Gen Z social media addiction: చేతిలో స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియాలో.. వేలాది మంది ఫాలోవర్లు… అయినా ఎందుకో మనసులో పెను ఒంటరితనం. ప్రస్తుత జెన్ జీ ఎదుర్కొంటున్న అతిపెద్ద మానసిక సమస్య ఇదే. సోషల్ మీడియాలో వచ్చే లైక్‌లు, కామెంట్లు , వర్చువల్ గుర్తింపే తమ సంతోషానికి కొలమానంగా మారుస్తున్న నేటి తరానికి, డిజిటల్ ప్రపంచం ఇస్తున్న మానసిక ఒత్తిడి ఎంతటిదో ఇటీవల జరిగిన ఓ సర్వే బట్టబయలు చేసింది.
నేటి యువత మానసిక ఆరోగ్యాన్ని సోషల్ మీడియా ఏ విధంగా ప్రభావితం చేస్తుందనే అంశంపై పెద్ద చర్చ జరుగుతోంది. జెన్ జీ తరానికి సోషల్ మీడియా ఇకపై కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే కాదు, వారి ఆత్మగౌరవానికి , గుర్తింపునకు ప్రధాన వేదికగా మారిపోయింది. ఓ తాజా సర్వేలో ఇందుకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన నిజాలు వెలుగుచూశాయి.
సాధారణంగా సోషల్ మీడియాలో వచ్చే లైక్‌లు, వ్యూస్ కేవలం నెంబర్లు అనుకుంటే పొరపాటే. సర్వేలో పాల్గొన్న 82.9% మంది విద్యార్థినులు తమ పోస్టులకు వచ్చే లైక్‌లు, కామెంట్లు నేరుగా తమ మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయని అంగీకరించారు. తాము ఆశించిన స్థాయిలో స్పందన రాకపోతే.. తమకు విలువ లేదని, తోటివారి కంటే వెనుకబడిపోయామనే న్యూనతా భావానికి గురవుతున్నారు. ఇతరుల ఆన్‌లైన్ విజయాలతో తమను నిరంతరం పోల్చుకోవడం వల్ల తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు.
ఫాలోవర్లు ఉన్నా ఎందుకు ఒంటరితనం?
ఈ సర్వేలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 61% మంది విద్యార్థినులకు సోషల్ మీడియాలో వేలాది మంది ఆన్‌లైన్ స్నేహితులు, ఫాలోవర్లు ఉన్నప్పటికీ, నిజ జీవితంలో తాము తీవ్రమైన ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. వర్చువల్ ప్రపంచంలో దొరికే లైక్‌లు క్షణకాలం ఆనందాన్ని ఇస్తాయేమో కానీ, కష్ట కాలంలో అండగా నిలిచే నిజమైన భావోద్వేగ బంధాలు అక్కడ ఉండవు. ముఖాముఖి సంబంధాలలో లభించే ఆత్మీయత, నమ్మకం ఆన్‌లైన్ స్నేహాలలో దొరకవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Also Read: మన జాతీయ జెండా వెనుక ఇంత పెద్ద కథ ఉందా?
నోటిఫికేషన్ల మాయలో యూత్:
ఫోన్ స్క్రీన్ పై నోటిఫికేషన్ రాగానే.. వెంటనే చూసే అలవాటు నేటి తరంలో.. వ్యసనంగా మారుతోంది. 48.2% మంది యూత్ నోటిఫికేషన్ రాగానే వెంటనే ఫోన్ చెక్ చేసుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాకుండా.. 70% మంది తాము సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా (డిజిటల్ డిటాక్స్) ఉండాలనుకుంటున్నప్పటికీ, దాని నుంచి బయటపడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్లు కూడా వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
సోషల్ మీడియా అనేది కేవలం కాలక్షేపం కోసం మాత్రమే ఉండాలి కానీ, మన సంతోషాన్ని, ఆత్మ గౌరవాన్ని శాసించే స్థాయికి దాన్ని చేర వేయకూడదు. వర్చువల్ లైక్‌ల వెంట పడకుండా, నిజ జీవిత సంబంధాలకు, ఆఫ్‌లైన్ స్నేహాలకు ప్రాధాన్యత ఇస్తేనే మానసిక ప్రశాంతత లభిస్తుంది. డిజిటల్ ప్రపంచంలో ఆరోగ్య కరమైన సమతుల్యతను పాటించడమే నేటి యువతకు అసలైన విజయం.