అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ మిసైల్ ని భారత్ ప్రయోగించింది. ఇందులో వింతేముంది, గతంలో కూడా అగ్ని మిసైల్స్ ని భారత్ ప్రయోగించింది. ఆగస్ట్ లో ఒడిశాలోని చాందీపూర్ నుంచి కూడా విజయవంతంగా ప్రయోగించింది. కానీ ఈ ప్రయోగం చాలా అరుదైనది. ఎందుకంటే క్షిపణి ప్రయోగా శాలను ఉపయోగించకుండా, లాంచ్ ప్యాడ్ లాంటి ప్రత్యేక ఏర్పాట్లు లేకుండా ఒక రైల్వే బోగీ నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. రైల్ బేస్డ్ మొబైల్ లాంచర్ ని దీనికోసం ఉపయోగించారు. అతి తక్కువ సమయంలో అవసరమైన చోటుకి ఈ మిసైల్ ని తీసుకెళ్లి ప్రయోగించేలా మొబైల్ లాంచింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసినట్టు తెలిపారు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.
https://x.com/rajnathsingh/status/1971051269692494275
అత్యాధునికం..
అగ్నిప్రైమ్ మిసైల్ అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంది. ఇది భారత రక్షణ వ్యవస్థకు అదనపు బలాన్ని చేకూరుస్తుందని అంటున్నారు. దీనికి అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం కూడా ఉంది. రింగ్ లేజర్ గైరో ఆధారిత ఇనర్షల్ నేవిగేషన్ సిస్టమ్, మైక్రో ఇనర్షల్ నేవిగేషన్ సిస్టమ్‌లు ఈ మిసైల్ లో ఉంటాయి. జీపీఎస్ తోపాటు, నావిక్ శాటిలైట్ నేవిగేషన్లను కూడా వాడుకుని టార్గెట్ ని ఛేదిస్తుంది ఈ మిసైల్. దీన్ని కెనిస్టర్ డిజైన్ తో తయారు చేశారు. అంటే తేలిగ్గా ఎక్కడికైనా రవాణా చేసి భద్రపర్చవచ్చు. తాజాగా రైలు బోగీనుంచి దీన్ని లాంచ్ చేయడం విశేషం.
ఆ దేశాల సరసన భారత్..
అగ్ని ప్రైమ్ మిసైల్ ప్రయోగంతో రష్యా, అమెరికా, చైనా దేశాల సరసన భారత్ చేరినట్టయింది. ఇప్పటి వరకు ప్రపంచంలో రైల్వే వ్యవస్థను ఉపయోగించుకుని మిసైల్స్ ని ప్రయోగించే సామర్థ్యం అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఉంది. ఉత్తర కొరియా కూడా 2021లో ఇలాంటి ప్రయోగాన్ని చేపట్టినట్టు ప్రకటించింది. రైల్వే బోర్న్ సిస్టమ్ తో ఈ ప్రయోగం చేశానంది నార్త్ కొరియా. ఈ క్షిపణి ప్రయోగాన్ని జపాన్, సౌత్ కొరియా ధృవీకరించినా.. ఎక్కడ్నుంచి దాన్ని ప్రయోగించారనే విషయంపై వారు స్పందించలేదు.
ఏంటి లాభం..?
చాందీపూర్ సహా ఇతర ప్రాంతాల్లో క్షిపణి ప్రయోగ కేంద్రాలు ఉన్నాయి. అలాంటి ప్రాంతాలను వదిలిపెట్టి రైలు బోగీనుంచి అగ్ని ప్రైమ్ ని ప్రయోగించాల్సిన అవసరం ఏముంది? దీనికి నిపుణులు ఆసక్తికర సమాధానాలు చెబుతున్నారు. సహజంగా క్షిపణనులను తరలించడం కష్టం. అంటే క్షిపణి రవాణా అనేది అత్యంత భద్రత మధ్య జరగాల్సి ఉంటుంది. టార్గెట్ ని రీచ్ అయ్యేలా క్షిపణిని మోహరించడం కోసం ఒక చోటనుంచి ఇంకో చోటకు తరలిస్తుంటారు. రైల్వే బోగీల్లో క్షిపణిని తరలించడం సాధ్యమైతే 70 వేల కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్స్ ఉన్న భారత్ లాంటి దేశాలకు అది ఎంత ఉపయోగకరమో ఆలోచించండి. అంతే కాదు, రవాణాతోపాటు లాంచింగ్ కూడా రైలు బోగీనుంచే సాధ్యం కావడంతో శత్రు దేశాలు అప్రమత్తం అయ్యే లోపు క్షిపణులతో విరుచుకుపడే అవకాశం ఉంటుంది.
శత్రుదేశాల కళ్లుగప్పి..
ఇటీవల ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ డ్రోన్లు, మన సైనిక స్థావరాలను టార్గెట్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. సహజంగా ఇలాంటి క్షిపణులను సైనిక స్థావరాల్లో దాచిపెడుతుంటారు. కానీ ఇప్పుడు కేవలం రైలు బోగీలో దాచి ఉంచి శత్రు దేశాల కళ్లుగప్పి వాటిని సమయానుకూలంగా ప్రయోగించవచ్చు. శత్రు దేశాల శాటిలైట్స్ నుంచి కూడా వీటిని దాచి ఉంచొచ్చు. రైల్వే టన్నెళ్లలో వీటిని భద్రపరిచేందుకు అవకాశం కూడా ఉంటుంది. భద్రపరిచే ప్రాంతాలు, లాంచింగ్ ప్యాడ్ ల విషయంలో అనేక ఆప్షన్లు మనకు ఉంటాయి. అందుకే ఈ రైల్ బేస్డ్ అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం అత్యంత స్పెషల్ గా మారింది.