Cold Water: సమ్మర్‌లో మండే ఎండల నుంచి ఉపశమనం పొందడానికి ఇంటికి తిరిగి రాగానే చల్లటి నీటి కోసం వెతకడం సహజం. మనం ఫ్రిజ్ తెరవగానే, ఒక చల్లని నీళ్ల బాటిల్ మన ముందు కనిపిస్తుంది. వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా నీరు తాగుతుంటాము. ఇది తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.
కానీ ఇదే చల్లని నీరు మీ ఆరోగ్యానికి నెమ్మదిగా హాని కలిగిస్తుందని మీకు తెలుసా ? అవును చల్లటి నీరు శరీర సహజ వ్యవస్థను అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. ఎక్కువ సార్లు ఫ్రిజ్ లోని నీళ్లు తాగడం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
మీరు కూడా ఎక్కువగా ఫ్రిజ్ లోని నీళ్లు తాగుతుంటే మాత్రం ఇకనుండయినా జాగ్రత్తగా ఉండండి. చల్లటి నీరు తక్షణ ఉపశమనాన్ని ఇస్తే.. మరోవైపు జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, రక్త ప్రసరణ వంటి ముఖ్యమైన వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఫ్రిజ్‌లోని చల్లని నీరు తాగడం వల్ల కలిగే 5 నష్టాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్రిజ్‌లోని నీరు తాగడం వల్ల కలిగే నష్టాలు:
జీర్ణ ప్రక్రియను బలహీనపరుస్తుంది:
చల్లటి నీళ్లు తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. శరీర ఉష్ణోగ్రత సాధారణ 37°C ఉంటుంది. మనం ఫ్రిజ్ లోని చల్లటి నీరు త్రాగినప్పుడు.. శరీరం దానిని సాధారణ ఉష్ణోగ్రతకు తీసుకురావడానికి అదనపు శక్తిని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది జీర్ణ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. అంతే కాకుండా అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలను కలిగిస్తుంది.
గొంతు, శ్వాసకోశ వ్యవస్థకు నష్టం:
వేసవిలో ఎక్కువ చల్లటి నీరు తాగడం వల్ల గొంతు నొప్పి, వాపు, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. ఇది శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అంతే కాకుండా శ్లేష్మం ఏర్పడే అవకాశాలను పెంచుతుంది. ఇది జలుబు , దగ్గు సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా సైనస్ లేదా ఆస్తమా సమస్యలు ఉన్నవారికి ఇది మరింత హానికరం కావచ్చు.
గుండె, రక్త ప్రసరణ:
ఫ్రిజ్ లోని చల్లటి నీళ్లు తాగడం వల్ల రక్త నాళాలు సంకోచిస్తాయి. ఫలితంగా ఇది రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. అంతే కాకుండా గుండె సమస్యలకు కారణమవుతుంది. చల్లటి నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలోని శక్తి తగ్గిపోతుంది. త్వరగా అలసిపోయినట్లు అనిపిస్తుంది.
సహజ శీతలీకరణ వ్యవస్థ:
మన శరీరం తనను తాను చల్లబరచుకోవడానికి చెమట పట్టడం ద్వారా సహజమైన మార్గం. కానీ మనం చాలా చల్లటి నీరు త్రాగినప్పుడు.. చెమటలు అంతగా పట్టవు. దీని కారణంగా.. శరీరం లోపలి నుండి వేడిగా ఉంటుంది . ఫలితంగా అలసట, తలనొప్పి వంటి సమస్యలు పెరుగుతాయి.
కొవ్వు జీవక్రియపై ప్రతికూల ప్రభావాలు:
మీరు బరువు తగ్గాలనుకుంటే.. చల్లటి నీటిని తాగడం మానేయండి. చల్లటి నీరు శరీరంలోని కొవ్వును ఘనీభవించేలా చేస్తుంది. తద్వారా జీర్ణ ప్రక్రియ, కొవ్వు జీవక్రియ మందగిస్తుంది. దీని కారణంగా.. బరువు తగ్గించే ప్రక్రియ ప్రభావితమవుతుంది. అంతే కాకుండా శరీరంలో కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది.
Also Read: ఇది వాడితే.. తల మోయలేనంత జుట్టు
ఏం చేయాలి ?
మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే.. చల్లటి నీరు త్రాగడానికి బదులుగా.. రాగి పాత్ర లేదా మట్టి కుండలోని నీరు త్రాగండి. ఇది సహజంగా శరీరాన్ని చల్లబరచడమే కాకుండా.. జీర్ణక్రియకు సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. మీరు ఫ్రిజ్‌లోని చల్లటి నీరు తాగడం ప్రారంభించినప్పుడు.. ఈ ప్రతికూలతలను తప్పకుండా గుర్తుంచుకోండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.