Hair Color: జుట్టుకు రంగు వేయడం అంటే మన స్టైల్‌ను మార్చడానికో, తెల్ల జుట్టును కవర్ చేయడానికో చాలా మంది ఇష్టపడే పద్ధతి. దీని వల్ల జుట్టు అందంగా కనిపిస్తుంది. అయితే దీని వల్ల జుట్టుపై చెడు ప్రభావం పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కలర్ వేసినప్పుడు జుట్టుకు ఏం జరుగుతుంది? రసాయనాలు ఎలా పనిచేస్తాయి? దీనివల్ల ఏమైనా సమస్యలు వస్తాయా? అనే వాటి గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అసలు జుట్టుకు కలర్ వేయడం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
జుట్టు రంగు ఎలా పనిచేస్తుంది?
జుట్టుకు రంగు వేయడం అంటే కెమికల్స్‌తో జుట్టు రంగును మార్చడం. వీటిలో ఉండే అమ్మోనియా జుట్టు బయటి పొరను తెరిచి, రంగు లోపలి పొరలోకి వెళ్లేలా చేస్తుందట. హైడ్రోజన్ పెరాక్సైడ్ అనే కెమికల్ జుట్టులోని సహజ రంగును తొలగించి, కొత్త రంగును సెట్ చేస్తుంది. రంగు వేసినప్పుడు, అమ్మోనియా జుట్టు బయటి పొరను తెరుస్తుంది, పెరాక్సైడ్ సహజ రంగును తీసేస్తుంది. ఆ తర్వాత కొత్త రంగు జుట్టు లోపలి పొరలో సెట్ అవుతుంది.
హయిర్ కలర్ వల్ల సమస్యలు?
రంగు వేయడం వల్ల మన లుక్ చేంజ్ అవుతుంది. కానీ తప్పుగా చేస్తే లేదా ఎక్కువగా జుట్టును డై చేస్తే కొన్ని సమస్యలు రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
జుట్టు డ్యామేజ్:
అమ్మోనియా, పెరాక్సైడ్ వల్ల జుట్టు బలం తగ్గి, పొడిగా, గరుకుగా మారుతుంది. చివరలు చీలిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ బ్లీచింగ్ చేస్తే జుట్టులోని సహజ నూనెలు పోయి, జుట్టు విరిగిపోతుందట.
తల చర్మం సమస్యలు:
రంగుల్లో ఉండే PPD వంటి కెమికల్స్ తల చర్మంలో ఎరుపు, దురద లేదా మంటను కలిగిస్తాయని డెర్మటాలజిస్ట్‌లు చెబుతున్నారు. కొందరికి అలెర్జీ వచ్చి, వాపు లేదా చర్మ సమస్యలు రావచ్చట.
జుట్టు రాలడం:
ఎక్కువ కెమికల్స్ ఉపయోగిస్తే జుట్టు కుదుళ్లు బలహీనపడి, తాత్కాలికంగా జుట్టు రాలొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.హెవీ ట్రీట్‌మెంట్స్ వల్ల జుట్టు తల చర్మం దగ్గరే విరిగిపోవచ్చట. సరిగ్గా వాడకపోతే లేదా తప్పు ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే రంగు అసమానంగా లేదా త్వరగా పోతుంది.
ఆరోగ్య సమస్యలు:
శాశ్వత రంగులను ఎక్కువ కాలం ఉపయోగిస్తే కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే గర్భిణీలు మొదటి మూడు నెలల్లో జుట్టుకు కలర్లు వాడకపోవడం మంచిదని సూచిస్తున్నారు.
జుట్టును రక్షించడం ఎలా?
సమస్యలు రాకుండా జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రంగు వేయడానికి 48 గంటల ముందు ప్యాచ్ టెస్ట్ చేసి, అలెర్జీ ఉందో లేదో చూడడం మంచిది. రంగు వేసిన ముందు, తర్వాత డీప్ కండిషనింగ్ ట్రీట్‌మెంట్ వాడాలి.