Blood Cancer Symptoms: రక్తం క్యాన్సర్ లేదా లుకేమియా అనేది రక్తం, ఎముక మజ్జ, శోషరస వ్యవస్థలో మార్పు వల్ల వచ్చే ఒక రకమైన క్యాన్సర్. ఇది ఎముక మజ్జలో అసాధారణ రక్త కణాలు ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల వస్తుంది. మొదటి దశలో దీని లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే త్వరగా గుర్తించడం వల్ల చికిత్స సులభం అవుతుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రక్తం క్యాన్సర్ మొదటి దశలో సాధారణంగా కనిపించే కొన్ని ముఖ్య లక్షణాలు:
తరచుగా జ్వరం, రాత్రిపూట చెమటలు పట్టడం: ఎలాంటి కారణం లేకుండా తరచుగా జ్వరం రావడం, ముఖ్యంగా రాత్రిపూట తీవ్రమైన చెమటలు పట్టడం లుకేమియా తొలి లక్షణాల్లో ఒకటి.
అలసట, బలహీనత: శరీరంలో ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు తగ్గిపోవడం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. దీనివల్ల నిరంతరం అలసట, బలహీనత ఉంటాయి. చిన్నపాటి పనులు చేసినా త్వరగా అలసిపోతారు.
విపరీతంగా బరువు తగ్గడం: ఆహారపు అలవాట్లు మార్చుకోకపోయినా.. వ్యాయామం చేయకపోయినా అకస్మాత్తుగా బరువు తగ్గడం ఒక ముఖ్యమైన లక్షణం.
తరచుగా గాయాలు లేదా రక్తస్రావం: శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోవడం వల్ల చిన్నపాటి దెబ్బలకే తీవ్రమైన గాయాలు, రక్తస్రావం (రక్తం గడ్డకట్టకపోవడం) అవుతాయి. ఉదాహరణకు, బ్రష్ చేసినప్పుడు చిగుళ్ళ నుంచి రక్తం కారడం, ముక్కు నుంచి రక్తం రావడం వంటివి జరుగుతాయి.
చర్మంపై చిన్న ఎర్రటి మచ్చలు: ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గడం వల్ల చర్మంపై చిన్న చిన్న ఎర్రటి లేదా ఊదా రంగు మచ్చలు కనిపిస్తాయి. ఇవి దద్దుర్లులాగా కనిపిస్తాయి.
శోషరస గ్రంథులు వాపు: మెడ, గజ్జలు లేదా చంకలలో శోషరస గ్రంథులు ఉబ్బి, వాపు కనిపిస్తుంది. అవి నొప్పి లేకుండా ఉంటాయి.
ఎముకలు లేదా కీళ్ళలో నొప్పి: ఎముక మజ్జలో అసాధారణ కణాలు పేరుకుపోవడం వల్ల ఎముకలు, కీళ్ళలో తీవ్రమైన నొప్పి వస్తుంది.
తరచుగా ఇన్ఫెక్షన్లు: శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే తెల్ల రక్త కణాలు తగ్గిపోవడం లేదా అవి సరిగా పనిచేయకపోవడం వల్ల తరచుగా ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. అవి త్వరగా తగ్గవు.
కడుపు నిండినట్లు అనిపించడం: లుకేమియా కణాలు కాలేయం లేదా ప్లీహాన్ని ప్రభావితం చేసినప్పుడు కడుపులో అసౌకర్యంగా.. నిండినట్లు అనిపిస్తుంది.
ఈ లక్షణాలు కేవలం లుకేమియాకే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా ఉంటాయి. అందుకే.. పైన చెప్పిన లక్షణాలలో ఏవి కనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం. తగిన పరీక్షలు చేయించుకుని.. సరైన రోగ నిర్ధారణ చేసుకుంటే ముందుగానే చికిత్సను ప్రారంభించి, మెరుగైన ఫలితాలు పొందవచ్చు.