Tirumala News: భక్తులతో నిత్యం రద్దీగా ఉంటోంది తిరుమల తిరుపతి దేవస్థానం. స్వామి దర్శనం కోసం వచ్చినవారు ఒకవైపు.. దర్శనం తర్వాత వెళ్తున్నవారు ఇంకోవైపు. సీజన్ ఏదైనా రద్దీ అలాగే ఉంటుంది. అయితే ఆగస్టు 5 నుంచి 7 వరకు తిరుమలలో పవిత్రోత్సవాలకు శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు టీటీడీ అధికారులు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రం తిరుమల. నిత్యం ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. తిరుమలలో స్వామివారికి ఏడాదిలో 450కి పైగా ఉత్సవాలు జరుగుతాయని వివిధ పురాణాలు చెబుతున్నాయి. తాజాగా మరో ఉత్సవానికి సిద్ధమైంది. ఈనెల ఆగస్టు 5 నుంచి 7 వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి.
నాలుగున అంకురార్పణతో పవిత్రోత్సవాలు మొదలవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో అర్చనలు, యాత్రికులు లేదా సిబ్బంది వల్ల చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు, దోషాలు జరుగుతాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రాకుండా ఉండేలా ఆగమ శాస్త్రం ప్రకారం వీటిని నిర్వహిస్తారు.
ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య స్నపన తిరుమంజనం చేస్తారు. సాయంత్రం వేళ శ్రీదేవి-భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
ALSO READ: ఏపీకి ల్యాండ్ మార్క్.. క్వాంటమ్ వ్యాలీ
పవిత్రోత్సవాలు ఇప్పటిది కాదు. వందల సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు పురాణాలు చెబుతున్నాయి. 1962 ఏడాది నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను చేస్తూ వస్తోంది. ఆగస్టు 4న అంకురార్పణ జరుగుతుంది. ఆగస్టు 5న పవిత్రాల ప్రతిష్ట కార్యక్రమం ఉండనుంది.
ఆగస్టు 6న పవిత్ర సమర్పణ జరుగుతుంది. ఆగస్టు 7న పూర్ణాహుతి కార్యక్రమాలతో ముగియనుంది. పవిత్రోత్సవాల్లో భాగంగా సహస్రదీపాలంకార సేవను రద్ధు చేశారు టీటీడీ అధికారులు. ఆగస్టు 5 నుంచి 7 వరకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేశారు అధికారులు.