BRS Delimitation: నియోజకవర్గాల డీలిమిటేషన్ అంశం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతోంది. డీలిమిటేషన్ విషయంలో బీఆర్ఎస్ వ్యక్తం చేస్తున్న మద్దతు ధోరణి బీజేపీకి రాజకీయంగా కలిసొస్తుందా? లేక ఆ రెండు పార్టీలు ఒక్కటేనంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం కమలం పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందా? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే.. బీఆర్ఎస్ తన నిర్ణయాన్ని తెలంగాణ ప్రయోజనాలతో ముడిపెట్టింది. దక్షిణాది రాష్ట్రాల పార్లమెంటరీ ప్రాతినిధ్యంలో కోత పడకుండా రక్షణ కల్పించడం, తెలంగాణకు లోక్‌సభ స్థానాలు పెరగడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ డీలిమిటేషన్ ప్రతిపాదనకు మద్దతు ప్రకటించింది. ప్రతిపాదనలోని రక్షణాత్మక నిబంధనల వల్ల దక్షిణాది వాటాకు ముప్పు ఉండదని కేటీఆర్ చెబుతున్నారు. బీఆర్ఎస్‌కు చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయనున్నట్లు కూడా ప్రకటించారు.
బీఆర్ఎస్ తీసుకున్న ఈ నిర్ణయం కాంగ్రెస్ కు అస్త్రంగా మారింది. ఈ రెండు పార్టీలో ఒక్కటేనంటూ హస్తం పార్టీ సోషల్ మీడియాలో ఎదురుదాడి చేస్తోంది. కాంగ్రెస్ తన రాజకీయ ప్రచారానికి ఈ అంశాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉండటంతో తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న కమలం పార్టీకి ఇది కొత్త చిక్కులు తీసుకొచ్చినట్లయిందని శ్రేణులు భావిస్తున్నాయి. ఇప్పటివరకు కేంద్రంలోని బీజేపీ విధానాలను విమర్శిస్తూ వచ్చిన బీఆర్ఎస్, కీలకమైన డీలిమిటేషన్ అంశంలో బీజేపీ ప్రతిపాదనకు మద్దతు ఇవ్వడాన్ని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.
Also read: పాతకాలం నాటి కమ్మని కొబ్బరి బూరెలు.. ఈ సీక్రెట్ టిప్ పాటిస్తే మొదటిసారే పర్ఫెక్ట్‌గా కుదురుతాయి!
రెండు పార్టీల మధ్య అంతర్గత అవగాహన ఉందనే విమర్శలకు ఈ పరిణామం మరింత బలం చేకూర్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు కూడా కీలకం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయాలు బీజేపీ రాజకీయ విశ్వసనీయతపై ప్రభావం చూపే ప్రమాదం ఉందనే చర్చ సాగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ చేస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే ప్రచారం క్షేత్రస్థాయిలోకి వెళితే.., బీజేపీకి నష్టాన్ని తెచ్చి పెట్టే అవకాశముందని శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి.
బీఆర్ఎస్ మద్దతు ప్రస్తుతం తమకు రాజకీయంగా లాభమని బీజేపీ భావించినా బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనే అంశం ప్రజల్లోకి బలంగా వెళ్తే కాషాయ పార్టీ ఎదుగుదలకు పెద్ద దెబ్బ పడినట్లే అవుతుందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. అయితే ఈ అంశాన్ని కాంగ్రెస్ ఎంత సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్తుందన్నది కీలకంగా మారనుంది. మొత్తంగా చూస్తే.. డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించడం కేవలం పార్లమెంటరీ నిర్ణయంగా మిగిలిపోతుందా? లేక తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ విమర్శలు బీజేపీకి రాజకీయంగా ఎంతమేర నష్టం కలిగిస్తాయి? బీఆర్ఎస్ తన నిర్ణయాన్ని ప్రజల్లో ఎలా సమర్థించుకుంటుంది? అన్నదానిపైనే ఈ పరిణామాల ప్రభావం ఆధారపడి ఉంటుందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ఎదురుదాడిని బీజేపీ ఎలా అడ్డుకుని నిలబడుతుందనేది ఆసక్తికరంగా మారింది.
Also read: కారు.. కమలం పొత్తు?.. రాబోయే ఎన్నికల్లో కలిసిపోతారా..?