Eye Signs of Heart Health| కళ్లకు సంబంధించిన సమస్యలను చాలామంది చూపు తగ్గడం లేదా కళ్లజోడు అవసరం వరకు మాత్రమే ఆలోచిస్తారు. అయితే కళ్ల వెనుక భాగంలోని రెటీనాలో కనిపించే కొన్ని మార్పులు రక్తనాళాల ఆరోగ్యం గురించి సూచకలని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు రెటీనాలోని చిన్న రక్తనాళాలను ప్రభావితం చేయవచ్చని షార్ప్ సైట్ ఐ హాస్పిటల్స్‌కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మజ్హర్ నజీం ఖాన్ సూచించారు.
రెటీనా వెనుక భాగంలో చాలా చిన్న రక్తనాళాల నెట్‌వర్క్ ఉంటుంది. కంటి వైద్యుడు వీటిని ప్రత్యేక పరీక్షల ద్వారా నేరుగా పరిశీలించగలరు. అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు ఈ రక్తనాళాల్లో మార్పులకు కారణమవుతాయి. కొన్నిసార్లు ఇతర లక్షణాలు కనిపించకముందే ఈ మార్పులు కంటి పరీక్షలో కనిపించవచ్చు.
చూపు మసకబారడానికి అనేక కారణాలు ఉంటాయి. కంటి పవర్ మారడం, ఇతర కంటి సమస్యలు కూడా దీనికి కారణం కావచ్చు. అయితే అకస్మాత్తుగా లేదా కారణం తెలియకుండా చూపులో మార్పులు వస్తే నిర్లక్ష్యం చేయకండి. అలాంటి మార్పులకు సరైన కారణాన్ని తెలుసుకోవడానికి కంటి వైద్యుడిని సంప్రదించాలి.
వయసు పెరిగే కొద్దీ అప్పుడప్పుడు కళ్ల ముందు చిన్న ఫ్లోటర్లు కనిపించవచ్చు. ఫ్లోటర్స్ అంటే మీ చూపు పరిధిలో తేలుతూ కనిపించే చిన్న మచ్చలు, చుక్కలు లేదా దారం లాంటి ఆకారాలు. అయితే ఒక్కసారిగా ఫ్లోటర్లు ఎక్కువగా కనిపించడం మాత్రం జాగ్రత్తపడాల్సిన విషయం. డార్క్ స్పాట్స్ లేదా కాంతి మెరుపులు కూడా రెటీనాకు సంబంధించిన సమస్యలను సూచిస్తాయి. ఫ్లోటర్లతో పాటు కంటి ముందు తెర పడినట్లు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ఇలాంటి లక్షణాలు రెటీనా చీలడం లేదా రెటీనా వేరుపడటం వంటి సమస్యల్లో కనిపిస్తాయి.
కంటి పరీక్షలో రెటీనాపై చిన్న రక్తస్రావం లాగా ప్రాంతాలు వైద్యులకు కనిపించవచ్చు. మధుమేహం లేదా అధిక రక్తపోటు ఇలాంటి మార్పులకు కారణం కావచ్చు. అయితే రెటీనాలో రక్తస్రావం కనిపించిందంటే గుండె జబ్బు ఉందని అర్థం కాదు. వైద్యులు ఇతర కారణాలను కూడా పరిశీలిస్తారు.
ఎక్కువకాలం అధిక రక్తపోటు ఉంటే రెటీనా రక్తనాళాల్లో తీవ్ర మార్పులు కనిపించే అవకాశం ఉంది. కంటి పరీక్షలో వైద్యుడు ఇలాంటి మార్పులను గుర్తించవచ్చు. అయితే ఈ మార్పులకు కచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి అదనపు పరీక్షలు అవసరం.
Also Read: ఈ 5 రకాల వ్యక్తులతో స్నేహం చేస్తే మీ జీవితం నాశనమే.. ప్రశాంతంగా ఉండేందుకు ఈ జాగ్రత్తలు పాటించండి
ఒక కంటిలో అకస్మాత్తుగా చూపు తగ్గడం అత్యవసర పరిస్థితికి సంకేతం కావచ్చు. రెటీనా లేదా ఆప్టిక్ నర్వ్‌కు రక్తప్రవాహం అంతరాయం కలిగినప్పుడు ఇలాంటి సమస్య రావచ్చు. అందువల్ల అకస్మాత్తుగా చూపు కోల్పోతే ఆలస్యం చేయకుండా వైద్య సహాయం తీసుకోవాలి.
Also Read: 59 ఏళ్ల వయసులో ప్రభుత్వ టీచర్ ఉద్యోగం.. 27 ఏళ్ల సుదీర్ఘ పోరాటం
కళ్లలో కనిపించే మార్పులు మాత్రమే గుండె జబ్బును నిర్ధారించవు. ఫ్లోటర్లు, చూపు మసకబారడం, రక్తస్రావం వంటి లక్షణాలకు అనేక కారణాలు ఉండవచ్చు. అయితే కొన్ని రెటీనా మార్పులు శరీరంలోని రక్తనాళాల ఆరోగ్యంపై ముఖ్యమైన సూచనలు ఇస్తాయి. అవసరమైతే వైద్యులు రక్తపోటు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ వంటి పరీక్షలు సూచిస్తారు. అందుకే కళ్లలో అకస్మాత్తుగా వచ్చే మార్పులను నిర్లక్ష్యం చేయకుండా సరైన వైద్య పరీక్ష చేయించుకోవడం ముఖ్యం.