Food For Better Sleep: మంచి నిద్ర అనేది మన శారీరక, మానసిక ఆరోగ్యానికి అత్యంత కీలకం. సరైన నిద్ర లేకపోతే.. రోజువారీ పనులు సరిగా చేయలేకపోవడం, అలసట, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయి. నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి ఆహారం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొన్ని ఆహారాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందించి.. మెదడును ప్రశాంతంగా ఉంచి, నిద్రను ప్రేరేపిస్తాయి.
1. బాదం, వాల్‌నట్స్:
బాదం, వాల్‌నట్స్ మంచి నిద్రకు సహాయపడతాయి. వీటిలో మెగ్నీషియం, మెలటోనిన్ అనే రెండు ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. మెలటోనిన్ అనేది నిద్ర-మేల్కొనే చక్రాన్ని నియంత్రించే ఒక హార్మోన్. మెగ్నీషియం కండరాలను సడలించి, ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనివల్ల మంచిగా నిద్ర పడుతుంది. పడుకునే ముందు కొన్ని బాదం లేదా వాల్‌నట్స్ తినడం మంచిది.ఇలా చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
2. కివీ ఫ్రూట్:
కివీ ఫ్రూట్‌లో విటమిన్ సి, ఫైబర్, సెరోటోనిన్ అనే న్యూరోట్రాన్స్మిటర్ అధికంగా ఉంటాయి. సెరోటోనిన్ నిద్రను ప్రేరేపించే మెదడు రసాయనం. కొన్ని అధ్యయనాల ప్రకారం.. పడుకునే ఒక గంట ముందు రెండు కివీ ఫ్రూట్స్ తిన్నవారికి త్వరగా నిద్ర పట్టిందని అంతే కాకుండా నిద్ర నాణ్యత మెరుగుపడిందని తేలింది.
3. ఓట్స్:
ఓట్స్‌లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి నిదానంగా జీర్ణం అవుతాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. రాత్రిపూట ఆకలి వల్ల నిద్రకు అంతరాయం కలగకుండా చేస్తుంది. ఓట్స్‌లో మెలటోనిన్ కూడా కొద్ది మొత్తంలో ఉంటుంది. కాబట్టి ఇది నిద్రకు సహాయపడుతుంది. రాత్రిపూట తేలికపాటి ఓట్మీల్ తినడం నిద్రకు చాలా మంచిది.
4. చేపలు:
సాల్మన్, ట్యూనా వంటి కొవ్వు ఎక్కువగా ఉండే చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు పోషకాలు సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయ పడతాయి. దీనివల్ల మంచిగా నిద్ర పడుతుంది. వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ చేపలను తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.
5. అరటిపండు:
అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఈ రెండు ఖనిజాలు కండరాలను సడలించడంలో, నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచడంలో సహాయ పడతాయి. పడుకునే ముందు అరటిపండు తినడం మంచి నిద్రకు దారి తీస్తుంది.
6. గోరు వెచ్చని పాలు:
పాలు తాగడం అనేది ఒక సాంప్రదాయ చిట్కా. పాలలో ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఇది మెదడులో సెరోటోనిన్, మెలటోనిన్‌గా మారుతుంది. పడుకునే ముందు ఒక గ్లాసు వెచ్చని పాలు తాగడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఫలితంగా నిద్ర సులభంగా పడుతుంది.
Also Read: పురుషులతో పోలిస్తే.. మహిళల్లోనే మైగ్రేన్ బాధితులు ఎక్కువ, కారణమిదే
7. పుదీనా, చమోమైల్ టీ:
కెఫిన్ లేని పుదీనా లేదా చమోమైల్ టీ తాగడం నిద్రకు ముందు ఒక మంచి అలవాటు. ఈ టీలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, రసాయనాలు నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతాయి. అంతే కాకుండా ఒత్తిడి , ఆందోళనను తగ్గిస్తాయి.
మంచి నిద్ర కోసం.. రాత్రి పూట అధికంగా తినడం లేదా వేయించిన ఆహారాలకు దూరంగా ఉండటం ముఖ్యం. నిద్రకు ముందు ఒక కప్పు వెచ్చని పాలు లేదా కొన్ని బాదం పప్పులు తీసుకోవడం, అలాగే తేలికపాటి వ్యాయామం చేయడం వంటివి మంచి నిద్రకు సహాయ పడతాయి.