కుక్క కాటు ప్రమాదకరమైనది. వీధుల్లో ఉండే కుక్కలకు ఎలాంటి వ్యాక్సిన్ లు వేయించరు. కాబట్టి అవి కరిస్తే రేబిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు రావచ్చు. మన దేశంలో ప్రతి ఏడాది 20వేల మంది కుక్కకాటు కారణంగానే రేబిస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా వీధి కుక్కలే వీటికి కారణం అవుతున్నాయి. ఒంటరిగా ఉన్న వారిపై కుక్కల గుంపు దాడి చేయడానికి చూస్తాయి. అరవడం మీ చుట్టూ తిరగడం వంటివి చేస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి.
కుక్కల గుంపుతో జాగ్రత్త
వీధి కుక్కలు మిమ్మల్ని చుట్టుపట్టినప్పుడు మీరు ఎలా ప్రవర్తించాలో తెలుసుకోండి. కుక్కల గుంపు దూకుడుగా కోపంగా ఉన్నట్టు కనిపిస్తే మీరు వాటినుండి దూరంగా ఎప్పుడూ పరిగెత్తకండి. ఇలా చేయడానికి బదులుగా కదలకుండా నిటారుగా నిలుచోండి. మీ చేతులను ఛాతీపై ముడుచుకొని పెట్టుకోండి. కుక్కలని నేరుగా చూడకుండా వేరే ప్రదేశాలను చూడండి. కుక్కలు మిమ్మల్ని దగ్గరగా వచ్చి వాసన చూస్తుంటే భయపడకండి. అవి వాసన చూడనివ్వండి. ఇలా చేస్తే కుక్కలకు మీపై ఉన్న ఆసక్తి పోయి అక్కడ నుంచి వెళ్లిపోతాయి.
కుక్కల గుంపు మధ్యలో చిక్కుకుపోయినప్పుడు నేరుగా వాటి కళ్ళల్లోకి ఎప్పుడూ చూడకండి. అలా చేస్తే అవి మరింత దూకుడుగా ప్రవర్తిస్తాయి. మీపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి.
నెమ్మదిగా నడవండి
మీరు కుక్కల గుంపును చూసినప్పుడు వాటి నుంచి దూరంగా వెళ్లాలని అనుకుంటారు. అలా వెళ్లాలి అనుకున్నప్పుడు చాలా నెమ్మదిగా నడవాలి. అలాగే వాటిని చూడకూడదు. చూడకుండా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లాలి. ఎప్పుడైతే మీరు వేగంగా నడుస్తారో అవి మీ వైపు దాడి చేయడానికి వస్తాయి.
కుక్కల గుంపు దూకుడుగా, కోపంగా మీ వైపు చూస్తున్నప్పుడు వాటి మీద అరవడానికి గాని ఏదైనా రాళ్ళను విసిరి వాటిని భయపెట్టి పంపించడానికి కానీ ప్రయత్నించకండి. వీలైనంతగా ప్రశాంతంగా ఉండండి. అవి మిమ్మల్ని చుట్టుకుంటే అప్పటికి కూడా మీరు ప్రశాంతంగా ఉండాలి. అవి మిమ్మల్ని వాసన చూసి వెళ్లిపోతాయి. ఎప్పుడైతే మీరు వాటిపై అరుస్తారో అవి వెంటనే మీపై దాడి చేసే అవకాశం ఉంది.
దూరం నుంచే కుక్కలు గుంపును చూసినట్లయితే అటువైపు వెళ్ళకండి. కుక్కలన్నీ అరుస్తూ గుర్రు పెడుతూ ఇటు అటు నడుస్తూ కనిపిస్తున్నాయంటే… అవి చాలా దూకుడుగా కొంత కోపంగా ఉన్నాయని అర్థం. అలాంటి ప్రదేశానికి వెళ్లకపోవడమే ఉత్తమం.