Geyser Safety Tips: చలికాలం మొదలవగానే దాదాపు ప్రతి ఇంట్లో గీజర్ల వాడకం విపరీతంగా పెరిగిపోతుంది. పొద్దున్నే వేడినీళ్లతో స్నానం చేస్తే ఆ చలి బాధ కొంతవరకు తగ్గుతుంది. కానీ, మనకు ఎంతో హాయినిచ్చే ఈ గీజర్ విషయంలో చిన్న అజాగ్రత్త వహించినా అది బాంబులా పేలిపోయే ప్రమాదం ఉందని మీకు తెలుసా? ప్రతి ఏటా శీతాకాలంలో గీజర్లు పేలిపోవడం, కరెంట్ షాక్ కొట్టడం వంటి ఘటనలు మనం చూస్తూనే ఉంటాం. నిజానికి ఇలాంటి ప్రమాదాలకు గీజర్లో ఉండే టెక్నికల్ లోపాల కంటే, మనం చేసే కొన్ని సాధారణ పొరపాట్లే ప్రధాన కారణమవుతున్నాయి. ఈ క్రమంలో ఇంట్లో గీజర్ వాడేటప్పుడు కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
చాలామంది పొద్దున్నే గీజర్ స్విచ్ ఆన్ చేసి గంటల తరబడి అలాగే వదిలేస్తుంటారు. నీళ్లు వేడెక్కగానే గీజర్ దానంతట అదే ఆగిపోయే ‘ఆటో-కట్’ ఫీచర్ ఉంది కదా అని ధీమాగా ఉంటారు. కానీ, ఒకవేళ థర్మోస్టాట్ పాడైతే నీళ్లు విపరీతంగా మరిగి ట్యాంకులో ఆవిరి పేరుకుపోతుంది. ఆ సమయంలో ప్రెజర్ రిలీజ్ వాల్వ్ సరిగ్గా పనిచేయకపోతే గీజర్ భారీ శబ్దంతో పేలిపోతుంది. కాబట్టి నీళ్లు వేడెక్కగానే స్విచ్ ఆఫ్ చేయాలి. ముఖ్యంగా స్నానానికి బాత్రూమ్‌లోకి వెళ్లే ముందే గీజర్ ఆఫ్ చేయడం ఎంతో సురక్షితం.
గీజర్ వాడకంలో చేసే రెండో పెద్ద తప్పు ట్యాంకులో నీళ్లు ఉన్నాయో లేదో చూసుకోకుండా స్విచ్ వేయడం. పైన వాటర్ ట్యాంక్ ఖాళీగా ఉన్నా లేదా ట్యాప్‌లో నీళ్లు తక్కువగా వస్తున్నా గీజర్ లోపలి హీటింగ్ కాయిల్ నీళ్లు లేకుండానే వేడెక్కుతుంది. దీనివల్ల కాయిల్ కాలిపోయి షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగే ప్రమాదం ఉంది.
చాలామంది ఏళ్ల తరబడి గీజర్‌కు సర్వీసింగ్ చేయించరు. ఉప్పు నీటి వల్ల గీజర్ లోపల, సేఫ్టీ వాల్వ్ మీద తెల్లటి గార పేరుకుపోతుంది. దీనివల్ల లోపలి ఆవిరి బయటకు వెళ్లే దారి మూసుకుపోతుంది. అందుకే ప్రతి ఏటా చలికాలం రాకముందే టెక్నీషియన్‌తో గీజర్ క్లీన్ చేయించి, థర్మోస్టాట్, ప్రెజర్ వాల్వ్ చెక్ చేయించడం చాలా ముఖ్యం.
మీరు గ్యాస్ గీజర్ వాడుతుంటే బాత్రూమ్‌లో గాలి బయటకు వెళ్లేందుకు సరైన వెంటిలేషన్ ఉండాలి. లేదంటే కార్బన్ మోనాక్సైడ్ నిండిపోయి ఊపిరాడక ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. ఇక ఎలక్ట్రిక్ గీజర్ల కోసం నాణ్యమైన వైరింగ్, ప్రత్యేకంగా ఒక ఎంసీబీ (MCB) స్విచ్ ఏర్పాటు చేసుకోవాలి. అలాగే స్నానం చేసేటప్పుడు నీళ్లు నేరుగా గీజర్ మీద పడకుండా కాస్త ఎత్తులో బిగించుకోవడం మంచిది.
Also Read: టెలికాం సంస్థలకు TRAI డెడ్‌లైన్.. 15 రోజుల్లో ఆ వివరాలు వెబ్‌సైట్‌లో పెట్టకపోతే భారీ జరిమానా!