Curd: పెరుగు మన ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వేసవి కాలంలో దీనివల్ల శరీర వేడి తగ్గుతుంది. కానీ పెరుగు మంచి ఆహారమే అయినప్పటికీ, దీనిని కొన్ని ప్రత్యేక ఆహారాలతో కలిపి తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మనం ప్రతిరోజూ తినే ఆహారపదార్థాల్లో కొన్ని పెరుగుతో కలిపి తినకూడదు. అవి శరీరంపై విరుద్ధ ప్రభావాన్ని చూపించవచ్చు.
ఇవి అస్సలు తొనొద్దు..
చేపలు తిన్న తర్వాత పెరుగు తినడం చాలా మంది చేస్తుంటారు. కానీ ఇది శరీరానికి మంచిదికాదు. ఎందుకంటే చేపలు తింటే శరీరంలో తాపం పెరుగుతుంది. ఇవి వేడి స్వభావం కలిగిన ఆహారం. అలాగే పెరుగు చలిని కలిగిస్తుంది. ఈ రెండు వ్యతిరేక స్వభావాలు కలిపి తీసుకుంటే శరీరంలో సమానత ఉండదు. ఇది జీర్ణక్రియను దెబ్బతీయొచ్చు. కొంతమందికి అలర్జీలు, చర్మంపై దద్దుర్లు, జలుబు, అసహనం వంటి సమస్యలు రావచ్చు. అంతేకాదు, కొన్నిసార్లు ఇది కడుపునొప్పి, గ్యాస్, వికారం వంటి సమస్యలకూ కారణమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
పెరుగుతో పాటు అరటి పండు..
ఇంకొంతమంది పెరుగుతో పాటు అరటి పండును తినడం ఇష్టపడతారు. ఇది ఆరోగ్యంగా కనిపించినా, దీని వల్ల కఫం పెరగవచ్చు. పెరుగు చల్లదనం కలిగించడమే కాక కఫాన్ని ప్రేరేపించగల స్వభావాన్ని కలిగి ఉంటుంది. అరటిపండులోనూ అదే లక్షణం ఉంటుంది. ఈ రెండు కలిసినపుడు శరీరంలో అధికంగా కఫం ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల శ్వాస సంబంధిత ఇబ్బందులు, మూడ్ డలైనెస్, నిద్రమత్తు, లేదా సరిగా జీర్ణం కాకపోవడం వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు లేదా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఈ కలయికను పూర్తిగా నివారించాలి.
పాలు- పెరుగు కలిపి తింటే..
ఇంకొక ముఖ్యమైన విషయం – పాలు మరియు పెరుగు. ఇవి రెండూ పాల ఉత్పత్తులే అయినా కూడా కలిపి తినకూడదని స్పష్టమైన హెచ్చరిక ఉంది. పాలు తాజా స్వభావం కలిగి ఉండగా, పెరుగు ఫర్మెంటెడ్. ఈ రెండు కలయిక శరీరానికి గందరగోళం కలిగించవచ్చు. జీర్ణక్రియ మందగిస్తుంది. కొన్ని సందర్భాల్లో వికారం, గ్యాస్, అజీర్ణం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఉదయం పాలు తాగిన వెంటనే పెరుగు తినడం వల్ల అసౌకర్యాలు ఏర్పడతాయి. కొన్నిసార్లు ఇది కడుపునొప్పికి దారితీస్తుంది.
జాగ్రత్తలు..
పెరుగును తినడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో తినడం మంచిది. రాత్రి వేళ తినాలంటే తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. వేడి ఆహారంతో చల్లని పెరుగు కలిపి తినడం మంచిది కాదు. వీటివల్ల జీర్ణక్రియపై ఒత్తిడి పడుతుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే తినే ఆహారం మంచి పదార్థమే కాక, సరిగ్గా జీర్ణం అయ్యేలా ఉండాలి. ఒక్కొక్క ఆహారం మంచిదే అయినా, వాటి కలయిక తప్పుదోవ పట్టించొచ్చు. అందుకే పెద్దలు చెప్పినట్లు, “ఏది తినాలో కన్నా, ఏది కలిపి తినకూడదో తెలుసుకోవడం ముఖ్యం”.