొన్ని రకాల పోషకాహారాలు. అవి వాల్ నట్స్, కొవ్వు చేపలు. వీటిలో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు వంటివి ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచడంతోపాటు అభ్యాసానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. మెదుడుకు ఆక్సిజన్ రవాణాను పెంచుతాయి. ఏకాగ్రతను మెరుగుపరిచి చదివినవి గుర్తుండేలా చేస్తాయి.
పిల్లల్లో ఇనుము లోపించినా కూడా వారు దేని మీద శ్రద్ధ పెట్టలేరు. కాబట్టి ఇనుము అధికంగా ఉంటే పాలకూర, పప్పులు, నట్స్ వంటివి ప్రతిరోజూ తినిపించేందుకు ప్రయత్నించండి.
పిల్లల ఆహారంలో శుద్ధి చేసిన చక్కెర అధికంగా లేకుండా చూసుకోండి. అంటే పంచదారతో చేసిన ఆహారాన్ని తక్కువగా పెట్టాలి. ఇది వారి అభిజ్ఞా పని తీరును, జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది. ముఖ్యంగా పరీక్షల వేళ మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే ఊబకాయం బారిన పడేలా చేస్తుంది. కాబట్టి ప్రాసెస్ చేసిన స్నాక్స్ ను, పంచదార నిండిన పదార్థాలను వారికి తినిపించకపోవడమే ఉత్తమం.
గుడ్లు, పాల ఉత్పత్తులు, కాయధాన్యాలు, లీన్ మాంసాలు పిల్లల రోజువారీ ఆహారంలో భాగం చేస్తే అందులో ఉండే ప్రోటీన్ వారికి ఆరోగ్యాన్ని అందిస్తుంది. పిల్లలకు తగినంత ప్రోటీన్ లభించకపోతే వారు సరిగా చదవలేరు. కాబట్టి ప్రతి భోజనంలో ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. విటమిన్ బి12 కూడా వారికి అందాలి. పండ్లు, రకరకాల కూరగాయల ద్వారా యాంటీ ఆక్సిడెంట్లు కూడా వారి శరీరానికి అందుతాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి.
Also Read: వీటిని పొరపాటున కూడా ఫ్రిజ్‌లో.. పెట్టకూడదు తెలుసా ?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.