Fermented Food: పులియబెట్టిన ఆహారాలు అంటే సహజంగానే బ్యాక్టీరియా, ఈస్ట్ లేదా ఇతర సూక్ష్మజీవుల సహాయంతో కిణ్వ ప్రక్రియకు గురైన ఆహారాలు. ఈ ప్రక్రియలో.. పిండిపదార్థాలు, చక్కెరలు ఆల్కహాల్ లేదా ఆర్గానిక్ ఆమ్లాలుగా మారుతాయి. ఇడ్లీ, దోశ, పెరుగు, ఊరగాయలు వంటివి పులియబెట్టిన ఆహారాలకు కొన్ని ఉదాహరణలు. ఈ ఆహారాలు కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా.. మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
పులియబెట్టిన ఆహారాల వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలలో ఒకటి జీర్ణక్రియ మెరుగు పడటం. కిణ్వ ప్రక్రియ ద్వారా ఆహారంలోని పోషకాలు సులభంగా జీర్ణమవుతాయి. ఈ ఆహారాలలో ఉండే ప్రోబయోటిక్స్ అనే మంచి బ్యాక్టీరియా మన పేగులలోని సూక్ష్మజీవుల సమతుల్యతను కాపాడుతుంది. అంతే కాకుండా ఇది అజీర్తి, మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి జీర్ణ సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి.
పులియబెట్టిన ఆహారాలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. మన పేగుల్లోని 80% రోగనిరోధక కణాలు ఉంటాయి. ప్రోబయోటిక్స్ ఈ కణాల పనితీరును మెరుగుపరచి.. శరీరంలోకి ప్రవేశించే హానికరమైన సూక్ష్మజీవులను ఎదుర్కోవడానికి సహాయ పడతాయి. అంతే కాకుండా తద్వారా జలుబు, ఫ్లూ వంటి సాధారణ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి.
ఇవి మెదడు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. పేగులు, మెదడు మధ్య ఉన్న సంబంధాన్ని “గట్-బ్రెయిన్ యాక్సిస్” అంటారు. ప్రోబయోటిక్స్ ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ ఆహారాలలో ఉండే అమైనో ఆమ్లాలు, విటమిన్లు మెదడు పనితీరుకు తోడ్పడతాయి.
పులియ బెట్టిన ఆహారాలు పోషక విలువలను కూడా పెంచుతాయి. ఉదాహరణకు.. కిణ్వ ప్రక్రియలో విటమిన్ B, విటమిన్ K వంటివి ఉత్పత్తి అవుతాయి. అలాగే.. ఆహారంలోని యాంటీ-న్యూట్రియెంట్స్ అనే కొన్ని పదార్థాలు, అవి పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. కిణ్వ ప్రక్రియ ద్వారా ఈ యాంటీ-న్యూట్రియెంట్స్ తగ్గుతాయి. తద్వారా ఖనిజాలు, విటమిన్లు శరీరం సులభంగా గ్రహిస్తుంది.
ఈ ప్రయోజనాలతో పాటు, పులియబెట్టిన ఆహారాలు బరువు తగ్గడానికి కూడా ఉపయోగ పడతాయి. పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా బరువు నియంత్రణలో సహాయ పడుతుంది. అలాగే.. ఇవి ఆకలిని తగ్గించి, కడుపు నిండిన భావనను కూడా కలిగిస్తాయి.
పులియ బెట్టిన ఆహారాలను ఎంచుకునేటప్పుడు.. అవి సహజంగా తయారు చేయబడినవి, అధిక ఉప్పు, చక్కెర లేదా కృత్రిమ పదార్థాలు లేనివై ఉండాలి. ఇంట్లో తయారు చేసిన పెరుగు, ఊరగాయలు, ఇడ్లీ పిండి వంటివి ఇందుకు మంచి ఎంపికలు. మొత్తం మీద.. పులియ బెట్టిన ఆహారాలు మన రోజువారీ ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం, ఇవి జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అంతే కాకుండా రొగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. అందుకే వీలైనంత వరకు పులియ బెట్టిన ఆహారాలు తినడం అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.