PM Kusum: పునరుత్పాదక ఇంధన రంగంలో తెలంగాణ రాష్ట్రం మరో కీలక ముందడుగు వేస్తోంది. సౌర విద్యుత్ ఉత్పత్తిని విస్తరించడంతో పాటు రైతులను ఇంధన ఉత్పత్తిదారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం కుసుమ్-ఏ) పథకం గణనీయమైన పురోగతి సాధిస్తోంది. ఈ పథకం కింద ఇప్పటివరకు 1,156 మంది రైతులతో మొత్తం 1,797 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధించి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవడం విశేషం.
పీఎం కుసుమ్-ఏ పథకం అమలులో భాగంగా ఒప్పందాలు కుదుర్చుకున్న మొత్తం సామర్థ్యంలో ఇప్పటివరకు 442.3 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 266 సోలార్ ప్లాంట్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అంటే మొత్తం ఒప్పంద సామర్థ్యంలో సుమారు 24.6 శాతం మేర విద్యుత్ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు 1,354.7 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 890 ప్లాంట్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. మిగిలిన ప్లాంట్లు కూడా పూర్తయితే రాష్ట్ర సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరగనుంది.
సౌర విద్యుత్ ఉత్పత్తితో పాటు పవన విద్యుత్ రంగంలోనూ తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా పరిగి మండలం నజీరాబాద్ ప్రాంతంలో మైత్రా వాయు(గోదావరి) ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 100.8 మెగావాట్ల సామర్థ్యంతో పవన విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో పవన విద్యుత్ ఉత్పత్తి విస్తరణకు దోహదపడనుంది. ఇదిలాఉండగా పీఎం కుసుమ్-ఏ పథకం ద్వారా వ్యవసాయ రంగానికి అనుబంధంగా సౌర విద్యుత్ ఉత్పత్తి పెరగడంతో పాటు రైతులకు అదనపు ఆదాయ మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి. రైతులు కేవలం వ్యవసాయదారులుగానే కాకుండా విద్యుత్ ఉత్పత్తిదారులుగా ఎదిగేందుకు ఈ పథకం అవకాశాలు కల్పిస్తోంది.
సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సౌర, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం కీలక పరిణామంగా మారింది. సంప్రదాయ ఇంధన వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటం, స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తిని పెంచడం వంటి లక్ష్యాల సాధనలో ఈ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషించనున్నాయి. రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడటంతో పాటు రాష్ట్రాన్ని హరిత ఇంధన ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ అడుగులు వేస్తోంది.
Also Read: పాతకాలం నాటి కమ్మని కొబ్బరి బూరెలు.. ఈ సీక్రెట్ టిప్ పాటిస్తే మొదటిసారే పర్ఫెక్ట్‌గా కుదురుతాయి!