Fish Amritsari Recipe: చేపలతో చేసే వంటకాల్లో ఫిష్ ఫ్రై అంటే చాలామందికి ఇష్టమే. అయితే ఈసారి కాస్త కొత్త రుచిని ప్రయత్నించాలనుకుంటే.. ‘ఫిష్ అమృత్‌సరి’ చేసుకోవచ్చు. శనగపిండి, కొన్ని మసాలా దినుసులతో చేప ముక్కలకు చక్కగా పట్టించి నూనెలో వేయిస్తే చాలు.. ఎంతో రుచికరమైన ఫిష్ అమృత్‌సరి రెడీ అవుతుంది. బయట పొర కరకరలాడుతూ, లోపల చేప మెత్తగా ఉండే ఈ వంటకం సాయంత్రం వేళ స్నాక్‌గా తినడానికి, ఇంటికి అతిథులు వచ్చినప్పుడు స్టార్టర్‌గా పెట్టడానికి కూడా బాగుంటుంది. ముఖ్యంగా నిమ్మరసం, ఉల్లిపాయ ముక్కలతో కలిపి తింటే దీని రుచి మరింత పెరుగుతుంది. మరి ఇంట్లోనే ఈ స్పెషల్ ఫిష్ అమృత్‌సరిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా..
చేప ముక్కలు – 500 గ్రాములు, శనగపిండి – అర కప్పు, బియ్యప్పిండి – 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్లు, కారం – ఒక టీస్పూన్, పసుపు – పావు టీస్పూన్, ధనియాల పొడి – ఒక టీస్పూన్, వాము – అర టీస్పూన్, గరం మసాలా – అర టీస్పూన్, ఉప్పు – తగినంత, కొత్తిమీర – కొద్దిగా, నీళ్లు – తగినన్ని, నూనె – డీప్ ఫ్రై చేయడానికి సరిపడా.
Also Read: చికెన్ కీమా పరోటా ఇలా చేసుకుని తిన్నారంటే.. టేస్ట్ వేరే లెవెల్ అంతే!
చేప ముక్కలను శుభ్రంగా కడిగి నీరు లేకుండా ఆరబెట్టుకోవాలి. ఒక వెడల్పాటి పాత్రలో చేప ముక్కలు తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, పసుపు, కారం, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత అదే పాత్రలో పెరుగు, కసూరీ మేథీ, చేతితో నలిపిన వాము, శనగపిండి, బియ్యప్పిండి వేసి ముక్కలకు మసాలా అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి. అవసరమైతే ఒక్క స్పూన్ నీరు చల్లుకుని మిశ్రమాన్ని చిక్కగా ఉండేలా చూసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కనీసం అర గంట సేపు నానబెడితే మసాలాలన్నీ చేప ముక్కలకు బాగా పడతాయి.
ఇప్పుడు బాణలిలో వేయించడానికి సరిపడా నూనె పోసి బాగా వేడెక్కనివ్వాలి. నూనె కాగిన తర్వాత మంటను మిడియం ఫ్లేమ్‌లో ఉంచి, నానిన చేప ముక్కలను ఒక్కొక్కటిగా నూనెలో వేయాలి. ముక్కలు బంగారు వర్ణం వచ్చే వరకు రెండు వైపులా తిప్పుతూ కరకరలాడేలా వేయించుకోవాలి. బాణలి నుండి తీసిన వేడివేడి చేప ముక్కలపై కొద్దిగా చాట్ మసాలా చల్లుకుని, సన్నగా కోసిన ఉల్లిపాయలు, నిమ్మకాయ ముక్కలతో వేడిగా సర్వ్ చేసుకుంటే నోరూరించే అమృత్‌సరి ఫిష్ ఫ్రై సిద్ధమైనట్లే.
Also Read: పక్కా దాబా స్టైల్ కాశ్మీరి దమ్ ఆలూ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో మర్చిపోలేరు!